Eco friendly transportation

విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా అడుగులు

 

EV Charging

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే ఇంధన రంగంలో స్వావలంబనను సాకారం చేసుకొనే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. విద్యుత్‌ వాహనాల తయారీకి, శక్తిమంతమైన బ్యాటరీ సాంకేతికతల ఆవిష్కరణకు తోడ్పాటు అందిస్తోంది.

దేశ పారిశ్రామిక రంగం నేడు శరవేగంగా పురోగమిస్తోంది. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ మూడు కీలక రంగాలకు ప్రాధాన్యమివ్వడం ఇందుకు ఎంతగానో దోహదపడుతోంది. ఉత్పాదక వస్తువులు, భారీ విద్యుత్‌ ఉపకరణాలు, మోటారు వాహన రంగాలే అవి. ముఖ్యంగా సత్వరమే విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు ‘ఫేమ్‌-2’ వంటి పథకాలను తీసుకొచ్చింది. ఎంతో దార్శనికతతో కూడిన ఇటువంటి పథకాలు శుద్ధ, హరిత ప్రజారవాణా రంగంలో నవశకానికి నాంది పలుకుతున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని అవి చాటుతున్నాయి. వాహన, విడిభాగాల రంగంలో ఉత్పాదక నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించడానికి భారీ పరిశ్రమల శాఖ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం తీసుకొచ్చింది. ఇటువంటి చర్యలు అధునాతన వాహన సాంకేతికత (ఏఏటీ) ఉత్పత్తుల రంగంలో సరఫరా గొలుసులతో పాటు ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించడానికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. తద్వారా భారత్‌ను స్వయంసమృద్ధి వైపు నడిపిస్తూ ప్రపంచస్థాయి పోటీతత్వానికి ప్రోధి చేస్తున్నాయి.

ఈవీలకు ప్రోత్సాహం

ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న ఆత్మనిర్భర, వికసిత భారత్‌ దార్శనికతకు అనుగుణంగా భారీ పరిశ్రమల శాఖ దేశాన్ని ఆవిష్కరణ, విస్తరణల వైపు నడిపిస్తోంది. 2070 నాటికల్లా నికర శూన్య ఉద్గారాల స్థాయిని అందుకోవాలన్న గమ్యాన్ని చేరుకోవడానికి విద్యుత్‌ వాహనాల (ఈవీ)కు విశేష ప్రాధాన్యమిస్తోంది. ఎలెక్ట్రిక్‌ వాహనాల పురోగతి, వాటి పనితీరు, సామర్థ్యాల పెంపునకు ‘ఆధునిక రసాయన సెల్స్‌ (ఏసీసీ)’ కీలకమవుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ వాహన రంగంలో ఆవిష్కరణలకు లిథియం-అయాన్‌, సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు అత్యంత ముఖ్యం. ఎందుకంటే, వేగవంతమైన ఛార్జింగ్‌తోపాటు నిరాటంకంగా ప్రయాణించడానికి అవసరమైన చోదకశక్తిని ఇవి అందిస్తాయి. సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే ఈ బ్యాటరీలు ఎంతో భద్రమైనవి. మరింత ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా వీటిని అభివృద్ధి చేయడం ద్వారా వినియోగదారులను ఈవీల వైపు మళ్ళించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఏసీసీపై జరుగుతున్న పరిశోధనలు మరింత సమర్థ బ్యాటరీల ఆవిష్కరణకు దోహదపడతాయి. తద్వారా అవి వాహనాల ద్రవ్యరాశి తగ్గడానికి, సామర్థ్యం పెరగడానికి దారితీస్తాయి. కాబట్టే, సుస్థిర విద్యుత్‌ రవాణా పర్యావరణ వ్యవస్థకు ఆధునిక రసాయన బ్యాటరీలు మూలస్తంభమవుతున్నాయి.

బ్యాటరీల్లో ఉపయోగించే లిథియం విషయంలో పరిమితులను అధిగమించే కొత్త సాంకేతికతలు సమీప భవిష్యత్తులోనే అందిరానున్నాయి. వనరులను సమర్థంగా వినియోగించుకుని, చవక ధరలకే బ్యాటరీలను అందించడం ముఖ్యం. ఆ దిశగా సోడియం-అయాన్‌ బ్యాటరీలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో, మరింత సమర్థంగా శక్తిని నిల్వచేయడానికి ఇవి దోహదపడతాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో దార్శనికతతో ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ అడ్వాన్స్డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్‌’ కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ప్రవేశపెట్టింది. ఇటువంటి విధానాలు పటిష్ఠమైన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థ స్థాపనకు దోహదపడతాయి. 50 గిగావాట్‌ గంటల ఏసీసీ తయారీ సామర్థ్యాన్ని సాధించాలన్న సాహసోపేతమైన లక్ష్యాన్ని చేపట్టిన భారత్‌… బ్యాటరీ నిల్వ సామర్థ్యం విషయంలో అత్యున్నత స్థాయిని అందుకుంటుంది. వ్యూహాత్మక భాగస్వాములు, పారిశ్రామిక వ్యవస్థాపకులతో కూడిన ఏసీసీ-పీఎల్‌ఐ విధానం భారత ఇంధన స్వావలంబన ప్రయత్నంలోఒక నవోదయం!

