కాంగ్రెస్ కూడా ప్రజా ద్రోహ ఫిరాయింపుల పార్టీనే

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్ళు కూడా కాకముందే పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి చిక్కాయి. సీనియర్ నేతలు, రాష్ట్ర మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులను కాదని రేవంత్‌ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు సహజంగానే పార్టీలో వ్యతిరేక స్వరాలు తీవ్ర స్థాయిలో వినిపించాయి. తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్‌ను ఢీకొట్టడానికి ఆయన లాంటి ఒక ‘‘మాటకారి నాయకుడు’’ కావాలని కాంగ్రెస్ కోరుకుంది. తెలంగాణలో 2018 ఎన్నికల తరువాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెల్చుకోవడమే కాకుండా, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, 2020 చివర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 వార్డులు గెల్చుకుని బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)కు షాకిచ్చిన బిజెపిపై విపరీత దుష్ప్రచారం చేయగల మాటకారి రేవంత్ మాత్రమే నని కాంగ్రెస్ నమ్మి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసింది.

మోసపూరిత డిక్లరేషన్ లు, దగాకోరు గ్యారంటీలు, బూటకపు హామీలతో పాటు బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే అని కుట్రపూరితంగా భయంకర విష ప్రచారం చేసి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు అన్ని హామీలను తుంగలో తొక్కుతోంది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 200 రోజులు పూర్తి అయినా హామీల అమలు ఎక్కడి గొంగళి అక్కడనే అన్నట్లు ఉంది. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సవాలక్ష మెలికలు పెట్టి రుణమాఫీని నీరు కారుస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతిన్నది. ఎన్నికల ప్రచారంలో సోనియా, రాహుల్‌ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారంటీలు, యువతకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి.

రేవంత్ రెడ్డి కమిటీల పేరుతో గత ప్రభుత్వ అవినీతిపై చర్యలకు ఎడతెగని జాప్యం చేస్తూ కేసీఆర్ తరహాలోనే పూర్తిగా ఫిరాయింపులపై దృష్టి పెడుతున్నారు. ఎన్నికల వేళ ఫిరాయింపుల భరతం పడుతామని నమ్మించి సిగ్గు లేకుండా ఫిరాయింపుల పర్వానికి తెరలేపింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ లు, చైర్మన్ లు, మేయర్ లు అధికారం లేకుంటే బ్రతుకలేం అన్నట్లు నీళ్లలో నుంచి బయటపడ్డ చాపలా గిలగిలా కొట్టుకుంటూ నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయిస్తున్నారు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళలకు కరవైన భద్రత వంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ ఫిరాయింపులను వినియోగించుకుంటున్నారు.

ఫిరాయింపులతోనే సరిపెట్టకుండా రేవంత్ సర్కార్ కేసీఆర్ ప్రభుత్వంలో పరాకాష్టకు చేరిన అవినీతిని బ్లాక్ మెయిల్ ఆదాయ వనరుగా మార్చుకోవడం చూసి తెలంగాణ సమాజం విస్తుపోతుంది. కమిషన్ లలో పర్సెంటేజీలను కొట్టేసి దిల్లీ కాంగ్రెస్ కుటుంబానికి కట్టబెట్టే బ్రోకర్ గా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకు తగ్గట్టే రేవంత్ రెడ్డి అధికార వ్యవస్థలను మార్చుకుంటున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మొండిచేయి చూపిస్తున్న రేవంత్ రెడ్డి దిల్లీ అధిష్టానానికి మాత్రం జీ హుజూర్ అంటున్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై బిజెపి ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో బిజెపి శ్రేణులు అనేక ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి. రైతుల సమస్యలపై కిసాన్ మోర్చా, మహిళల సమస్యలపై మహిళా మోర్చా, నిరుద్యోగుల పక్షాన యువ మోర్చా, ఎస్సీల పక్షాన ఎస్సీ మోర్చా, ఎస్టీల పక్షాన ఎస్టీ మోర్చా ఇలా రాష్ట్ర పార్టీతో పాటు మోర్చాలు సైతం ఉద్యమాలను నిర్మిస్తున్నాయి. బిజెపి ఉద్యమాలకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది.

బిజెపి పోరాటం ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకుండా కేసీఆర్ బొక్కబోర్లా పడ్డ విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. గ్యారంటీలను గాలికొదిలేసి, హామీలను విస్మరిస్తూ, పాలనను పట్టించుకోకుండా, ఫిరాయింపులకు పెద్దపీట వేస్తూ అవినీతికి గేట్లెత్తుతోన్న కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కూ అదే గతి పడుతుంది. ఎన్నికల హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకు బిజెపి చేపడుతున్న ఉద్యమాలను విజయవంతం చేసేందుకు కాషాయ శ్రేణులు పెద్దఎత్తున కదిలి రావాలి.