సామాజిక దార్శనికురాలు దేవి అహల్యాబాయి
31 మే 2024న హోల్కర్ రాజవంశపు గొప్ప రాణి దేవి అహల్యాబాయి మూడో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవి అహల్యాబాయి నిజమైన అర్థంలో రాణి కాదు. అయినప్పటికీ ఆమె ప్రజల హృదయాలను ఏలారు, అందువల్ల హోల్కర్ రాజవంశం స్థానమైన మహేశ్వర్లో కిరీటం లేని రాణిగా వెలుగొందారు. ఆమెను ‘లోకమాత’ అంటే ‘ప్రజల తల్లి’ అని పిలుస్తారు. దేవీ అహల్యాబాయి సమర్థులైన పాలకురాలు, దార్శనికురాలు. పాలకురాలిగా ఎల్లప్పుడూ ఆమె భారతదేశం యావత్తును దృష్టిలో పెట్టుకున్నారు. ఆమె చర్యలన్నీ ఎల్లప్పుడూ దేశం, ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టినవే. ప్రజల సమస్యలను, బాధలను అర్థం చేసుకోవడంలో ఆమె మృదుస్వభావి. జాతీయ ప్రయోజనాలు, భద్రతకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో ఆమె కఠినంగా, ధృడంగా వ్యవహరించారు.
దేవి అహల్యాబాయి సామాజిక సేవ, సంస్కరణల లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడం, రాజ్యంలో సంక్షేమాన్ని ప్రోత్సహించమే. ఈ కార్యక్రమాలు ఆమె రాజ్య సరిహద్దులు దాటి కూడా విస్తరించాయి. ఇవి ప్రజల తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్మాణాలను నిర్మించడం మాత్రమే కాదు, వివిధ మార్గాల్లో ప్రజల జీవితాలను మెరుగుపరిచే విస్తృత దృక్పథంతో రూపొందించినవి. విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం, మహిళా సాధికారత, నీటిపారుదల, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ ఆమె ఈ సేవలను అందించారు. ఆమెకు విస్తృత దృక్పథం ఉన్నప్పటికీ, ఆమె చర్యల వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం ప్రజలకు తగినంత ఆహారం, దుస్తులు, విద్యను అందించడం. ఆమె పథకాలు చూస్తే విస్మయం కలుగుతుంది! ఈ సమయంలో ఆమె పనుల గురించి, ఆమె స్పృశించిన ప్రజాజీవిత రంగాల గురించి తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది.
విద్య: ప్రజలకు ప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యంతో, దేవి అహల్యాబాయి మహేశ్వర్, ఇతర మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో వివిధ విషయాలలో నిపుణులైన వారి నివాసాలను ఏర్పాటు చేశారు. జ్ఞానాన్ని అందించడానికి అంకితమైన అలాంటి నిపుణులందరికీ ఏర్పాటు చేసిన ఆవాసాలకు వారణాసిలోని ‘బ్రహ్మపురి’ ఒక ఉదాహరణ. సరళమైన జీవనం, ఉన్నత ఆలోచనా సూత్రాన్ని అనుసరిస్తూ ఉపాధ్యాయులు తర్వాతి తరాలకు బోధించే ప్రదేశం ఇది. అప్పుడు బ్రహ్మపురిని దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకునే విశ్వవిద్యాలయంగా భావించేవారు. మరాఠా చరిత్రలో ప్రఖ్యాత న్యాయమూర్తి అయిన రామశాస్త్రి ప్రభునే ఈ ప్రదేశం నుంచే వచ్చారు. దేవి అహల్యాబాయి ‘శ్రీహల్యా కామధేను’ అనే పుస్తకాన్ని కూడా నిపుణులచే రచింపజేసి, స్వరపరిచేలా చేశారు. ఈ పుస్తకం రాజధర్మం (పాలనా సూత్రాలు, నైతికత) పై ఒక విజ్ఞాన సర్వస్వం లాంటిది. అహల్యాబాయి వద్ద సుమారు 75 పుస్తకాల సేకరణ కూడా ఉంది (ప్రధానంగా మతపరమైన ప్రాముఖ్యత కలిగినవి).
