Jayanth Chaudary

రాజ్యాంగం మారుస్తారని ఎవరు చెప్పినా అది అబద్ధమే

Jayanth Chaudaryరాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ఎవరూ మార్చలేరని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత సహాయ మంత్రి (స్వతంత్ర), విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అని అన్నారు. పార్లమెంటులో 450 సీట్లు వచ్చినా అది జరగదన్నారు. రాజ్యాంగం మారుస్తారని ఎవరు చెప్పినా అది వాస్తవం కాదన్నారు. బిజెపికి ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందన్న ప్రచారం యూపీలో ప్రభావం చూపిందని, అందుకే కొన్ని సీట్లు ప్రతిపక్షానికి వెళ్లాయన్నారు. ఇది ప్రభుత్వంపై కానీ, ప్రధానిపై కానీ వ్యతిరేకత కాదని అన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను కాలానుగుణంగా మార్పులు చేసే బాధ్యత నిర్వర్తిస్తుందని, ఏదో ఒక మార్పు కొందరికి నచ్చకపోవచ్చన్నారు. ఒక జాతీయ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన జయంత్ చౌదరి  వక్ఫ్ (సవరణ) బిల్లు, బడ్జెట్‌లో ప్రకటించిన ఉపాధి పథకాలు, నీట్  వివాదం గురించి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: నీట్ పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) లో ఎలాంటి సంస్కరణలు అవసరం?

జ: నిజం చెప్పాలంటే అది నా పరిధిలోని అంశం కాదు. నేను పాఠశాలల వ్యవహారాలు చూస్తాను. నీట్ నిర్వహణ సులభమైన పని కాదు. ఇది పెద్ద సవాలు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి దానికీ పోటీ ఉంటుంది. ఎన్టీఏ 200కి పైగా పరీక్షలు నిర్వహించింది. ఐదు కోట్ల మందికి పైగా వీటిలో పాల్గొన్నారు. నిజంగా ఇందుకు ఎన్టీఏను అభినందించాలి. ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి. వ్యవస్థ ఎలా నడుస్తోందో నిరంతరం గమనించి ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దాలి. ఇది ఒక కమిటీకి ఇచ్చిన పని అని నేను అనుకుంటున్నాను. ఆ నివేదిక కోసం వేచి చూద్దాం.

ప్ర: గత 10 సంవత్సరాలలో మన పాఠశాల పాఠ్యపుస్తకాలు చాలా మార్పులకు గురయ్యాయి. ముఖ్యంగా సామాజిక శాస్త్రాలలో ఈ మార్పులు రాజకీయంగా చాలా సున్నితమైనవి. తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించినది. మసీదు పేరును తొలగించారు. దీనిపై మీ అభిప్రాయం?

జ: పుస్తకాల్లో దీన్ని రెండు గుమ్మటాల (రెండు డోమ్ ల) నిర్మాణంగా పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉంటుంది. ఆ ప్రత్యేక పదజాలం ఉపయోగించడానికి అదే కారణం. జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)లో విద్యావేత్తలు కాలానుగుణంగా మార్పులు చేసే బాధ్యత నిర్వర్తిస్తారు. ఏదో ఒక మార్పు కొందరికి ఇబ్బందిగా ఉండవచ్చు, నచ్చకపోవచ్చు. అలా అనే స్వేచ్ఛ మనకు ఎప్పుడూ ఉంటుంది. కానీ చాలా అసత్యాలు ప్రచారంలోకి వస్తాయి. ఉదాహరణకు ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ‘మీరు రాజ్యాంగం పీఠికను (పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి) తొలగించార’ని ఎవరో సభలో ఆరోపించారు. విద్యా మంత్రి దీనికి సమాధానమిచ్చారు. దానిని తీసివేయలేదని ప్రభుత్వం తన సమాచారాన్ని ప్రజలందరికీ తెలిసేలా వెబ్ సైట్ లో ఉంచింది.

ప్ర: యూపీలో బిజెపికి సీట్లు పడిపోడానికి కారణం ఏమై ఉంటుంది?

