ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనవరి 9న లేఖ రాశారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుందని అభివర్ణించారు. ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించి, అసలు బిల్లులే చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏడాది పాలన నిర్వాకం వల్ల రూ.వెయ్యి కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం ఫలితంగా ఆరోగ్యశ్రీ సేవలందక పేదలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల రూ.7వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ అందక కాలేజీ యాజమాన్యాలు మూతపడే దుస్థితి తలెత్తిందని వాపోయారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెబుతుంటే ఏం చేస్తున్నారని అడిగారు. ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. సుమారు రూ.380 కోట్ల మేరకు చెల్లిస్తామని టోకెన్లు జారీ చేసి నెలలు గడిచినా చెల్లింపులు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ పద్ధతిలో క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం సిగ్గుచేటంటూ ‘‘అవేమైనా బ్యాంకు లోన్లా? వడ్డీలతో కలిపి బకాయిలు పెరిగిపోతే వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవడానికి? ఇవ్వాల్సిన సొమ్మును సకాలంలో చెల్లించకపోవడమే కాకుండా… ఓటీఎస్ పేరుతో కోత విధిస్తామని చెప్పడం దుర్మార్గం. పేదలకు విద్య, వైద్యం అందించే విషయంలో చేతులెత్తేయడం దారుణం. రూ.2 లక్షల 75 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ నుండి రూ.8 వేల కోట్లు చెల్లించి లక్షలాది రోగులను, విద్యార్థులను ఆదుకోలేరా? విదేశీ పర్యటనలు, దిల్లీ పర్యటనలు, మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న మీకు రూ.8 వేల కోట్లు చెల్లించేందుకు మనసు రావడం లేదా? పేదల ప్రాణాలంటే మీకెంత చులకన ఉందో, విద్యార్థుల భవిష్యత్తు పట్ల మీకెంత చిన్నచూపు ఉందో తేటతెల్లమవుతోంది. తక్షణమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలి.’’ అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. లేకుంటే విద్యార్థులు, పేదలతో కలిసి ఉద్యమిస్తామని, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.