నికర శూన్య ఉద్గారాల స్థాయి లక్ష్యం

కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్‌ ఇటీవల మధ్యంతర పద్దును ప్రవేశపెడుతూ… ఈవీ రంగాన్ని ఉరకలెత్తించే సమగ్ర వ్యూహాన్ని ప్రస్తావించారు. విద్యుత్‌ వాహన పర్యావరణ వ్యవస్థను పటిష్ఠీకరించే దిశగా తయారీ సామర్థ్యాల పెంపు, ఛార్జింగ్‌ వసతుల కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారత్‌ ‘కాప్‌-26’ సదస్సులో చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. దేశం 2070 నాటికి నికర శూన్య ఉద్గారాల స్థాయిని సాధించాలనే విశిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవి దోహపడతాయి. అంతేకాదు, వాహన రంగంలో ప్రపంచ ఛాంపియన్‌గా ఉద్భవించాలన్న ఆకాంక్షను నేరవేర్చుకోవడంతోపాటు పర్యావరణ సుస్థిరత, ఆర్థికాభివృద్ధి వంటి బహుముఖ లక్ష్యాల సాధనకూ ఈ చర్యలు ఎంతగానో కీలకమవుతాయి. ఆటోమోటివ్‌ రంగ పరిణామక్రమంలో ఆవిష్కృతమయ్యే విభిన్న బ్యాటరీ సాంకేతికతలు వేటికవే ప్రత్యేక సామర్థ్యాలు, లక్షణాలతో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఇప్పటికే శక్తి సామర్థ్యాలపరంగా, మన్నికలో లిథియం-అయాన్‌ బ్యాటరీలు ముందంజలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు జరిగే ఆవిష్కరణలు విద్యుత్‌ వాహన రంగ స్వరూపాన్ని సమూలంగా మార్చివేయగలవు. ఈవీలు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని, మరింత భద్రంగా ముందుకు సాగిపోవడానికి లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ బ్యాటరీలు ఇప్పుడిప్పుడే అందివస్తున్నాయి. పది గిగావాట్‌ గంటల (జీడబ్ల్యూహెచ్‌) సామర్థ్యంతో కూడిన ఆధునిక రసాయన బ్యాటరీ తయారీకి సంబంధించి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ- ఏసీసీ) రీ-బిడ్డింగ్‌కు సంబంధించి భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ప్రకటన వెలువరించింది. స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమిది. అనేకమంది దరఖాస్తుదారులు పీఎల్‌ఐ-ఏసీసీ కింద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా భారత్‌ దేశీయ ఉత్పాదకతలో అనూహ్య వేగం అందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది.

ప్రభుత్వం తీసుకుంటున్న అనేక విధానాల గొలుసుకట్టు ప్రభావం దేశీయ విద్యుత్‌ వాహనాల పర్యావరణ వ్యవస్థకు ఇతోధికంగా లాభిస్తోంది. ప్రధానంగా పీఎల్‌ఐ-ఏసీసీ పథకం వల్ల ఈ వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం జోరెత్తుతోంది. ఆవిష్కరణలకూ విస్తృతస్థాయిలో ఊతం లభిస్తోంది. ప్రైవేటు ప్రయత్నాల ద్వారా బ్యాటరీల సామర్థ్యాన్ని 60-80 గిగావాట్‌ గంటలకు పెంచే లక్ష్యం విద్యుత్‌ వాహన సాంకేతికతలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుంది. ఆధునిక రసాయన బ్యాటరీలతో కొత్త పుంతలు తొక్కడం ద్వారా విద్యుత్‌ వాహన రంగంలో పునరుజ్జీవానికి భారత్‌ సంసిద్ధమవుతోంది. ఓవైపు దార్శనిక విధానాలతో ఆవిష్కరణలకు ఊతమిస్తూ… మరోవైపు, పర్యావరణ హితకరమైన రీతిలో దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపిస్తూ… సుసంపన్నమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది.

మహేంద్రనాథ్ పాండే
భారీ పరిశ్రమల శాఖ మంత్రి