Bangladesh map

బంగ్లాదేశ్ పరిణామాలు మనకు మరో “గుణపాఠం”

బంగ్లాదేశ్ ప్రపంచంలో జనాభా పరంగా ఎనిమిదవ పెద్ద దేశం. ముస్లిం జనాభాలో మూడో అతిపెద్దది. దక్షిణ ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 1,48,460 చదరపు కిలోమీటర్ల (57,320 చదరపు మైళ్ళు) విస్తీర్ణం, దాదాపు 17 కోట్ల జనాభాతో అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో ఒకటి. ఉత్తరం, పశ్చిమం, తూర్పున భారతదేశంతో 4000 కి.మీ పైగా (95 శాతం)… ఆగ్నేయంలో మయన్మార్‌తో 200 కి.మీ పైగా (5 శాతం) బంగ్లాదేశ్ సరిహద్దులను పంచుకుంటుంది. దక్షిణాన బంగాళాఖాతం తీరప్రాంతాన్ని కలిగి ఉంది.

1947లో భారతదేశ విభజన సమయంలో సమైక్య భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ మొదట్లో పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. అప్పట్లో దీనిని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. 1971లో రక్తసిక్తమైన విముక్తి పోరాటంలో పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్‌కు అధికారాన్ని బదిలీ చేయడానికి పాకిస్తాన్ మిలటరీ జుంటా నిరాకరించడం 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారితీసింది. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పట్ల పశ్చిమ పాకిస్తాన్ ప్రదర్శించిన రాజకీయ వివక్ష, ఆర్థిక అసమానతలు బంగ్లాదేశ్ సృష్టికి ప్రధాన కారణం.

బంగ్లాదేశ్‌కు హింస కొత్త కాదు. ఈ దేశం ఏర్పాటులోనే హింస ప్రజ్జ్వరిల్లింది. ఇక్కడ చాలా ప్రభుత్వాల మార్పిడిలో హింస ప్రధాన పాత్ర పోషించిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. 2009లో సైన్యం చేతిలోకి జారిపోతున్న బంగ్లాదేశ్‌ ను కాపాడింది షేక్ హసీనాననే. కానీ ఇప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక నిరసనలతో ఆమె పదవీచ్యుతురాలు కావాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ వీడి భారత్‌ చేరుకున్న షేక్ హసీనా తాత్కాలికంగా ఇక్కడ ఉండేందుకు కేంద్రం అనుమతించింది. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆమెను దేశంలోకి అనుమతించిన విషయాన్ని వివరించారు. షేక్ హసీనా, భారత్ మధ్య సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్‌ సహా కుటుంబం మొత్తం హత్యకు గురైన తర్వాత నాడు షేక్ హసీనాకు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది. గత చరిత్రను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆమెకు ఆశ్రయం కల్పించింది.

ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల ఊచకోత చూస్తుంటే ఇది రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదని, పాకిస్తాన్ (ఐఎస్ఐ) ప్రేరేపిత ఇస్లామిక్ మతోన్మాద రాక్షస ఎజెండా అని స్పష్టంగా అర్థం అవుతోంది. హిందువుల మీద యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో వైరలవుతున్న దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి ఘోరాలు చూసి హిందువులే కాదు, మానవత్వం ఉన్న వాళ్లంతా అయ్యో అని ఆవేదన చెందుతున్నారు. గతంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దారుణ మారణకాండపై అక్కడ పుట్టిన తస్లీమా నస్రీన్ ‘లజ్జా’ అనే పుస్తకం ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు అంతకుమించిన దారుణాలు కొనసాగుతున్నా సెక్యులర్ ముసుగు కప్పుకున్న భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు నోరెత్తడం లేదు.‌ బంగ్లాదేశ్ హిందూ సమాజం దాడులతో భీతిల్లిపోతుంటే కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే గాని, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాని స్పందించిన పాపాన పోలేదు. ఎన్నికలప్పుడు మాత్రమే హిందూ మందిరాలు, పీఠాలను సందర్శించే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. అక్కడి పరిణామాలపై స్పందిస్తూ కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. మన దేశంలోని ఆస్తులపై తొలి హక్కు పేద ముస్లింలదే అన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూ బంగ్లాదేశ్ హిందువుల ఆర్తనాదాలు వినిపించడం లేదు.

కాంగ్రెస్, వామపక్షాలు, ఆప్, టీఎంసీ, డీఎంకే, వైసీపీ, టీఆర్ఎస్ తదితర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు హిందువుల ఓట్లు కావాలి తప్ప హిందువుల క్షేమం అవసరం లేదు. వీరి దృష్టిలో ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే మనుషులు. ఇలాంటి పార్టీలు, నేతల నుంచి బంగ్లాదేశ్ హిందువులు సానుభూతిని ఆశించడమే మహాపాపం. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత వారం రోజులుగా జరుగుతోన్న బంగ్లాదేశ్ పరిణామాలను గ్రహించి బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నాయకత్వంలో ఐదుగురు అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తూ, అక్కడి అధికారులతో కమ్యూనికేషన్ జరుపుతూ, మన దేశ పౌరుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ బంగ్లాదేశ్ లో హిందువుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. యావత్ దేశ ప్రజలు బంగ్లాదేశ్ గురించి, ముఖ్యంగా అక్కడున్న హిందువుల గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత వేయి సంవత్సరాలకు పైగా భారత ఖండంలో దురాక్రమణదారులైన ముస్లిం రాజులు, ఇతర మతోన్మాదులు చేసిన దుర్మార్గాలను కోట్లాది మంది వివిధ రకాలుగా బలయ్యారు. స్వాతంత్ర్యం సమయంలో, దేశ విభజనలో లక్షలాది మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. 30 సంవత్సరాల క్రితం కాశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణ మారణకాండ ఈ మతోన్మాదతత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. బంగ్లాదేశ్ చుట్టూ ఆవరించి ఉన్న భారత్ ను దెబ్బతీసేందుకు కొన్ని విదేశీ శక్తులు అక్కడి మతోన్మాద శక్తులను రెచ్చగొడుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలతో ఏమాత్రం సంబంధం లేని హిందువులపై జరుగుతున్న రాక్షస హింస మనకు మరో గుణపాఠం కావాలి.