సాకారమైన వాజ్ పేయి స్వప్నాలు
వచ్చే ఏడాది, డిసెంబర్ 25, 2024న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతిని జరుపుకోనున్నాం. వాజ్‌పేయి ఆశయాలను పాటిస్తే అనేక సంవత్సరాలుగా జన్‌సంఘ్, బిజెపి మేనిఫెస్టోల్లోని వాగ్దానాలు సాకారమవుతాయని మేం విశ్వసిస్తున్నాం. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వాజ్‌పేయి శత జయంతి వేడుకలను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయన ప్రచారం చేసిన భావజాలాన్ని, అది సాంస్కృతిక జాతీయవాదం కానివ్వండి, ఏకాత్మ మానవతావాదం కానివ్వండి, లేదా అంత్యోదయ కానివ్వండి ప్రధానమంత్రి మోదీ పట్టుదలగా అమలు చేస్తున్నారు.
జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఐక్యరాజ్యసమితిలో భారతీయ విదేశాంగ మంత్రిగా వాజ్‌పేయి మొట్టమొదటిసారిగా హిందీలో ప్రసంగం చేసి దేశ భాషకు గౌరవం ఇస్తూ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. మరోవైపు, ప్రధాని మోదీ ఇప్పటివరకు ప్రపంచంలోని 66 దేశాలను సందర్శించారు. భారతదేశ సంస్కృతిని, జాతీయవాదాన్ని పునరుద్ధరించారు. ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని, భారతీయుల ప్రతిష్టను పెంచారు. వాజ్ పేయికి ఇది నిజమైన నిజమైన నివాళి అనడం అతిశయోక్తి కాదు.
కేంద్రంలో ఆయన మొదటి ప్రభుత్వం 13 రోజులు, రెండో ప్రభుత్వం 13 నెలలు అధికారంలో ఉన్నాయి. 13 నెలల ప్రభుత్వం పడిపోతున్నప్పుడు, ప్రతిపక్షంలో కూర్చున్న వారు బిజెపి కీలక లక్ష్యాలయిన ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాఖ్ నిషేధం, ఉమ్మడి పౌరస్మృతి వంటి వాటిని పట్టించుకోకుండా రాజీపడి ఎన్డీయే సంకీర్ణం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేశారని వాజ్‌పేయిని దెప్పిపొడిచే వారు. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి సభలో దీనికి బదులిస్తూ, అతిపెద్ద పార్టీ అయినందున, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్రపతి పిలిచినప్పుడు, తాము కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి, దేశం మరోసారి ఎన్నికల భారం మోయవలసిన అవసరం లేకుండా చేశామని, సుపరిపాలనకు భరోసా ఇచ్చామని చెప్పారు. తాము సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 370ని, రామమందిరాన్ని లేదా ట్రిపుల్ తలాఖ్, ఉమ్మడి పౌరస్మృతిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
2014లో కేంద్రంలో ప్రధాని మోదీ సొంతంగా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2019లో ప్రభుత్వం ఎక్కువ సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. మ్యానిఫెస్టో వాగ్దానాలకు కట్టుబడి వాజ్‌పేయి చెప్పిన మాటలను నెరవేర్చే అవకాశం వచ్చినప్పుడు మోదీ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ముంబయిలో జరిగిన బిజెపి తొలి సదస్సులో ‘అంధేరా చటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా’ (చీకట్లు తొలగిపోతాయి, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది) అని వాజ్‌పేయి చెప్పారు. నేడు ప్రధాని మోదీ దేశ ప్రధాన సేవకుడిగా ఈ కలను సాకారం చేయగలిగారు. వాజ్‌పేయి అలుపెరగని శ్రామికుడిగా, ఉదారవాదిగా, అందరికీ ఆత్మీయుడిగా ప్రజలకు చేరువయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలను అనేకసార్లు సందర్శించి, అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తన మాటల ద్వారా జనసంఘ్ దీపపు వెలుగులను, కమలం పరిమళాలను అనేక ప్రాంతాలకు తీసుకువెళ్లారు. పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ప్రజలు బిజెపి పట్ల ఆకర్షితులయ్యేలా ఆయన హయాంలో అద్భుతమైన ప్రయత్నాలు జరిగాయి.
