Amit Shah

బాధితులకు సత్వర న్యాయం కొత్త చట్టాల లక్ష్యం

Amit Shah

భారతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు మూలస్తంభాలైన 1860 నాటి భారత శిక్షాస్మృతి (ఐపీసీ), 1882లో రూపొందించిన నేరస్మృతి (సీఆర్పిసి), 1872 నాటి సాక్ష్యాధారాల చట్టం స్థానంలో మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యాధునిక న్యాయ వ్యవస్థ అవుతుందని హోంమంత్రి అమిత్‌ షా భావిస్తున్నారు. నూతన చట్టాల ద్వారా ప్రభుత్వం తొలగించ తలపెట్టిన రుగ్మతల్లో ఒకటి కేసుల విచారణలో విపరీతమైన జాప్యం. నేరం చేయనివారికి కూడా విచారణ ప్రక్రియ ఒక శిక్షగా మారే పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రజలు ఇక న్యాయం కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని షా అన్నారు. ‘‘కొత్త చట్టాల ప్రకారం మూడేళ్లలో బాధితులకు న్యాయం జరుగుతుంది. తేదీ తర్వాత మరో తేదీకి వాయిదాలు పడే శకం ముగుస్తుంది,” అంటూ కోర్టు వాయిదాల సంస్కృతిపై ప్రముఖ బాలీవుడ్ డైలాగ్‌ ఒకదాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవస్థాగత సంస్కరణ పూర్తిగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుందని హోమ్ మంత్రి ఉద్ఘాటించారు. ఒక ఆంగ్ల దినపత్రికకు కొత్త చట్టాల వివిధ కోణాలపై ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాశాలు:

ప్ర: ఈ మూడు కొత్త చట్టాలు భారత్ నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పును తీసుకువస్తాయని, అలాగే వలసవాద మనస్తత్వం నుంచి పౌరులను విముక్తి చేస్తామని మీరు అంటున్నారు. ఎలా?

జ: ఈ కొత్త చట్టాలు మూడు కోణాలను కలిగి ఉంటాయి. వాటిని మూడు పార్శ్వాల నుంచి చూడాలి. అప్పుడే విశాల దృశ్యాన్ని అర్థం చేసుకోగలరు. మొదటగా, నేను చెప్పినట్లుగా, ఈ చట్టాలు పూర్తిగా భారతీయ న్యాయ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. ఇది స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా వలసవాద మనస్తత్వం నుంచి మనల్ని విముక్తి చేస్తుంది. రెండు, అమలు తర్వాత అవి ఆధునిక సాంకేతిక యుగానికి అనుగుణంగా ప్రపంచంలోని అత్యంత ఆధునిక నేర న్యాయ వ్యవస్థగా మారతాయి. మూడోది, 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో సకాలంలో న్యాయం పొందాలని ప్రజలు నిరంతరం ఎదురుచూసే సమయంలో ఈ మూడు చట్టాల అమలుతో దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే మూడేళ్ళలో వారికి న్యాయం జరుగుతుందని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను. మొత్తంగా ఈ చట్టాలు దేశంలోని నేర న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. నేను మొదటి అంశం, అంటే ఈ చట్టాలు భారతీయ స్ఫూర్తిని ఎలా తమలో నింపుకొని ఉన్నాయన్న దాని గురించి మరికొంచెం వివరిస్తాను. ఈ చట్టాల ప్రధాన లక్ష్యం న్యాయాన్ని అందించడం. అవి శిక్షలు విధించడం కంటే అందరికీ న్యాయం జరిగేలా చూడటానికి ప్రాధాన్యమిస్తాయి. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలు ఈ దేశ పౌరుల కోసం కాకుండా బ్రిటిష్ వారు అధికారాన్ని కాపాడుకోవడం కోసం రూపొందించబడ్డాయి. వారు ధనాగారం, రైల్వేలు, బ్రిటిష్ అధికారుల భద్రత ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నారు. పాత చట్టాలు నిజానికి 1857 తర్వాత బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాట్లను అణిచివేసేందుకు రూపొందించబడ్డాయి. కనుక భారతీయులకు న్యాయాన్ని నిరాకరించడం వారి ఉద్దేశం. భారత్ ను ఆ మనస్తత్వం నుంచి, అన్ని బానిసత్వ చిహ్నాల నుండి విముక్తి చేయాలని మన ప్రధాని ఎర్రకోట బురుజు నుంచి చెప్పారు. మన కొత్త నేర న్యాయ వ్యవస్థ మనల్ని ఆ ఆలోచన నుంచి విముక్తి చేస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇది ప్రజల-కేంద్రిత, న్యాయ-ఆధారిత వ్యవస్థ. 158 సమావేశాలలో విస్తృత చర్చలు, వేలసంఖ్యలో సూచనల ఆధారంగా మూడు శాసనాలను తీసుకువచ్చాం. హోం మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం ఈ బిల్లులను పరిశీలించింది. ఇప్పుడు, ప్రధాని మోదీ నాయకత్వంలో న్యాయం, సమానత్వం, నిష్పక్షపాతం సూత్రాల ఆధారంగా వీటిని తీసుకువస్తున్నాం. రూ.5,000 కంటే తక్కువ విలువైన దొంగతనాలకు సమాజ సేవలను శిక్షగా విధించడం భారతీయ న్యాయతత్వ స్ఫూర్తితో ప్రజలు, న్యాయం ఆధారంగా ఈ చట్టాలను ఎలా రూపొందించామనే దానికి ఒక ఉదాహరణ. వీటి ప్రాథమిక లక్ష్యం మూడేళ్లలోపు న్యాయం అందించడం, ‘తారిఖ్ పే తారీఖ్’ (తేదీ తర్వాత తేదీ) వాయిదాల దుర్మార్గం నుంచి విముక్తి కల్పించడం. న్యాయం కోసం నిరీక్షించడమే పేదలకు అతిపెద్ద సవాలు. న్యాయం ఆలస్యమయ్యే శకం ముగిసింది.