జ: భారతదేశంలో ఎన్నికల ఫలితాలను ఎవరూ ఊహించలేరు. యూపీలో ఏం జరిగిందో విశ్లేషించవచ్చు. యూపీలో ఎస్సీ, ఎస్టీ, ఇతర బడుగు వర్గాల జనాభా అధికంగా ఉంది. బిజెపికి ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందన్న ప్రచారం వారిపై బాగా ప్రభావం చూపింది. తమ ఓటు ద్వారా దీన్ని ఎలా అడ్డుకోవాలా అని వారు ఆలోచించారు. దానివల్ల చివరి నిమిషంలో కొన్ని సీట్లు ప్రతిపక్షానికి వెళ్లాయి. అలాగని ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రధాని పట్ల ఎక్కడా నాకు వ్యతిరేకత కనిపించలేదు. ఒక ఎంపీ పనితీరు బాగాలేకపోతే దాని ప్రభావం ఉంటుంది. స్థానిక అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.

ప్ర: ఎన్నికల సమయంలో రాజ్యాంగం గురించి మాట్లాడిన వారు బిజెపిలో చాలా మంది ఉన్నారు. యూపీలో ఎన్డీయే సీట్లపై ఇది ప్రభావం చూపిందని మీరు అనుకుంటున్నారా?

జ: సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ఎవరూ మార్చలేరు. పార్లమెంటులో ఎవరికైనా 450 సీట్లు వచ్చినా అది జరగదు. రాజ్యాంగం సజీవ పత్రం. అది శిలాశాసనం కాదు. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చడం వీలుకాకపోయినా అవసరాన్ని బట్టి మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి సవరణలు సాధ్యమే. కానీ సమూలమైన మార్పులు ఎప్పుడూ జరగవు. ఎవరు చెప్పినా, అది బిజెపి కావచ్చు, ఏదైనా భాగస్వామ్య పార్టీ లేదా ప్రతిపక్షం అయినా ఈ మాట చెప్పినా అది వాస్తవం కాదు.

ప్ర: హిండెన్‌బర్గ్ పై దర్యాప్తు ముగిసే వరకు, సెబీ చీఫ్‌ను తప్పించాలని మీరు భావిస్తున్నారా?

జ: నేను అంత దూరం వెళ్లను. ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఆమె కుటుంబం పెట్టుబడులలో రహస్యం ఏమీ లేదు. ఇది సెబీ చీఫ్‌గా ఆమె నియామకానికి ముందే జరిగిన పాత పెట్టుబడి. పారదర్శకత ఉన్నంత వరకు అందులో తప్పేమీ లేదు. మీరు సంస్థను, వ్యక్తిని ఒకేగాట కట్టడం తప్పు. సంస్థాగత విశ్వసనీయత ఉన్నంత వరకు పదవుల్లో ఎవరున్నారన్న విషయం ముఖ్యం కాదు. సెబీకి ఆ విశ్వసనీయత ఉంది

 ప్ర: బడ్జెట్ కొన్ని ఉపాధి, ఇంటర్న్‌షిప్ పథకాలను ప్రకటించింది. అందులో మీ మంత్రిత్వ శాఖ ఎలాంటి పాత్ర పోషించబోతోంది?

జ: దీని అమలుకు విధివిధానాలు రూపొందిస్తున్నాం. ప్రతి పథకంతో దీన్ని అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా మేం నైపుణ్యాలలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల కోసం వివిధ మంత్రిత్వ శాఖలు కలిసి వస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లఖ్ పతి దీదీ కార్యక్రమంపై పని చేస్తోంది. డ్రోన్లపై నైపుణ్యాల పెంపునకు శిక్షణ ఇస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని కింద మేం ప్రతి అప్రెంటిస్‌కు నెలకు రూ.1,500 చెల్లిస్తున్నాం. మాకు నాట్స్ (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) అనే మరో కార్యక్రమం కూడా ఉంది.

ప్ర: ప్రభుత్వం ఇప్పుడు వక్ఫ్ (సవరణ) బిల్లును తీసుకొచ్చింది. వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకే తీసుకొచ్చారని పెద్దయెత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మీ అభిప్రాయం ఏమిటి?

జ: నేను దాన్ని ఇంకా కొంచెం అధ్యయనం చేయాలి. వక్ఫ్ బహుశా మన దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్. దానిపై అనేక వివాదాలు ఉన్నాయి. ఆ వ్యవస్థలోని లోపాల వల్ల ముస్లింలకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. కాబట్టి, మైనారిటీ ప్రజల ప్రయోజనాల కోసం ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా ఈ ఆస్తులు పూర్తిగా వారి ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి.