100 శాతం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం
పబ్లిక్ పరీక్షలలో అక్రమాలు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో కొత్త చట్టం తెచ్చామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో లీక్ అయిందని అందుకే దానిని రద్దు చేశామని వివరించారు. దీనికి విరుద్ధంగా నీట్ విషయంలో సమస్య స్థానికం అని స్పష్టమైందని చెప్పారు. యూజీసీ-నెట్, నీట్-యూజీలపై ఇప్పటికే సమస్యలు ఉన్నందున తొందరపడకూడదన్న కారణంతోనే ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సీఎస్ఐఆర్-నెట్ ను వాయిదా వేశామన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనను జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై చెలరేగిన తుఫాను చుట్టుముట్టింది. ప్రతిపక్షాలు కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఒక జాతీయ ఆంగ్ల వార్తాపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముందున్న సవాళ్ల గురించి అరమరికలు లేకుండా ధర్మేంద్ర ప్రదాన్ వివరించారు.
ప్ర. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) ప్రవేశ పరీక్షలను నిర్వహించే విధానంపై చాలా ఆందోళనలు, వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీపై తుపాను చెలరేగింది. దీనికి కారణాలేంటి?
జ: ఎన్‌టీఏ గత ఆరు సంవత్సరాలుగా ఇంజినీరింగ్ కోసం జేఈఈ-మెయిన్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం సీయూఈటీ వంటి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కొన్ని పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఏ సంస్థ అయినా క్రమం తప్పకుండా తనను తాను మార్చుకుంటూ ఆధునికంగా ఉండాలి. అందువల్ల ఎన్‌టీఏ తనకు తానుగా కొత్త అవతారం ఎత్తాలి. సాంకేతికత మారుతున్నందున సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. భాగస్వామ్యమూ పెరుగుతోంది. ఈసారి మనం చర్చిస్తున్న పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 23.33 లక్షల మంది హాజరయ్యారు. చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనప్పుడు సవాళ్లు పెరుగుతాయి. గతేడాది కోటి మంది విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ఎన్‌టీఏ ప్రవేశ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఇది జరగకూడని సంఘటన; మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్ర: యూజీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్) వంటి పరీక్షలను రద్దు చేశారు. ఇతర పరీక్షలను వాయిదా వేశారు.
జ: చూడండి, ఒక పరీక్ష మాత్రమే రద్దు అయింది. మరొకటి వాయిదా పడింది. ఎందుకంటే సమస్యలు తలెత్తినప్పుడు, వాటిని పరిష్కరించడానికి మనం సమయం కేటాయించాలని భావించాను. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రాన్ని డార్క్ నెట్ లో పరీక్షకు ఒకరోజు ముందు లీక్ చేశారు. అందువల్ల యూజీసీ-నెట్ ను రద్దు చేశాం. అది టెలిగ్రామ్‌లో వ్యాపించింది. ఇంతకుముందెన్నడూ అలా జరగలేదు. కాలక్రమేణా సాంకేతిక, సైబర్ నేరాల సవాళ్లు పెరిగాయి. అందుకే రాజీ పడాల్సి వచ్చింది. సీఎస్ఐఆర్-నెట్ వాయిదా పడింది. త్వరలో దీన్ని నిర్వహిస్తారు.
ప్ర. సీఎస్ఐఆర్-నెట్ ఎందుకు వాయిదా పడింది?
జ: యూజీసీ-నెట్, నీట్-యూజీలపై ఇప్పటికే సమస్యలు ఉన్నందున ఎటువంటి అవకతవకలు జరగకపోయినా మేం సీఎస్ఐఆర్-నెట్ ను వాయిదా వేయాలని అనుకున్నాం. తొందరపడి పనులు చేయకూడదని నిర్ణయించుకుని పరీక్షను వాయిదా వేసాం.