వాజ్ పేయి గ్వాలియర్‌లోని షిండే కంటోన్మెంట్‌లోని కమల్ సింగ్ బాగ్‌లోని తన పూర్వీకుల ఇంటి చిన్న ప్రాంగణంలో జన్మించారు. ఆయన తండ్రి పండిట్ కృష్ణ బిహారీ వాజ్‌పేయి స్వాతంత్ర్యానికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ వచ్చి సింధియాల హయాంలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి కుటుంబాన్ని పోషించారు. అటల్ బిహారీ వాజ్‌పేయికి ముగ్గురు సోదరులు ఉన్నారు. వారు అవధ్ బిహారీ వాజ్‌పేయి, ప్రేమ్ బిహారీ వాజ్‌పేయి, సదా బిహారీ వాజ్‌పేయి. అటల్ చిన్నతనంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ నారాయణరావు తార్తేజీతో పరిచయం కలిగింది. అప్పటినుంచి ఆర్ఎస్ఎస్ లో స్వయంసేవక్‌గా మారారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీలో చదువుకున్నారు. ఇప్పుడు అది ఈ రోజు మహారాణి లక్ష్మీబాయి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ. ఆయనకు బోధించిన ఉపాధ్యాయులలో ఒకరు గొప్ప సాహిత్యవేత్త శివమంగళ్ సింగ్ సుమన్. ఆ తర్వాత న్యాయశాస్త్రం చదవడానికి కాన్పూర్ వెళ్లారు. యాదృచ్ఛికంగా ఆయన తండ్రి కూడా ఆయనతో పాటు న్యాయశాస్త్రం చదివారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని సంఘ్ పెద్ద దివంగత భౌరావ్ దేవరస్ తన చదువుల తర్వాత సంఘ్ విస్తారక్-ప్రచారక్‌గా ఉత్తరప్రదేశ్‌లోని షాండిలా ప్రాంతానికి వెళ్లారు.
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి తన ప్రారంభ జీవితంలో విస్తారక్-ప్రచారక్ గా ఉన్నారు. ప్రధాని మోదీ విద్యార్థి జీవితంలో కూడా సంఘ్‌తో పరిచయం ఏర్పడి ఏళ్ల తరబడి ప్రచారక్‌గా కొనసాగారు. ప్రచారక్‌గా ఆయన మొదట గుజరాత్ బిజెపి సంస్థాగత కార్యదర్శి అయ్యారు. తరువాత బిజెపికి అఖిల భారత సంస్థాగత కార్యదర్శి అయ్యారు. ఇప్పటి వరకు సంఘ్ విలువలతో జాతీయ భావజాలంతో ప్రధానమంత్రులుగా మారిన ప్రధానమంత్రులిద్దరూ మొదటి నుంచీ సంఘ్ స్వయం సేవకులే కావడం యాదృచ్ఛికం. “కాశ్మీర్ భారతదేశంలో విడదీయరాని భాగం’’ అన్న శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన ప్రకటనను 50వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా అప్పటి లోక్‌సభ స్పీకర్ పిఎ సంగ్మా సమక్షంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదీంచిన తీర్మానం రూపంలో వాజ్‌పేయి నిజం చేశారు. వాజ్‌పేయికి ఈ విషయంలో స్పష్టమైన ఆలోచన ఉందని ఆయన కవిత ‘మస్తక్ నహీం ఝుకేగా’ స్పష్టం చేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్న ఈ కల నెరవేరే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. వాజ్‌పేయిని ప్రధాని మోదీతో పోల్చడానికి నేను ప్రయత్నించడం లేదు. కానీ దేశ సమైక్యత, భావజాలం పట్ల ఇరువురు నాయకుల్లో కనిపించే నిబద్ధత, సాపేక్షతల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వాజ్ పేయి జయంతి రోజున నా బాధ్యతని భావిస్తాను.
అటల్ జీ ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, ఆచరణ ద్వారా మన మధ్యనే ఉంటారు. రాజకీయ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఆయన సేవలను గుర్తిస్తూ మోదీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25ను సుపరిపాలన దినంగా ప్రకటించింది.
ప్రభాత్ ఝా, మాజీ ఎంపి