ప్ర: కొత్త చట్టాల ప్రధాన లక్ష్యం న్యాయాన్ని అందించడమేనని, శిక్షలు విధించడం కాదని మీరు నొక్కి చెప్పారు. దీనిపై న్యాయ కోవిదులు, న్యాయవాదులు, ప్రభావితంకాగల వర్గాలు, ఉదాహరణకు ట్రక్కర్లు మొదలైన వారి నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అభ్యంతరాలపై మీ స్పందన ఏమిటి?

జ: కొత్త చట్టాలు బాధితులకు, నిందితులకు న్యాయం పరిధిని విస్తృతం చేసే హేతుబద్ధమైన పలు నిబంధనలను కలిగి ఉన్నాయి. చిన్న లేదా మొదటిసారి నేరాలు చేసిన వారికి మొత్తం ఆరు నేరాలలకు సంబంధించి జైలుకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో గాని, పొరపాటున గాని చిన్నచిన్న కేసుల్లో నిందితులైన వారు సమాజ సేవను అందించడం ద్వారా తమను తాము మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు. చిన్న కేసులకు ఇప్పుడు సత్వర విచారణ తప్పనిసరి; మేజిస్ట్రేట్ మూడు సంవత్సరాల వరకు శిక్షలు పడే కేసులను వెంటనే విచారించి తీర్పులు ప్రకటించాలి. ఇంతకుముందు పోలీసులు తరచూ వ్యక్తులను వారి కుటుంబాలకు చెప్పకుండా తీసుకువెళ్లి వారిని తమ అదుపులో ఉంచుకోవడమో, అరెస్టు చేయడమో జరిగేది. ఇప్పుడు అన్ని పోలీసు స్టేషన్‌లు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉండే రిజిస్టర్‌ను ఉంచాలి. ఎవరెవరిని తీసుకెళ్ళారు, ఎంత మంది కస్టడీలో ఉన్నారు అందులో వివరాలు ఉండాలి. పోలీసులు వారిని 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి లేదా అధికారిక రిమాండ్ ఇవ్వవలసి ఉంటుంది. ఇంతకుముందు పోలీసులు వీడియోగ్రఫీ లేకుండా సోదాలు చేయవచ్చు, ఏ వస్తువునైనా స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని సోదాలు, స్వాధీనాలు ఇద్దరు తటస్థ సాక్షుల సమక్షంలో వీడీయో కెమెరా ముందు జరగాలి. బాధితుల విషయానికి వస్తే ఇంతకు ముందు మీ ఫిర్యాదు ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఎన్నాళ్లైనా అలాగే పడిఉండేది. ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్ కు చట్టబద్ధత ఉంది. ఎఫ్‌ఐఆర్ ఉచిత కాపీని పొందే హక్కు బాధితుడికి ఉంది. బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత వారికి జవాబు ఇవ్వడం, ఆ తర్వాత 90 రోజులలోపు వారికి సమాచారం అందించడం, అలాగే దర్యాప్తు, విచారణ పురోగతి గురించి పక్షం రోజులకు ఎస్ ఎం ఎస్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా తెలియజేయడం ఇక తప్పనిసరి. అంతకుముందు కేసును ఉపసంహరించుకోవడానికి బాధితుని సమ్మతి అవసరం లేదు. ఇప్పుడు అది తప్పనిసరి. ఆడియో-వీడియో రికార్డింగ్‌లను కోర్టులో హాజరుపరచడం కూడా కొత్త చట్టాల ప్రకారం తప్పనిసరి. సాక్షులు, నిందితులు, నిపుణులు, బాధితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఆన్‌లైన్‌ పద్దతిలో కోర్టుకు హాజరు కావచ్చు. లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజులలోపు దర్యాప్తు నివేదికలను సమర్పించడం, మొదటి విచారణ జరిగిన 60 రోజులలోపు అభియోగాలు మోపడం చట్టాలలో మరొక ముఖ్యమైన భాగం. క్రిమినల్ కేసుల విచారణ ముగిసిన 45 రోజులలోపు తీర్పు కూడా రావాలి. కొత్త చట్టాల్లోని మూడు ప్రధాన న్యాయ-కేంద్రిత లక్షణాలను క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు: తన వాదన వినిపించే అవకాశం, సమాచార పొందే హక్కు, నష్టాలకు పరిహారం పొందే హక్కు.