ప్ర: నీట్ విషయానికి వస్తే, బహుశా ఒకటి రెండు కేంద్రాల నుంచి కూడా ప్రశ్నపత్రం లీక్ అయి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. పేపర్ లీక్ కారణంగా మీరు యూజీసీ-నెట్ ను రద్దు చేశారు గనుక ఇప్పుడు నీట్ ని కూడా రద్దు చేయడం తప్పనిసరి అవుతుందా?
జ: ఇవి రెండు వేర్వేరు విషయాలు. యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో లీక్ అయింది. నీట్ విషయంలో సమస్య స్థానికం అని స్పష్టమైంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ప్రధానంగా బీహార్‌తో పాటు గుజరాత్ పోలీసులు కూడా చురుగ్గా వ్యవహరించి ఎక్కడెక్కడ లీకైందో గుర్తించారు. లీక్ ప్రభావం విస్తృతిపై కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. నిర్ణీత ప్రక్రియ ద్వారా అభ్యర్థులందరికీ భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలకు హాజరవకుండా ఎందుకు డిబార్ చేయకూడదో వివరించమని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అందుకు చట్టపరమైన ప్రక్రియ పూర్తయింది. ఈ అంశాలు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి.
ప్ర. మరో కారణం ఏమిటి?
జ: రెండవది, దేశవ్యాప్తంగా కష్టపడి చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులు బలమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారు ముందుకు సాగాలని, చదువుకోవాలని కోరుకుంటారు. వారి ప్రయోజనాలు ముఖ్యం. ప్రభుత్వంగా ప్రతి ఒక్కరి పట్ల మా బాధ్యత ఉంది. మేం చాలా సున్నితత్వంతో పని చేయాలి. కచ్చితమైన రుజువులు, సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఎన్‌టీఏపై ఆగ్రహంతో ఉన్నారు. మేం కూడా ప్రాథమికంగా అలా అనుకున్నాం. కాబట్టి, మేం ఎన్‌టీఏ నాయకత్వాన్ని మార్చాం. అత్యంత సీనియర్, సెక్రటరీ స్థాయి వ్యక్తిని దాని డైరెక్టర్ జనరల్‌గా నియమించాం. ఇటువంటి వాటిని అరికట్టేందుకు మొత్తం పరీక్షా ప్రక్రియ, సమాచార సమీకరణ, ఎన్‌టీఏ నిర్మాణం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె . రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసాం. ఈ వ్యవహారంపై కేసులు వేసిన వారు స్వతంత్ర దర్యాప్తు కోరారు. మేం సీబీఐ విచారణకు ఆదేశించాం. ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా చూస్తున్నాం.
ప్ర. కనుక నీట్‌ని రద్దు చేయాల్సిన అవసరం మీకు కనిపించడం లేదా?
జ: మొత్తం 46 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం వ్యవహారం కోర్టు ముందు ఉంది. కోర్టే ఒక నిర్ణయం తీసుకుంటుంది. గ్రేస్ మార్కులు ఇచ్చే ఎటువంటి సంప్రదాయం, నియమాలు ఎన్‌టీఏకు లేవు. 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం ద్వారా ఎన్‌టీఏ తప్పుడు సంప్రదాయం సృష్టించింది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రభుత్వం పరిశీలించాలని కోర్టు పేర్కొంది. ఎన్‌టీఏ కోర్టు ముందు పునఃపరిశీలన కోసం ఒక ప్రతిపాదనను సమర్పించింది. కోర్టు దానిని ఆమోదించింది. ఈ 1,563 మంది విద్యార్థులకు జూన్ 23న మళ్లీ పరీక్ష జరిగింది. కోర్టు ఇంకా కౌన్సెలింగ్‌ను రద్దు చేయలేదు. ప్రభుత్వం మీద ఏ బాధ్యత ఉందో మేం దానిని నిర్వర్తించాం.
ప్ర. ఈ లోపాలు తీవ్రంగా ఉన్నాయని, విద్యార్థులకు నష్టం కలిగిస్తున్నాయని, అందువల్ల మీరు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మీ స్పందన?
జ: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నపత్రం లీక్‌లు జరగలేదా? ఈ మొత్తం ఉదంతంలో నేను రాజకీయ భాషలో మాట్లాడదలచుకోలేదు. పరీక్షలకు హాజరైన వారిలో లేదా హాజరు కావాల్సిన వారిలో ఆందోళన నింపడం నా పని కాదు. ప్రతిపక్షంగా విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని తప్పుపట్టడం తమ బాధ్యతని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి కనుక వారి పాత్రను వారు పోషిస్తారు. నా మనస్సాక్షి, మా ప్రభుత్వ మనస్సాక్షి స్పష్టంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేం చేయగలిగిందంతా చేస్తున్నాం.
ప్ర. జేఈఈ వంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) ఉన్నాయి. 2018లో నీట్ ని కూడా సీబీటీగా చేస్తారన్న చర్చ జరిగింది. దీన్ని గురించి మరోసారి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మీరు అనుకుంటున్నారా?
జ: చూడండి, రెండు పద్ధతులు ఉన్నాయి-సీబీటీ, కాగితం, కలం. ప్రస్తుతం మన దేశంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సామర్థ్యం దాదాపు మూడు లక్షలు. అందులోనూ సవాళ్లు ఉన్నాయి. జేఈఈని సీబీటీలో నిర్వహిస్తాం. 25 లక్షల మంది అభ్యర్థులకు రెండుసార్లు నిర్వహిస్తాం. సీయూఈటీని మిశ్రమ తరహాలో నిర్వహిస్తాం. గత ఎనిమిదేళ్లుగా పీఎంటీ (ప్రీ-మెడికల్ టెస్ట్) కాలం నుంచి మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు పెన్ను, పేపర్లతోనే జరుగుతున్నాయి. రెండు విభిన్న తరహా పరీక్షల మధ్య పోలిక ఉండకూడదు. సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను కాగితం, కలంతోనే నిర్వహిస్తుంది. వాటిని పకడ్బందీగా నిర్వహించడం మా బాధ్యత. ఎన్‌టీఏ అనేది పరీక్షలను నిర్వహించే సంస్థ. వాటిని ఏవిధంగా నిర్వహించాలన్నది దాని నిర్ణయం. సంబంధిత మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం దాని క్లయింట్లు.
ప్ర. నీట్ వల్ల గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, పట్టణాలలోని విద్యార్థులే విజయం సాధిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంటున్నారు. నీట్ మొత్తం వ్యవస్థపై పునస్సమీక్ష చేయాలనుకుంటున్నారా?
జ: నీట్ ఉండకూడదనేది డీఎంకే రాజకీయ వైఖరి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నీట్ జరిగింది. తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన బోర్డ్ విద్యార్థిని గత సంవత్సరం నీట్ టాపర్. అలాగే ఆల్-ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్, నీట్ మధ్య ధోరణుల్లో ప్రాథమిక వ్యత్యాసం ఉంది. ఇంతకుముందు దక్షిణాదిలో విద్యార్థులు ఏదో ఒక రాష్ట్రంలో సీటు పొందడానికి తమిళనాడు, ఆంధ్రా, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఒక్కో రాష్ట్ర బోర్డు పెట్టే వేర్వేరు పరీక్షలు రాసేవారు. ఇప్పుడు నీట్ కారణంగా వారు ఒక పరీక్ష మాత్రమే రాస్తున్నారు. వారు డబ్బు, సమయాన్ని ఆదా చేస్తున్నారు. విద్యార్థి అనేక పరీక్షలకు హాజరు కానవసరం లేదు. ఇది గొప్ప ఉపశమనం. దీనిని సుప్రీంకోర్టు కూడా సిఫార్సు చేసింది. ఇది మన ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బలహీన వర్గాల విద్యార్థుల భాగస్వామ్యం పెరిగినట్లు ప్రాథమిక ధోరణులను బట్టి తెలుస్తోంది. వీరికి సక్సెస్ రేటు ఎక్కువ. కోచింగ్ సెంటర్లకు వెళ్లని విద్యార్థులూ రాణిస్తున్నారు.
