చట్టసభలపై ప్రజల నమ్మకం పెంచడం సభ్యుల విధి
లోక్ సభ స్పీకర్ పదవిపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చలు విఫలమైన అనంతరం 1976 తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో ఓం బిర్లా జూన్ లో లోక్‌సభ స్పీకర్‌గా తిరిగి ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్ పదవిని నిలబెట్టుకున్న తొలి వ్యక్తిగా కూడా ఆయన నిలిచారు. 18వ లోక్‌సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన కొన్ని రోజుల తర్వాత బిర్లా ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పీకర్ గా తన ప్రాధాన్యాలు, అంచనాలు, సభలో చర్చల నాణ్యత, సవాళ్లు మొదలైన అంశాల గురించి మాట్లాడారు.
ప్ర: 1980ల తర్వాత ఐదేళ్ల పాటు పని చేసి రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన మొదటి స్పీకర్ మీరే. మీ ప్రాధాన్యాలు ఏమిటి?
జ: రెండు పర్యాయాలు గెలిచిన చివరి స్పీకర్ (బలరాం జాఖడ్) పంజాబ్ (ఫిరోజ్‌పూర్), రాజస్థాన్ (సికార్) నుంచి గెలిచారు. నేను అదే రాష్ట్రంలో (రాజస్థాన్ కోటా లోక్ సభ స్థానం) గెలిచాను. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాపై విశ్వాసం వ్యక్తం చేశారు. నియమాలు, సంప్రదాయాల ఆధారంగా కొత్త ప్రమాణాలు నెలకొల్పడానికి స్పీకర్‌గా అనుభవాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. మనకు అత్యుత్తమ రాజ్యాంగం ఉంది. వచ్చే ఐదేళ్లలో పార్లమెంటుపై ప్రజల విశ్వాసం, నమ్మకం పెరిగేలా చూడాలనుకుంటున్నాను. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం శక్తిపై మన పార్లమెంట్ ప్రపంచానికి సందేశం ఇవ్వాలి. ఏకాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, వైరుధ్యాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. సభలో చర్చల సమయంలో వ్యక్తమయ్యే విభిన్న దృక్కోణాలు కూడా ప్రభుత్వం తన విధానాలను, చట్టాలను రూపొందించేందుకు ఉపయోగపడతాయి. దేశంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కువ చర్చలు కూడా మంచి ఫలితాలకు దారి తీస్తాయి.
ప్ర: త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గందరగోళంగా సాగిన తొలి సదస్సు తర్వాత ప్రతిపక్షాలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జ: నేను ఏ సభ్యుడిని ప్రతిపక్షంగా లేదా అధికార పక్ష ఎంపీగా (పార్లమెంటు సభ్యుడు) చూడలేదు. ఎంపీలందరూ ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నవారే. లక్షల ఓట్లు రాబట్టే వారు లోక్ సభకు వస్తారు. వారు తమ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా ఎన్నికవుతారు. ఇదే మన ప్రజాస్వామ్యపు అందం. సహజంగానే సభ్యులు తమ పార్టీ ఎజెండాలను కలిగి ఉంటారు. పార్లమెంట్‌లో దాన్నే వ్యక్తీకరిస్తారు. అయితే పార్లమెంట్‌లో నాణ్యమైన చర్చలు జరగాలని నేను ఆశిస్తున్నాను. ఏకాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, వైరుధ్యాలను కూడా స్వాగతిస్తాం. అయితే నిర్మాణాత్మక, సానుకూల చర్చలు దేశానికి మేలు చేస్తాయి. పార్లమెంటుపై ప్రజల విశ్వాసాన్ని పెంచడం చట్టసభ సభ్యులుగా మన కర్తవ్యం. ఏకాభిప్రాయాలు, అభిప్రాయభేదాలు మన ప్రజాస్వామ్యం బలాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలి. విభిన్న అభిప్రాయాలు ప్రభుత్వానికి కూడా సహాయపడతాయి. వికసిత్ (అభివృద్ధి చెందిన) భారత్ అనే మన అందరి లక్ష్య సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ప్ర: ప్రతిపక్షాల బలం పెరగడం, తొలి సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దానిని నడిపించిన తీరు దృష్ట్యా మీరు కోరుకున్న విధంగా సభను నడపడం సవాలుగా భావిస్తున్నారా?
జ: ప్రతి సవాలు ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది. ప్రజాస్వామ్యంలో తమ వాదనలు వినిపించే బలమైన ప్రతిపక్షం ముఖ్యం. అయితే జాతీయ ప్రాముఖ్యం కలిగిన సమస్యలపై మనమందరం ఒకే అభిప్రాయంతో ఉండాలి.
ప్ర: 18వ లోక్‌సభ తొలి సమావేశంలో నిరాధారమైన ఆరోపణలతో గందరగోళం నెలకొంది. దీన్ని అరికట్టడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
జ: పార్లమెంట్ కార్యక్రమాల నియమావళిని రాజ్యాంగం ప్రకారం రూపొందిస్తారు. ప్రతి పార్టీ పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలను పాటించాలి.
ప్ర: ప్రమాణ స్వీకార కార్యక్రమం పవిత్రతను కాపాడుకోవడానికి ఒక కమిటీ సూచనలు చేస్తుందని మీరు ప్రకటించారు. దాని అవసరం ఏమిటి?
జ: ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనం రాజ్యాంగం సూచించిన పద్ధతికి కట్టుబడి ఉండాలి. కమిటీ అన్ని పార్టీలతో మాట్లాడి సూచనలను అందజేస్తుంది.
ప్ర: కోటా లోక్‌సభ స్థానం నుంచి మీరు మూడోసారి గెలిచారు. స్పీకర్ కూడా మీరే ఎన్నికయ్యారు. మీ నియోజకవర్గానికి సంబంధించి మీ ప్రణాళికలు ఏమిటి?
జ: కోటా-బుండి నాకు కుటుంబం వంటింది. నేను ఇక్కడే పుట్టి, పెరిగి, ప్రజా జీవితంలో చేరి, 2003 నుంచి అక్కడే ఎన్నికల్లో పోరాడుతున్నాను. ప్రజలు నన్ను ప్రేమిస్తారు. పదేపదే వారు నన్ను ఆశీర్వదించారు. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అద్భుతమైన అవకాశాలను కలిగి ఉంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుంది. మాకు చంబల్ నది కూడా ఉంది. నీటి కొరత లేదు. మాకు రెండు జాతీయ అభయారణ్యాలు కూడా ఉన్నాయి. కోట-బుండి ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాం. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కోటాకు వేల మంది విద్యార్థులు వస్తుంటారు. వారికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.