ప్ర: పోలీసింగ్‌ను మెరుగుపరచడంలో ఈ చట్టాలు ఎలా సహాయపడతాయి?

జ: చూడండి, ఈ చట్టాలతో మొత్తం వ్యవస్థ మారిపోతుంది. వారు అన్ని అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకుంటారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా రాబోయే 50 సంవత్సరాలలో రాబోయే అన్ని సాంకేతికతలకు అనుగుణంగా నిబంధనలు రూపొందించాం. తద్వారా మొత్తం పోలీసింగ్ వ్యవస్థను సమూలంగా మార్చనున్నారు. ఇ-రికార్డుల నుంచి జీరో ఎఫ్‌ఐఆర్‌లు, ఇ-ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్‌ల వరకు ఏ అంశం కూడా రాతకోతల గందరగోళంలో చిక్కుకోదు. అనేక విధానాలు డిజిటలైజ్ అవుతాయి. ఛార్జిషీట్‌లు ఇప్పుడు కాగితాలపై కాకుండా పెన్ డ్రైవ్‌లలో ఉంటాయి. సాక్షులను ఆన్ లైన్ లో కోర్టులో ప్రవేశపెట్టవచ్చు. అత్యాచార బాధితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మొబైల్‌లో రికార్డు చేసిన ఈ-స్టేట్‌మెంట్లను ఇవ్వవచ్చు. ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలలో, నేరానిర్ధారణలను 90 శాతానికి పెంచే లక్ష్యంతో పరిశోధనలలో శాస్త్రీయ ఫోరెన్సిక్ పద్ధతులను తప్పనిసరి చేశాం. అదే సమయంలో, ఇప్పుడు విచారణలు ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. నిందితులకు సమన్లు అందజేయడానికి నెలల సమయం పట్టేది. ఇప్పుడు వాట్సాప్‌లో సమన్లు జారీ చేస్తారు. సమన్లు అందుకోవాల్సిన వ్యక్తి వాట్సాప్ సందేశాన్ని తెరిచిన వెంటనే అది అతనికి అందినట్టుగా పరిగణించబడుతుంది. కోర్టుకు ఆన్‌లైన్‌ లో నిందితుల హాజరుకు అవకాశం ఉండటంతో నిందితులను జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పోలీసు దర్యాప్తు నుంచి కోర్టు విచారణల వరకు ప్రతిదీ కంప్యూటరైజ్ అవుతుంది. ఎందుకంటే మేం ప్రపంచంలోని అత్యంత ఆధునిక న్యాయ వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌ను కలిగి ఉండాలనే నిబంధనతో పాటు, న్యాయ ప్రక్రియ నుండి అవినీతిని నిర్మూలించాలనే ప్రధానమంత్రి మోదీ లక్ష్యానికి, దృష్టికి అనుగుణంగా మేం అనేక నిర్ణయాలు తీసుకున్నాం. సివిల్ సర్వీసెస్‌లో అవినీతిని అంతం చేయాలనే లక్ష్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలలో ఒకటి ఏమిటంటే ఈ చట్టాలు కేసు నమోదు చేసిన 120 రోజులలోపు అటువంటి కేసులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి చేశాయి.