ప్ర. పరీక్షల్లో మోసాలకు, అక్రమాలకూ పాల్పడేవారిని శిక్షించేందుకు తెచ్చిన చట్టం నిబంధనలను ఈ మధ్యనే ప్రభుత్వం నోటిఫై చేసింది. వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ఇది ఎంతవరకు సఫలం అవుతుంది?
జ: అధికారంలో ఈ పార్టీ ఉన్నా అన్ని రాష్ట్రాల్లోను ఈ సమస్య ఉంది. దీన్ని నిరూపించడానికి నా దగ్గర సమాచారం ఉంది. పరీక్షల్లో అక్రమాలు, గూండాలు, లాబీలు, స్వార్థ శక్తుల పాత్ర ఉంటుంది. దీన్ని నిరోధించేందుకు తొలిసారిగా చట్టాలు తీసుకొచ్చాం. ఇంతకుముందు చట్టాలు లేవని కాదు. కానీ పబ్లిక్ పరీక్షలలో అక్రమాలు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో కొత్త చట్టం తెచ్చాం.
ప్ర: రిక్రూట్‌మెంట్ పరీక్షల విషయానికి వస్తే, ప్రశ్నాపత్రాల లీకేజీలు, వాయిదాలు, ఇతర సమస్యలను మనం చూశాం. ఎన్‌టీఏను పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ రిక్రూట్‌మెంట్ పరీక్షలను కూడా పరిశీలిస్తుందా?
జ: ఉద్యోగాల కోసమైనా, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసమైనా పబ్లిక్ పరీక్షలకు అంతరాయం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ అక్రమాలు జరిగేది పరీక్షలోనే. ఎన్‌టీఏ ప్రాథమికంగా విద్యా ప్రవేశ పరీక్షలకే అయినప్పటికీ, నియామకాల కోసం కూడా పరీక్షలను నిర్వహిస్తున్నందున ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరును పునఃపరిశీలించడానికి ఉన్న కమిటీ కచ్చితంగా నియామక పరీక్షల అంశాన్ని కూడా పరిశీలిస్తుంది.
ప్ర. అనేక పరీక్షలను రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తాయి. మీరు వాటిని ఎలా కలుపుకొని వెళ్ళాలనుకుంటున్నారు?
జ: ప్రతి రాష్ట్రం ఈ సవాలును ఎదుర్కొంటుంది. ఇది ఒక క్యాన్సర్. అన్ని శాఖలు రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నందున ప్రతి ప్రభుత్వ శాఖకు ఈ బెడద ఉంది. ఇది ఎటువంటి అక్రమాలకూ తావు లేకుండా, 100 శాతం తప్పులు లేకుండా ఉండాలని మనమందరం కోరుకుంటున్నాం. కనుక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి ఈ సవాలును ఎదుర్కోవాలి. మేం అందుకు కట్టుబడి ఉన్నాం.
ప్ర. మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ నీట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే కాకుండా, విద్యా మంత్రిత్వ శాఖ మంత్రిగా ఏయే రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నారు?
జ: విద్యాశాఖ చాలా కీలకమైన శాఖ. భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా అవతరించబోతోంది. ఆ దిశగా మన ప్రయాణం అప్రతిహతం. వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. 21వ శతాబ్దం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ యుగం. ఈ రంగంలో భారత్‌కు సొంత బలం ఉంది. దేశీయ అవసరాలు, ప్రపంచం ఆకాంక్షలు రెండింటినీ ఎలా నెరవేర్చాలనే దానిపై మా విద్యా మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మరింత మంది పారిశ్రామికవేత్తలను మనం సృష్టించాలి. మనం ఎక్కువ మంది ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులను, మరిన్ని నైపుణ్యాలు కలిగిన నిపుణులను సృష్టించాలి. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) తన పత్రంలో దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని సిఫార్సు చేసింది. ఎన్ఈపీని విజయవంతంగా అమలు చేయడం మా ప్రాధాన్యత.
నాగార్జున