Rahul Gandhi

మనోభావాలపై రాహుల్ దాడి

Rahul Gandhiరాజకీయ పార్టీల మధ్య వాటి సిద్ధాంతాలపై విభేదాలు, ఘర్షణలు కూడా ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. యూరప్ లోని పార్టీలు వలసలు, పర్యావరణం, మత వివాదాలు, విదేశీ సహాయంపై ఒకదానితో ఒకటి విభేదించుకుంటాయి. అయితే అక్కడ మేధోమథన మండలులు (థింక్ ట్యాంక్‌లు), పార్టీ మేధావుల ద్వారా పార్టీల మధ్య జరిగే చర్చకు ఈ విభేదాలు అంతరాయం కలిగించవు. పైగా ఈ చర్చా ప్రక్రియ పార్టీల మధ్య సైద్ధాంతిక అంతరాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తుంది. భారతదేశంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ప్రాథమిక అంశాలైన సంస్కృతి, సమాజం గురించి పార్టీలు పరస్పరం వాదించుకుంటాయి. అవి అట్టడుగు స్థాయిలో ప్రజల భావాలను ప్రతిబింబించవు. భారతీయ ప్రజల సామూహిక ఆలోచనను, స్పృహను విస్మరించి, కొన్ని పార్టీలు పై స్థాయిలో తాము నమ్మేవాటిని, చెప్పేవాటిని అట్టడుగు స్థాయిలో ప్రజలపై రుద్ధేందుకు ప్రయత్నిస్తాయి. దీనికి తాజా ఉదాహరణ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్లమెంటులో హిందుత్వపై చేసిన దాడి. ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్ ను, సంస్కృతి, సమాజం, లౌకికవాదంపై విశాల హిందూ ప్రపంచ దృక్పథాన్ని కొందరు వ్యతిరేకించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తదితరులు మైనారిటీల అంశానికి పరిమితమయ్యారు. ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే అలా చేశారు. రాహుల్ గాంధీ మరింత ముందుకు వెళ్ళారు. హిందుత్వాన్ని హింసతో ముడిపెట్టారు. ఇది రాజకీయ పొరపాటు కాదు, బాగా ఆలోచించి చేసిన పనే. బూటకపు లౌకికవాదుల్లో అగ్రాసనం అందుకోవాలని ఆయన అనుకున్నారు. 10 జనపథ్ మేధోవర్గం అపఖ్యాతి పాలైన భారతీయ వామపక్షాల నుంచి ఆలోచనలను అరువు తీసుకుని తన సొంత వారసత్వానికి ద్రోహం చేస్తుంది.

నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్‌ఎస్ పై ఉన్న ద్వేషం ఇప్పుడు సంస్థాగతమైనట్లు కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని నాశనం చేస్తుంది. కాంగ్రెస్‌లోని ప్రస్తుత తరం, ముఖ్యంగా రాహుల్ గాంధీ, అదుపు లేకుండా ప్రవర్తించడానికి కారణాలున్నాయి. రాహుల్ పెరిగేటప్పుడు అతనిపై మూడు అక్షరాలు, ఆర్ఎస్ఎస్, అతని మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. గాంధీ-నెహ్రూ కుటుంబం ‘విశిష్టత’ ప్రశ్నార్థకమైన సమయంలో ఆయన రాజకీయ నాయకుడిగా శిక్షణ పొందాడు. పార్లమెంటులో ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నప్పటికీ షా బానో కేసులో రాజీవ్ గాంధీ హిందూత్వ శక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కాలక్రమేణా అయన హయాంలోనే ఆయన కుటుంబం ఆధిపత్యం బలహీనపడింది. హిందూత్వపై రాహుల్ గాంధీ అవగాహన భారతదేశ సామూహిక స్పృహకు విరుద్ధంగా ఉంది. హిందుత్వ రాజకీయ సిద్ధాంతం కాదు. మొఘల్, బ్రిటిష్ వలసవాద అనంతర కాలంలో హిందువులను మళ్ళీ చైతన్యవంతం చేయడానికి, వారు తమ సాంస్కృతిక గుర్తింపును తిరిగి పొందేందుకు, బాధిత మనస్తత్వం నుంచి వారిని విముక్తి చేయడానికి హిదుత్వ వీలు కల్పిస్తుంది.

