India Progress

భారత్ ప్రాభవాన్ని కించపరిచే కుట్రలు

ఎన్నికల్లో బిజెపి, ఎన్డీయేలోని ఇతర పక్షాలు తాము లక్ష్యంగా నిర్దేశించుకున్న 400 సీట్లను గెలుచుకోలేకపోవడాన్ని పరాజయంగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తనకు, తన మద్దతుదారులకు 400 సీట్లు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది ఎన్నికలలో ఏ పార్టీ అయినా చేసే పని కాదా? ఎన్నికల తర్వాత తమకు 295 సీట్లు వస్తాయని ఇండీ కూటమి ఘంటాపథంగా చెప్పలేదా? జూన్ 4 తర్వాత మోదీ ప్రధానమంత్రి పదవిలో ఉండరని రాహుల్ గాంధీ చాలాసార్లు చెప్పలేదా? మోదీ పదేళ్ల పాలనలో ఆయన మోదీ పనితీరును ‘సాధారణమైనది’ గా చెప్పగలరా? సైద్ధాంతిక కళ్లజోళ్లు ధరించిన వారు మాత్రమే అటువంటి విపరీతమైన నిర్ధారణలు చేస్తారు. ఇటువంటి ధోరణి వాస్తవాలకు పూర్తిగా భిన్నం.

2013 నాటికి మోర్గాన్ స్టాన్లీ ప్రపంచంలోని ‘పెళుసైన ఐదు’ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ను వర్గీకరించింది. 2014లో మోదీ బాధ్యతలు స్వీకరించి, భారత ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి పథంలో నడిపించారు. నేడు భారతదేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మేలో విడుదలైన ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాల నివేదిక’ ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2024లో 6.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. భారతదేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 2023లో 5.6 నుంచి 2024లో 4.5 శాతానికి తగ్గుతుందని ఈ నివేదిక జోస్యం చెప్పింది. ఇదిలావుండగా, ఐక్యరాజ్యసమితి భారతదేశ వృద్ధి రేటును సవరించి 2024లో దేశం 7 శాతం మేరకు వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా అనేక అంశాల కారణంగా ప్రస్తుత ప్రపంచ ఆర్థిక దృశ్యం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ భారత్ గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2024లో 2.7 శాతం వృద్ధి చెందుతుందని ప్రస్తుత అంచనాలు పేర్కొన్నాయి. 

గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలకు అసాధారణమైన ప్రాధాన్యం ఇచ్చారు. వీటి గణాంకాలు ఆశ్చర్య పరుస్తాయి. జాతీయ రహదారి (ఎన్.హెచ్) వ్యవస్థ 91,287 కి.మీ (2014) నుంచి 1,46,145 కి.మీ (2023)లకు 60 శాతం పెరిగింది. నాలుగు అంతకంటే ఎక్కువ లేన్ల జాతీయ రహదారుల పొడవు రెండున్నర రెట్లు అంటే 18,387 కిమీ (2014) నుంచి 46,179 కిమీ (2023)కి పెరిగాయి. 2014-15లో జాతీయ రహదారి నిర్మాణ వేగం రోజుకు 12 కిమీలు కాగా 2023-24 నాటికి రోజుకు దాదాపు 28.3 కిమీలకు పెరిగింది. ఆర్థిక సమ్మిళితత్వం విషయంలో కూడా గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియోలు 2014-2024 మధ్య 3.9 కోట్ల నుంచి నుండి 16.5 కోట్లకు పెరిగాయి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 52.43 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాలలో రూ.2,28,747.22 కోట్ల నిల్వలున్నాయి. మోదీ సంక్షేమ పథకాలు పేదలకు 10.32 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 4.2 కోట్ల పక్కా గృహాలను అందుబాటులోకి తెచ్చాయి. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 6.27 కోట్ల మందికి పరిహారం లభించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గత తొమ్మిదేళ్లలో దాదాపు 25 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు.

అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటిష్ ధార్మిక సంస్థ ఆక్స్ ఫామ్ గతంలో భారతదేశంలో పెరుగుతున్న ఆదాయ అసమానతల గురించి చెప్పిన అసత్యాలనే లోక్ సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ‘ప్రపంచ అసమానత ల్యాబ్’ నివేదిక మళ్ళీ చెప్పింది. ఈ నివేదికకు మూలం హురున్ రిపోర్ట్. ఈ కంపెనీని రూపెర్ట్ హూగ్వెర్ఫ్ 1999లో స్థాపించారు. దీనిని అతని చైనీస్ పేరు హు రన్ అని కూడా పిలుస్తారు. 150 మంది ఉద్యోగులతో హురున్ ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉంది. 2012లో భారతదేశంలో కూడా ప్రారంభమైంది. 2014లో బిజెపి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘అసమానతలు’ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని చెప్పినప్పుడే ఈ నివేదిక రాజకీయ పక్షపాతం స్పష్టంగా కనిపించింది. ‘గత దశాబ్దంలో ప్రధాన రాజకీయ, ఆర్థిక సంస్కరణలు, నిర్ణయాల కేంద్రీకరణతో నిరంకుశ పాలనకు దారితీశాయి. బడా వ్యాపారులు, ప్రభుత్వాల మధ్య అనుబంధం పెరిగింది’ అని కూడా ఈ నివేదిక ఆరోపించింది. చైనాతో బంధం ఉన్న ఒక కంపెనీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వాన్ని ‘నిరంకుశ ప్రభుత్వం’గా వర్ణించడంలో ఔచిత్యం ఉందా? ఈ నివేదికకు ముందు హాస్యాస్పదంగా ఉన్న అనేక ఇతర అధ్యయనాలు ఉన్నాయి. ‘ప్రపంచ సంతోష నివేదిక 2024’ ప్రకారం లిబియా, ఇరాక్, పాలస్తీనా, పాకిస్థాన్, నైజర్ వంటి దేశాల కంటే వెనుకబడి ఉన్న 143 దేశాలలో భారతదేశం 126వ స్థానంలో ఉంది! ప్రపంచ ఆకలి సూచి 2023 ర్యాంకింగ్స్‌లో భారతదేశం మొత్తం 125 దేశాలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత 111వ స్థానంలో ఉంది. 

రాహుల్ గాంధీ ధనిక-పేద విభజన ఒక ప్రహసనం. అంబానీ-అదానీలు మోదీ హయాంలోనే పుట్టలేదు. వారి వ్యాపార సామ్రాజ్యాలలో విపరీతమైన వృద్ధి ఇందిరా గాంధీ, ఆ తర్వాత ప్రభుత్వాల పాలనలలో జరిగింది. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విశ్వసనీయ నాయకుడిగా ఎదిగారనే వాదన ఎంతవరకు సరైనది? అసమానతలను అంతం చేయడానికి రాహుల్ వింత, విచిత్ర పరిష్కారాలు, సంపదను పునఃపంపిణీ చేయడానికి ప్రతిపాదించిన రాబిన్ హుడ్ సూత్రాలు, కుల గుర్తింపులకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రమాదకరమైన ఆలోచన. ఇది ప్రజలను విభజిస్తుంది. రాహుల్ ప్రజాస్వామికవాదా? 2013 సెప్టెంబరు 27న ఆయన విలేకరుల సమావేశంలో ఏం చేశారో గుర్తు చేసుకుందాం. సోనియా గాంధీని సంప్రదించి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదించిన ఒక ఆర్డినెన్స్ ప్రతిని మీడియా కెమెరాల ముందు చించిపారేశాడు. ఆయన ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, ఒక దశాబ్దం పాటు యూపీఏ ప్రభుత్వాలను రిమోట్ కంట్రోల్ తో అదుపు చేశాడు. గత 10 సంవత్సరాలలో భారతదేశం చాలా దూరం పయనించింది. ఇది అత్యధిక స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) కలిగిన ఐదు దేశాలలో ఒకటిగా ఉద్భవించింది. ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి అతి చేరువలో ఉంది. ప్రాచీన నాగరికత గల మన దేశం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోంది. ‘ఒక ఆలోచనకు దాని సమయం వస్తే ప్రపంచంలో ఏ శక్తీ దాన్ని ఆపలేదు’ అని ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో అంటారు. నేటి ప్రపంచంలో భారతదేశం అలాంటి ఆలోచనే.

బల్బీర్ కె పుంజ్