మౌలిక సదుపాయాల అభివృద్ధి: తీర్థయాత్రలను ప్రోత్సహించడానికి, ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి తన రాజ్యానికి వచ్చేలా ప్రోత్సహించడానికి దేవి అహల్యాబాయి దేవాలయాలు, ఘాట్లు (నదికి దారితీసే మెట్లు), బావులు, చెరువులు, ఇతర ప్రజా సౌకర్యాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం అనేక ప్రాజెక్టులను చేపట్టారు. ఇటువంటి పనులు భారతదేశం అంతటా – గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నుండి బెంగాల్ వరకు, హిమాలయాల నుండి హైదరాబాద్, దక్షిణాది వరకు ఆమె చేపట్టారంటే ఇప్పటి తరానికి ఎంతో ఆశ్చర్యం కలగక మానదు. అయోధ్య, వారణాసి, మథుర, చార్ధామ్, జగన్నాథ పురి వంటి అన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఆమె చేపట్టిన పథకాల పరిధిలోకి వస్తాయి. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయానికి కూడా ఆమె ఇలాంటి సదుపాయాలు కల్పించినట్టు రికార్డులు చెబుతున్నాయి!
దేవాలయాల నిర్మాణం/పునరుద్ధరణ నుంచి బావులు, చెరువులు, వంతెనల నిర్మాణం వరకు వివిధ రకాల పనులు చేపట్టారు. బెంగాల్లోని కర్మనాశిని నదిపై నిర్మించిన వంతెన ఇందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ నది బెంగాల్, ఇతర ప్రావిన్సుల గుండా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. అహల్యాబాయి గ్రామాల్లోకి నీరు ప్రవహించకుండా నిరోధించడానికి, దానివల్ల నష్టం కలగకుండా నిరోధించేందుకు వంతెనను నిర్మించారు. విదేశీ దండయాత్రల వల్ల, ముఖ్యంగా ముస్లిం దాడుల వల్ల తన వైభవం కోల్పోయిన హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడమే ఇటువంటి పనుల ముఖ్యోద్దేశం అని కూడా అర్థం చేసుకోవాలి.
ఆరోగ్యం, సంక్షేమం: దేవి అహల్యాబాయి ప్రజల బాగోగులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అందుకే ఆమె రోగులు, పేదల ప్రయోజనం కోసం అనేక ధర్మశాలలను (వసతి గృహాలు) నిర్మించారు. తన రాజ్యంలోకి వైద్యులను రప్పించి వారు స్థిరపడేలా చేశారు.
మహిళా సాధికారత: వివిధ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల వితంతువులకు పునరావాసం కల్పించేందుకు దేవీ అహల్యాబాయి ప్రత్యేక కృషి చేశారు. ఆమె దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చేనేతకారులను రప్పించి మహిళలకు చీరలు నేయడం నేర్పించారు. మహేశ్వరి చీరలు అని పిలుచుకునే చీరలను ఇప్పటికీ తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు పునరావాసం కల్పించడమే కాకుండా ఒక పరిశ్రమను స్థాపించారు. అహల్యాబాయి వారి కోసం ప్రత్యేకంగా మహిళా విద్య, ఇతర సంక్షేమ చర్యలను ప్రోత్సహించారు.
సామాజిక పునరావాసం: అప్పట్లో భిల్లు తెగవారు దోపిడీలు, ఇతర నేరాలకు పేరుమోశారు. దేవి అహల్యాబాయి వారికి సామాజికంగా పునరావాసం కల్పించడానికి ఒక వినూత్న పద్ధతిని ఉపయోగించారు. తన ధైర్యసాహసాలు ప్రదర్శించి భిల్లులను ఓడించే వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ఆమె మొదట ప్రకటించింది. ఫన్సే అనే ఒక వ్యక్తి భిల్లులతో విజయవంతంగా పోరాడి ఓడించాడు. వెంటనే తన కూతురిని అతనికిచ్చి ఆమె పెళ్లి జరిపించారు. తరువాత, భిల్లుల ఉపాధి కోసం ఆమె సరిహద్దులను రక్షించే పనిని వారికి అప్పగించారు. అటువంటి భిల్లులు తమ దైనందిన జీవనోపాధికి తోడ్పడటానికి వ్యవసాయం చేయడానికి, పంటలు పండించడానికి ఆమె వ్యవసాయ భూమిని విరాళంగా ఇచ్చారు.