ప్ర: నేరస్తులను సంస్కరించడం, నిబంధనలను మరింత మానవీయం చేయడం, నిర్దోషులకు శిక్షించబడకుండా వారికీ హక్కులు కల్పించడం, అండర్ ట్రయల్స్ (విచారణ కోసం ఎదురు చూసే వారు) కస్టడీ సమయాన్ని తగ్గించడం, బెయిల్ అవకాశాలను పెంచడం, దర్యాప్తుకు కాలపరిమితిని నిర్ణయించడం ఈనాటి న్యాయ సంస్కరణల్లో కనిపిస్తున్న ఆధునిక ధోరణులు. ఈ చట్టాలలో ఎంతవరకు ఈ ధోరణులకు చోటు కల్పించారు?

జ: మేం ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఉన్నాం. చిన్న లేదా మొదటిసారి నేరం చేసిన వారికి సమాజ సేవ ద్వారా సంస్కరణకు అవకాశం కల్పిస్తునాం. మొదటిసారి నేరం చేసిన వారు శిక్షలో మూడింట ఒక వంతు పూర్తి చేస్తే ఇప్పుడు బెయిల్‌కు అర్హులు. రెండోసారి నేరం చేసి శిక్ష పడిన వాళ్ళు మొత్తం శిక్షలో సగం పూర్తి చేసినట్లయితే అతను లేదా ఆమె బెయిల్‌కు అర్హులవుతారు. మొత్తం ప్రాసిక్యూషన్ సమయంలో పోలీసులు, ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులు 35 సెక్షన్లలో పేర్కొన్న కాలపరిమితిని పాటించాలి. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంది. కాగ్నిసెన్స్ తీసుకోవడానికి కాలపరిమితి ఉంది. క్రిమినల్ కేసుల విచారణ పూర్తయిన తర్వాత న్యాయమూర్తులు 45 రోజుల్లోగా తీర్పు వెలువరించాల్సి ఉంటుంది.

ప్ర: మరి ‘ప్రకటిత నేరస్తులు’ సంగతేమిటి? కొత్త చట్టాలు వారి విషయంలో ఏమి చెబుతాయి?

జ: ఎవరినైనా ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటే నిందితుడికి పడే శిక్ష 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష లేదా జీవిత ఖైదు లేదా మరణశిక్ష అయి ఉండాలి. దీంతోపాటు పారిపోయిన వారి లేదా నేరస్తుల ఆస్తి, దేశంలోనైనా లేదా వెలుపల అయినా, జప్తు చేస్తారు. పరారీలో ఉన్నవారిని వారి పరోక్షంలో కూడా విచారించే ఒక నిబంధనను రూపొందించాం. ఉదాహరణకు, దావూద్ ఇబ్రహీం పారిపోయి వేరే చోట స్థిరపడితే దాని వల్ల కీలకమైన ముంబై బాంబు పేలుళ్ల కేసులో విచారణ ప్రారంభం కాదు. ఇప్పుడు కోర్టు డిఫెన్స్ లాయర్‌ని నియమించి విచారణను ప్రారంభిస్తుంది. కేసు విచారణ ముగిసి నేరం రుజువైతే శిక్షను ప్రకటిస్తుంది. పరారీలో ఉన్న వ్యక్తికి విధించిన శిక్షపై ఏదైనా అభ్యంతరం ఉంటే, వారు కోర్టుకు వచ్చి అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది. వారు చేయకపోతే, వారి కేసు చట్టపరమైన స్థితి మారుతుంది. వారికి శిక్ష పడుతుంది. ఆర్థిక నేరాలు కావచ్చు, తీవ్రవాద సంబంధిత నేరాలు కావచ్చు, అటువంటి నేరాలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన వారందరి ఆస్తులు దేశం వెలుపలి వాటితో సహా జప్తు చేయబడతాయి. వారికి ఉచ్చు మరింత బిగుస్తుంది. భారత న్యాయ వ్యవస్థలో ఇలాంటి నిబంధనలు చేర్చడం ఇదే తొలిసారి.

