కేంద్రం, రాష్ట్రాల సమిష్టి కృషితో ‘వికసిత్ భారత్’ సాకారం
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు సమన్వయంతో గట్టి ప్రయత్నాలు చేయడం ద్వారా ‘వికసిత్ భారత్’ను సాకారం చేసుకోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధిపరచడం, పురోగమన శకాన్ని నిర్మించుకోవడం కూడా వికసిత్ భారత్ ఆలోచనల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశ ఆర్థిక రంగాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని మోదీ ప్రత్యేకంగా నొక్కిచెబుతూ.. సంక్షేమ చర్యల్లో ప్రజా భాగస్వామ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రభుత్వ పథకాలు వీలైనంత ఎక్కువమందికి చేరేలా చూడాలని, సుపరిపాలనకు ఉదాహరణగా బిజెపి పాలిత రాష్ట్రాలు నిలవాలని మోదీ ఆకాంక్షించారు. సుపరిపాలనను ముందుకు తీసుకువెళ్లి, ప్రజాకాంక్షలు తీర్చడానికి బిజెపి అవిశ్రాంతంగా పాటుపడుతోందని చెప్పారు. వేర్వేరు వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు చేరడంలో సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. దిల్లీలోని బిజెపి కేంద్ర జూలై 27, 28న రెండు రోజుల పాటు జరిగిన ‘ముఖ్యమంత్రుల పరిషద్’ ముగింపు సమావేశంలో ప్రధాని మాట్లాడారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా తదితరుల సమక్షంలో జరిగిన ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో బిజెపికి చెందిన మొత్తం 13 మంది ముఖ్యమంత్రులు, 15 మంది ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సుపరిపాలన కోసం ఇలాంటి ముఖ్యమంత్రి మండలి సమావేశాలను బిజెపి నిర్వహిస్తూ ఉన్నది. ఇది 2024లో జరిగిన రెండవ సమావేశం.
ఈ సమావేశం తొలిరోజు జెపి నడ్డా మాట్లాడుతూ ఇలాంటి సమావేశాల ద్వారా మూడు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముందుగా సుదీర్ఘ అనుభవం గల ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ నాయకుల మార్గదర్శనం పొందుతామని అన్నారు. రెండవది, మన అనుభవాలను ఒకరితో ఒకరం పంచుకోగలుగుతామన్నారు. కొత్త సమాచారం పొందుతామన్నారు. మూడోది, మరింత మంచి చేయాలనే భావన బలపడుతుందన్నారు. ఈ సమావేశంలో నూతన విద్యావిధానం అమలులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఆవిష్కరణ ఆధారిత, పాలనా కేంద్రీకృత ప్రయత్నాలను హైలైట్ చేస్తూ ఓ ప్రజంటేషన్ ను ప్రదర్శించారు. ఉత్తర ప్రదేశ్ గ్రామీణ సచివాలయ పథకం, ప్రభుత్వ ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి అస్సాం స్పెషల్ డ్రైవ్, సౌర విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి గుజరాత్ లో చేస్తున్న ప్రయత్నాలు, త్రిపుర ‘అమర్ సర్కార్’ కార్యక్రమం, అక్రమ మైనింగ్ ను నిరోధించడానికి బీహార్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మహారాష్ట్ర, హరియాణాకు చెందిన కొన్ని నిర్దిష్ట ప్రాజెక్టులపైనా చర్చించారు.