ఆర్‌ఎస్‌ఎస్ కొత్తగా ఏదీ ప్రతిపాదించలేదు, ఇది స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, బంకిం చంద్ర ఛటర్జీ, ఆర్‌కె ముఖర్జీ వంటి హిందూ దిగ్గజాల ఆలోచనలను పంచుకుంటుంది, సందర్భోచితం చేస్తుంది. మైనారిటీల పట్ల ప్రత్యేక విధానం, రాయితీలు అవసరమని భావించే ఆర్ఎస్ఎస్ బూటకపు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉద్యమానికి ఒక వ్యవస్థీకృత సైద్ధాంతిక రూపాన్ని ఇచ్చింది. వలసవాద ఆలోచనలను సరిదిద్దడానికి బదులుగా నెహ్రూ వాటిని శాశ్వతం చేశారు. ఇది అధికరణం 370తో సహా అనేక రుగ్మతలకు మూలమని రుజువైంది. ఇది నెహ్రూ, ఆయన సైద్ధాంతిక అనుయాయులు, ఆర్ఎస్ఎస్ ల మధ్య యుద్ధానికి నాంది పలికింది. కాంగ్రెస్‌తో పోలిస్తే కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్దతు తక్కువ. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ భావజాలంలోని ఆకర్షణ కారణంగా అది శక్తిమంతమైన ఉన్నతవర్గాలకు పక్కలో బల్లెంగా తయారైంది. 1951లో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంపై భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్‌లతో సహా నెహ్రూ తన సొంత పార్టీ నాయకుల నుంచి ‘అవిధేయత’ను ఎదుర్కొన్నప్పుడు ఇది స్పష్టంగా కనిపించింది. ఆయన వారిని ‘ఆర్ఎస్ఎస్ తరహా శక్తులు’ గా అభివర్ణించారు. నెహ్రూ, ఇందిరా గాంధీలు ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేసేందుకు ‘సంప్రదాయక విరోధి కమిటీ’ని ప్రోత్సహించారు. దాని ప్రచార సాహిత్యాన్ని విస్తృతంగా పంపిణీ చేశారు. తత్ఫలితంగా, నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన మైనారిటీ దృక్పథం కాంగ్రెస్ ప్రధాన స్రవంతి సిద్ధాంతంగా మారింది. లాలూ ప్రసాద్ వంటి రాహుల్ గాంధీ మిత్రులకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రజాస్వామ్య చరిత్ర గురించి తెలుసు. 1974లో జెపి ఉద్యమంలో, 1975-77లో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ అగ్రగామిగా ఉంది. నియంతృత్వం నుంచి విముక్తి దైవ కృప వల్ల కాక ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని ప్రజాస్వామిక పోరాటం వల్ల సాధ్యమైంది. వేల మంది జైలు పాలయ్యారు, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎమర్జెన్సీ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ తన రాజకీయేతర కార్యకలాపాలకు తిరిగి వచ్చింది. కనుక రాహుల్ గాంధీ, అతని మిత్రపక్షాలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రజాస్వామ్యానికి శత్రువు అని ప్రజలను నమ్మించలేరు. అలా చేసే ప్రయత్నాలు వారి విశ్వసనీయతనే దెబ్బతీస్తాయి.