ప్ర: పౌరులకు పారదర్శకత, జవాబుదారీతనం విషయంలో ఈ చట్టాల్లో ఏయే నిబంధనలు ఉన్నాయి?

జ: పలుకుబడిలేని పేద బాధితులకు న్యాయం దక్కకపోవడం లేదా వారు అనంతంగా వేచి చూడాల్సి రావడం తరచుగా కనిపిస్తుంది. వ్యక్తిగత, వ్యవస్థాగత అవినీతి దీనికి కారణం. ఏదైనా కేసులో బాధితులకు న్యాయం జరగనప్పుడు తీర్పుపై అప్పీలు చేయాలా వద్దా అనేది మొదట న్యాయం చేయని వారే నిర్ణయించేవారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ నుంచి అవినీతిని నిర్మూలించాలనే ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా, పేదలు బాధితులైన సందర్భాల్లో అప్పీలు చేయాలా వద్దా అని నిర్ణయించడానికి మూడు స్థాయిలలో స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌తో కూడిన డెరైక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ప్రతి రాష్ట్రంలోనూ ఉంటుంది. జిల్లా స్థాయిలో అవసరమైనంతమంది డిప్యూటీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌తో కూడిన జిల్లా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన శిక్షకు సంబంధించిన కేసుల్లో అప్పీలు చేయాలా వద్దా అనేది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నిర్ణయిస్తారు; 7-10 సంవత్సరాల మధ్య శిక్షలను డిప్యూటీ డైరెక్టర్ నిర్ణయిస్తారు; అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షలు పడే కేసులపై నిర్ణయాలు జరుగుతాయి. ప్రధాన లక్ష్యం అవినీతిని నిర్మూలించడం, చట్టపరమైన ప్రక్రియల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సమర్థమైన ప్రాసిక్యూషన్‌ జరిగేలా చూడటం. న్యాయమూర్తులకు సంబంధించిన నిబంధనల విషయంలో కూడా దేశవ్యాప్తంగా ఒకేవిధమైన న్యాయ వ్యవస్థను రూపొందించడానికి కూడా మేం కృషి చేసాం. ఈ కొత్త చట్టాల అమలుతో, కేవలం నాలుగు రకాల న్యాయమూర్తులు సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు, సెషన్స్ జడ్జీలు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు మాత్రమే ఉంటారు. మూడవ తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లు. అసిస్టెంట్ సెషన్స్ జడ్జీల తరగతులను రద్దు చేశాం.

ప్ర: కొత్త చట్టాలకు అలవాటు పడటంతో పాటు వాటి పదజాలాన్ని గురించి కూడా న్యాయవాద వర్గాల్లో సందేహాలు ఉన్నాయి. దీనివల్ల వీటి అమలులో జాప్యం జరుగుతుందా?

జ: చట్టాలను మార్చినప్పుడల్లా అటువంటి భయాలు, ఆందోళనలు తలెత్తుతాయి. 160 ఏళ్ల నాటి చట్టాలతో ఈ దేశం నడుస్తుందా? ఆచరణలో ఏవైనా వైరుధ్యాలు లేదా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు మార్గాలను పరిశీలిస్తాం. చట్టాలను నోటిఫై చేసిన వెంటనే, పాత సెక్షన్లు, చట్టాలు కొత్త చట్టాలలలో బ్రాకెట్లలో కనిపిస్తాయి. మేం ఇప్పటికే దేశంలోని అన్ని షెడ్యూల్డ్ భాషలలో కొత్త చట్టాలపై పుస్తకాలను బ్రాకెట్లలో పాత పేర్లతో ప్రచురించాం. హోంశాఖ కొత్త చట్టాలను వివరిస్తూ, ఏవైనా గందరగోళాలను ఉంటే వాటిని తొలగించేందుకు ఒక యాప్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీన్ని త్వరలో ప్రారంభిస్తాం. ఇది మొబైల్‌లలో అందుబాటులో ఉంటుంది. రెండు మూడు నెలల్లో కొత్త చట్టాల ప్రతి సెక్షన్, నిబంధన న్యాయవర్గాల్లోనూ, చట్టాన్ని అమలు చేసే సంస్థలలోనూ అందరికీ కంఠతా వస్తాయి. మేం బాధితుల-కేంద్రిత న్యాయం వైపు, వలసవాద మనస్తత్వం, దాని చిహ్నాల నుంచి ప్రజలను విముక్తి చేసే దిశగా పయనిస్తున్నాం. అయితే దేశానికి హాని కలిగించేందుకు ప్రయత్నించే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తిలేదు.