ఇతర కార్యక్రమాలు: దేవి అహల్యాబాయికి సాంఘిక సంక్షేమం పట్ల సమగ్ర దృక్పథం ఉంది. కరువు సమయాల్లో, సైనిక దళాల మోహరింపు వల్ల పంటలు దెబ్బతిన్న సమయాల్లో ఆమె రైతులకు పలు రాయితీలు కల్పించారు. కోటలను పునరుద్ధరించడానికి, పునర్నిర్మించడానికి, నిర్వహించడానికి ఆమె ప్రజలను కోటలలో ఉండమని ప్రోత్సహించారు. అదేవిధంగా, ఆమె ‘పేట్’, ‘పురా’ అని పిలిచే ఆవాసాలను కూడా ఏర్పాటు చేశారు (మార్కెట్ చుట్టూ లేదా సమీపంలో నిర్మించిన ప్రజల ఆవాసాలను వర్ణించడానికి వాడే స్థానిక పదాలు ఇవి. సాధారణంగా గ్రామం / పట్టణం కేంద్ర ప్రదేశం). పక్షులు, కీటకాలు, జంతువులకు ఆహారం కోసం కొన్ని ప్రాంతాల్లో పంటలు పండించాలని ప్రజలను ప్రోత్సహించారు. నేటి పరిభాషలో చెప్పాలంటే ఆమె పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడటమే కాదు, పక్షులు, జంతువుల మనుగడ ప్రాముఖ్యత గురించి స్పృహ కలిగి ఉన్నారు.
అహల్యా దేవి గొప్ప దాత. ఆమె దాతృత్వం కేవలం మానవత్వం, ఉదాత్తతకు మాత్రమే పరిమితం కాలేదు. ఆమెకు దేశం, ధర్మం గురించి విస్తృతమైన స్పృహ ఉంది. ఆమె దృష్టిలో ప్రజాసంక్షేమం అంటే నిరుపేదలకు అండగా నిలవడమే కాదు, జాతి నిర్మాణానికి వారి మనస్సులను మలచడం. వాణిజ్యం, పరిశ్రమల స్థాపన లక్ష్యం కేవలం జీవనోపాధికి తోడ్పడటమే కాదు రాజ్యాన్ని అభివృద్ధి చేయడం కూడా. వివిధ వర్గాల ప్రజలకు పునరావాసం వారి రోజువారీ జీవనోపాధిని అందించడమే కాకుండా వారిలో కరుణ, సోదరభావం, సహానుభూతి భావనలను పెంపొందించడం అవసరమని ఆమె భావించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులకు, నిపుణులకు, కళాకారులకు ఆమె పోషకురాలిగా ఉండటంలో ఉద్దేశం వారికి జీవనోపాధిని అందించడమే కాకుండా కళలు, సంస్కృతిని పెంపొందించడం. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో సంక్షేమ పథకాలు నిర్వహించడం, తీర్థయాత్రలు, ఇతర కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఆమె ఉద్దేశం సామరస్యం, దేశంలోని భిన్న ప్రాంతాలవారి మధ్య ఏకత్వ భావనను పెంపొందించడం, కళలు, సంస్కృతులను ఇచ్చిపుచ్చుకొనేటట్టు ప్రోత్సహించడం, రవాణా, కమ్యూనికేషన్ కేంద్రాలను అభివృద్ధి చేయడం. అందువల్ల ప్రజలు ఆమెను తమ ‘తల్లి’గా భావించినా ఆశ్చర్యపోనవసరం లేదు. 300 ఏళ్ల తర్వాత కూడా ఆమె 30 ఏళ్ల పాలన మార్గదర్శకంగా నిలిచింది! కాబట్టి లోకమాతకు శిరస్సు వంచి నమస్కరిద్దాం!
ప్రమోద్,
సోషల్ స్టడీస్ ఫౌండేషన్ డైరెక్టర్