అయోధ్యలోని రామ మందిరం బూటకపు లౌకిక దళం అంగీకరించలేని మరో హిందుత్వ మైలురాయి. ఇది ఆలయం కోసం జనసమీకరణ కంటే విశాలమైన ఉద్యమం. ఇది లౌకికవాదం నిర్వచనాన్ని రాజకీయ, మేధో శ్రేష్ఠుల సంకెళ్ల నుంచి విముక్తం చేసింది. ఈ చర్చలో ప్రజానీకం ఎక్కువగా పాల్గొంది. భారతదేశం అనే భావనను పునర్నిర్వచించేందుకు ఇది ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సమకాలీన నాయకత్వం ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. భారతదేశాన్ని మార్చడానికి ప్రస్తుత ప్రభుత్వ సైద్ధాంతిక నిబద్ధత ఆధ్యాత్మికత పట్ల ప్రధానమంత్రి అచంచల నిబద్ధతలో స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశం మేధో, సాంస్కృతిక ప్రాధాన్యతకు దోహదపడిన వ్యక్తులు, ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తుల కృషిని ప్రచారంలో చేయడంలో కూడా ఇది ప్రస్ఫుటమవుతుంది. నెహ్రూ-గాంధీల పార్టీ లోకమాన్య తిలక్, బిసి పాల్, మహర్షి అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్, ఎస్ రాధాకృష్ణన్ తమవాళ్ళేనని వాదిస్తుంది. కానీ వారి దృక్కోణాలను గ్రహించడంలో విఫలమైంది. దురదృష్టవశాత్తు ఆ పార్టీ చారిత్రక వాస్తవాల ద్వారా కాకుండా స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల దృష్టితో ముందుకు వెళుతోంది. అందువల్ల అది హిందూత్వ పురోగమనం అంటే కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడినట్టే అని నమ్ముతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ హిందుత్వ విస్తరణ, ఆర్ఎస్ఎస్ ప్రభావం గురించి నిజాయితీగా చర్చించలేదు. సామూహిక ప్రపంచ దృక్పథాన్ని రూపొందించడంలో సంస్కృతి, మతం, భారతదేశపు గతంపై ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించలేదు. ఇది కేవలం నాయకుడు చెప్పిన దాని ప్రకారమే సాగుతుంది.

2008లో సిపిఎం రాజకీయ పత్రం, వనవాసి కళ్యాణ్ కేంద్రం, సేవా భారతి, విద్యాభారతి వంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల కార్యకలాపాలను చర్చించి, సంఘ్‌తో పోటీ పడేందుకు ఎన్నికల ఎజెండాకు అతీతంగా ముందుకు వెళ్లవలసిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఇది కేవలం ఒక పత్రంగా మిగిలిపోయింది. ఆర్‌ఎస్‌ఎస్ ఒక వాస్తవికత. హిందుత్వ అనేది జాతీయవాదం, ప్రజాస్వామ్య పురోగమనాల ఆకాంక్ష. రాహుల్ గాంధీ ఆలోచనలలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన క్షేత్రస్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన చేస్తున్న వాదనలు రుచించడం లేదు.

నిర్మాణాత్మక, అతివాదంకాని పరిష్కారాల కోసం భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలకు వెలుపల మరిన్ని కార్యక్రమాలు, చొరవలు అవసరం. ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ ప్రతీకార ధోరణితో వ్యవహరించలేదు. మహాత్మా గాంధీ హత్య విషయంలో తప్పుడు ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా అప్పటి ఆర్ఎస్ఎస్ అధిపతి ఎం.ఎస్.గోల్వాల్కర్ 1950లలో ఆహార కార్యక్రమంలో నెహ్రూ ప్రభుత్వానికి సహకరించడానికి ఆర్ఎస్ఎస్ ను అనుమతించారు. మరో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్ ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ పట్ల గౌరవం ప్రదర్శించారు. దేశ రాజకీయ నాయకులు అధ్యయనం చేసి ఇటువంటి విషయాలు తెలుసుకోవడం మంచిది.

రాకేష్ సిన్హా,
బిజెపి రాజ్యసభ సభ్యుడు