ప్ర: కానీ కొత్త చట్టాలు దేశంలో పోలీసు రాజ్యాన్ని తీసుకువస్తాయన్న భయం ఉంది.

జ: ఈరోజు పోలీసులు దాడులు చేసినా, సోదాలు చేసినా, స్వాధీనం చేసుకున్నా వీడియోగ్రఫీ చేయడం లేదు. ఇకనుంచి అది తప్పనిసరి అవుతుంది. ఇది పోలీసుల అధికారాన్ని పెంచుతుందా లేదా తగ్గిస్తుందా? మొదటిసారిగా, తప్పుడు కేసుల నమోదుకు వ్యతిరేకంగా తనిఖీ చేయడానికి మేం ప్రాథమిక విచారణ కోసం ఒక నిబంధనను తెచ్చాం. కేసులు పెట్టే ముందు దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇది పోలీసుల అధికారాన్ని తగ్గిస్తుందా లేక పెంచుతుందా? ఈ రోజు పోలీసులు ఎవరినైనా అరెస్టు చేస్తే, అరెస్టు చేసిన వ్యక్తి కుటుంబానికి తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక నుంచి ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్లు ఉంచి అటువంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. అది పోలీసుల ఏకపక్ష హక్కులను పెంచుతుందా? తగ్గిస్తుందా? కొత్త చట్టాల ప్రకారం, అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు లేదా కోర్టులో హాజరుపరచకపోతే, పోలీసు అధికారి క్రిమినల్ కేసు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇది పోలీసుల హక్కులను పెంచుతుందా లేక తగ్గిస్తుందా? ఒక పోలీసు అధికారిపై కేసు నమోదైతే అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధిత పై అధికారి నుంచి అనుమతికి సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు, అటువంటి అనుమతి 180 రోజులలోపు రాకపోతే అనుమతి వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా, పోలీసులు జవాబుదారీగా ఉండటానికి, వారి ఏకపక్ష పోలీసు అధికారాలను తగ్గించడానికి 20 నిబంధనలు ప్రవేశపెట్టాం. కానీ పోలీసులకు తగిన అధికారాలు లేకపోవడం వల్ల నేరస్థులు తప్పించుకునే సందర్భాల్లో మేం పోలీసులకు తగిన అధికారం ఇచ్చాం. దేశ న్యాయవ్యవస్థకు స్పందించని వారికి ఎలాంటి హక్కులు ఉండకూడదు.

ప్ర: మూక హత్యల (మాబ్ లించింగ్) సంగతి ఏమిటి? దీనికి ఒక ప్రత్యేక నిబంధన చేర్చారు కదా.

జ: ఈ కొత్త చట్టాలలో మొదటిసారిగా మూక హత్య లేదా మాబ్ లింఛింగ్ ను నిర్వచించారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మూక హత్యల సమస్య కేవలం మత విద్వేషాల ఫలితమే అని భావించే ఒక వర్గం మన దేశంలో ఉంది. అయితే అనేక మూక హత్యల కేసుల్లో బాధితులు దొంగలే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీరి తరువాత అత్యధిక సంఖ్యలో మహిళలు మూఢనమ్మకాల కారణంగా మంత్రగత్తెలనే నెపంతో మూక హత్యలకు గురవుతున్నారు. ఆ తర్వాత కులాంతర లేదా మతాంతర వివాహాలు చేసుకునే జంటలు ఉన్నాయి. మతఘర్షణలు తర్వాత కూడా మూక హత్యలు చోటుచేసుకుంటాయి. ఇలాంటి నేరాలన్నింటిని ఉక్కుపాదంతో అరికట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు లౌకికవాదులుగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వాలు మూక హత్యల నివారణకు అటువంటి చట్టాలను తీసుకురాలేదు. మూక హత్యల కేసుల్లో నిందితులకు ఏడేళ్ల జైలుశిక్ష, ఎవరైనా శాశ్వత అంగవైకల్యానికి గురైతే బాధ్యులకు 10 ఏళ్ళ జైలు వంటి నిబంధనలతో మేం ప్రత్యేక సెక్షన్‌లను రూపొందించాం. మరణశిక్ష విధించే నిబంధన కూడా చేర్చాం. సైబర్ నేరాల విషయంలో కూడా ఈ నిరోధక విధానాన్ని అనుసరించాం.

ప్ర: కొత్త చట్టాలలో ఉగ్రవాదాన్ని కూడా నిర్వచించారా?

జ: అవును, దేనికైనా సరైన నిర్వచనం లేకుండా దానితో వ్యవహరించడం కష్టం. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించని (జీరో టాలరెన్స్) విధానాన్ని అవలంబిస్తూ మేం మొదటిసారిగా ఏయే చర్యలు నేరం కింద పరిగణించబడతాయో నిర్వచించాం. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత లేదా ఆర్థిక భద్రతకు అపాయం కలిగించే పనులు ఇప్పుడు ఉగ్రవాదంగా పరిగణించబడతాయి, మరణశిక్ష లేదా జీవిత ఖైదుకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. దేశ సమైక్యతతో చెలగాటమాడాలని ఎవరు ప్రయత్నించినా వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.

ప్ర: అంతర్గత భద్రతకు బాధ్యత వహించే హోం మంత్రిగా, ఇటువంటి చట్టాలు తిరుగుబాట్లను అరికట్టగలవని మీరు భావిస్తున్నారా?

జ: చట్టాలు తిరుగుబాట్లను అంతం చేస్తాయని నేను చెప్పలేను. ఉగ్రవాదం నిర్వచనంలోకి రాదని ముందు గ్రహించండి. అయితే తిరుగుబాట్లను అంతం చేసే ప్రక్రియ ఇప్పుడు వేగవంతం అవుతుంది. ఈ చట్టాల నుంచి పోలీసు బలగాలకు చట్టపరమైన మద్దతు మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్ర: దేశద్రోహం నిర్వచనాన్ని కూడా మార్చారు. గతంలో దేశద్రోహ చట్టాలను ఉపయోగించినప్పుడు దాని గురించి ఆందోళనలు కూడా జరిగాయి. కొత్త భావనల గురించి వివరించగలరా?

జ: ‘రాజద్రోహం’, ‘దేశద్రోహం’ మధ్య చాలా తేడా ఉంది. ఇంతకుముందు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు అది దేశద్రోహంగా పరిగణించబడేది. దాని కింద సావర్కర్, గాంధీజీతో సహా చాలా మంది జైలు పాలయ్యారు. మేం దీని నుండి ‘రాజ్’ ఆలోచనను తీసివేసి, ‘దేశద్రోహ్’కి సంబంధించిన నేరాన్ని మాత్రమే ఉంచాం. భారతదేశం ఐక్యత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తిస్తే వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి మేం ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కానీ దేశానికి వ్యతిరేకంగా చేసిన చర్యను కూడా నేరంగా చూడకూడదని ఎవరైనా చెబితే, మేం దానికి వ్యతిరేకం. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని విడిచిపెట్టబోం.

ప్ర: వివాహేతర సంబంధాల చట్టం తీవ్రతను తగ్గించారని, ఇకపై స్త్రీపురుషులను ఒకేవిధంగా చూడరని చెబుతున్నారు?

జ: వివాహేతర సంబంధాల చట్టాలను నీరుగార్చలేదు. దీనిపై సుప్రీంకోర్టు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

ప్ర: కొత్త చట్టాల కోసం హిందీ పదజాలాన్ని ఉపయోగించడంపై అసంతృప్తి ఉంది. మీరు దీన్ని ఎలా తీసుకుంటారు?

జ: చూడండి, ఇంతకు ముందు హిందీలో అనేక చట్టాలను రూపొందించారు. వాటిలో చాలా చట్టాలను డీఎంకే లేదా ఐడిఎంకె కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పుడు చేశారు. కానీ ఇప్పుడు మేం ఈ చట్టాలను తీసుకువచ్చినందుకే గొడవ చేస్తున్నారు. మీరు ఇంగ్లీషును అంగీకరిస్తున్నారు కానీ దేశంలోని భాషను అంగీకరించరు. నెమ్మదిగా ఈ మాటలు అందరి నాలుకలపై ఆడతాయి. కేవలం పేర్లను మాత్రమే మార్చలేదు. పాత చట్టాల స్ఫూర్తినే మార్చేశారు.