భారత సాగురంగంలో డ్రోన్ శకం
పంజాబ్‌లోని పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు నా దృష్టి సుదూరంగా వినిపిస్తున్న సన్నటి మొటారు శబ్దంపైకి మళ్లింది. ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తుందా? అని తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను కారు దిగాను. అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు మోటుగా కనిపిస్తున్న రైతులు నాకు స్వగతం పలికారు. వారు డ్రోన్ ను ఉపయోగించి ద్రవరూపం నానో యూరియాను పంటపై చల్లుతున్నారు. దేశంలోని ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో రైతులు ఒక కొత్త భావనను ఉత్సాహంగా ఆమోదీంచడం, అనుసరించడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది భారతదేశంలోని వ్యవసాయరంగానికి ‘డ్రోన్ క్షణం’ అని నేను భావించాను. ఇది మన దేశంలో ‘డ్రోన్ ఉద్యమానికి’ అద్దం పడుతుంది. తమ గ్రామంలో ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ వాహనం సందర్శించినప్పుడు వ్యవసాయ డ్రోన్ల గురించి తమకు తెలిసిందని రైతులు చెప్పారు. ద్రవ ఎరువులు, పురుగుమందులను అత్యంత సమర్ర్థంగా పిచికారీ చేయడానికి కొత్త సాంకేతికత చాలా ఉపయోగకరంగా ఉందని వారు చెప్పారు.
సాంప్రదాయకంగా ఎద్దుల బండి ఆధారిత వృత్తి నుండి ట్రాక్టర్ ఆధారిత వ్యవసాయం వైపు మారి భారతీయ వ్యవసాయం ఇప్పటికే ఒక దిశలో ప్రయాణించింది. వ్యవసాయ కార్యకలాపాలలో డ్రోన్ల వాడకం రూపంలో వ్యవసాయ విప్లవం మూడవ దశ ఆరంభాన్ని ఇప్పుడు చూస్తున్నాను. వ్యవసాయ-డ్రోన్ సాంకేతికత మన వ్యవసాయ పద్ధతులను ఆధునికీకకరించడంలో, మార్చడంలో నిజమైన పురోగతి అని స్పష్టం అవుతోంది. చేతి పంపుల ద్వారా పురుగు మందులు, ద్రవ ఎరువులను చేత్తో పిచికారీ చేసే దుర్భరమైన, ఎక్కువ సమయం తీసుకునే రోజులు పోయాయి. వాటి స్థానంలో ఉప్పుడు డ్రోన్లను ఉపయోగించి చల్లడం వంటి సమర్థమైన, ఉత్పాదకమైన సాంకేతికత వస్తోంది. వికసిత్, ఆత్మనిర్భర్ భారత్‌లో ముఖ్యమైన అంశమైన ఆహార భద్రత కల్పించేందుకు వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని, ఉత్పాదకతను మెరుగుపరచడానికి వ్యవసాయ పద్ధతుల ఆధునీకీకరణ అవసరం, అనివార్యం.
1960లనాటి హరిత విప్లవం కొత్త వ్యవసాయ ఉపకరణాలు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, పురుగు మందులు, రసాయన ఎరువులను ప్రవేశపెట్టింది. అయితే పర్యావరణం, నేల ఆరోగ్యం, భూసారం దీర్ఘకాలిక సుస్థిరతను కాపాడటానికి ఎరువులు, పురుగు మందుల వాడకంలో సమతౌల్యం, సంయమనం అవసరమని అనేక సంవత్సరాలుగా భావిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం జీవ, నానో, సేంద్రీయ ఎరువులు వంటి ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడానికి ‘పీఎం ప్రాణం’, ‘గోబర్ధన్’ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కొత్త కార్యక్రమాల గురించి అవగాహన పెంచడానికి, రైతులకు ఒకే కప్పు క్రింద సమగ్ర పరిష్కారాలను అందించడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (పిఎంకెఎస్ కెలు) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన నానో ఎరువులు సాంప్రదాయ రసాయన ఎరువులకు పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. ఇప్పుడు 45 కిలోల సంప్రదాయ యూరియాకు బదులుగా అర లీటర్ నానో యూరియా వాడవచ్చు. మెరుగైన పోషకాల వినియోగం, సామర్థ్యం, సులభంగా చల్లడం వంటి బహుళ ప్రయోజనాలతో పాటు నేల నాణ్యతను కాపాడుకోవడం, పంట దిగుబడిని మెరుగుపరచడంలో నానో ఎరువు సహాయపడుతుంది.
ఈ ప్రత్యామ్నాయాలను రైతులు విస్తృతంగా ఆమోదీంచి ఆదరించాలంటే వాటిని వినియోగించేందుకు సమర్థమైన పద్ధతులను అభివృద్ధి చేయాలి. రైతులు వీటి ప్రయోజనాలను అర్థం చేసుకునేందుకు వారికి వివరించే కార్యక్రమాలు చేపట్టాలి. భారతదేశపు కొత్త, చైతన్యశీల అంకుర సంస్థలు కిసాన్ డ్రోన్లను అభివృద్ధి చేయడం వల్ల ద్రవ ఎరువుల వినియోగానికి సమర్థమైన సాంకేతికతను రూపొందించడం సాధ్యమవుతుంది. ఎకరం పొలంలో నిముషాల్లో ఎరువు వేయగలగడం తమ పొలాల్లో గంటల తరబడి కష్టపడి శ్రమిస్తున్న రైతులకు వరంలా మారింది. వారి వద్ద ఎక్కువ ఖాళీ సమయం ఉండటంతో, రైతులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి, వారి జీవన నాణ్యతను మెరుగుపరుచుకోడానికి మరింత ఉత్పాదకమైన పనిలో నిమగ్నం కావచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళలకు సాధికారత కల్పించడం, దేశంలో మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధి వాటాను పెంచడంపై దృష్టి సారించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు అద్దెకు డ్రోన్ సేవలను అందించేందుకు ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ కార్యక్రమం కింద డ్రోన్లు అందచేస్తారు. ఈ వినూత్న కార్యక్రమం రైతులకు ద్రవ ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేయడానికి డ్రోన్లను సులభంగా అందుబాటులో ఉంచడమే కాకుండా మహిళా సాధికారత, గ్రామీణ సౌభాగ్యానికి కూడా దోహదం చేస్తుంది. ఇది దేశంలో డ్రోన్ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇచ్చి డ్రోన్ తయారీ స్టార్టప్‌లు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలలో డ్రోన్ పైలట్లు, డ్రోన్ మెకానిక్‌ల కోసం ఉపాధి కేంద్రాలను సృష్టించడం ద్వారా మహిళలకు, యువతకు ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తుంది. అదే సమయంలో గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలకు ఊపునిస్తుంది.
కొత్త కార్యక్రమాన్ని, ఆలోచనను విజయవంతంగా అమలు చేయాలంటే దాని గురించి సంబంధిత వ్యక్తులకు, సమూహాలకు సమర్థంగా తెలియజేయడం ముఖ్యం. 15 నవంబర్ 2023న ప్రారంభమైన దేశవ్యాప్త వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో డ్రోన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాత్ర సందర్భంగా అన్ని రాష్ట్రాలలో 50,000 కంటే ఎక్కువ డ్రోన్ ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనలు వ్యవసాయ కార్యకలాపాలలో కొత్త సాంకేతికతను అవలంబించడానికి రైతుల్లో విశేషమైన ఆసక్తిని రేకెత్తించాయి. ‘డ్రోన్ క్షణం’ భారతదేశ వ్యవసాయ రంగానికి కొత్త రెక్కలు ఇచ్చింది. అవును, మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాం అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను.
మన్సుఖ్ మాండవీయ, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి