మోదీ పాలనలో దేశం సుభిక్షం
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టే దేశంలో అల్లర్లు, బాంబు పేలుళ్లు లేవని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి దేశంలోని 10కోట్ల మంది మహిళలకు విముక్తి కల్పించారన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసి 500 సంవత్సరాల కల నెరవేర్చారని చెప్పారు. చంద్రయాన్-3 ద్యారా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టామన్నారు. ఎన్నికల ప్రణాళికలలో గ్యారెంటీ ఇచ్చారు కాబట్టే మోదీ ఇవన్నీ చేస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ విప్లవాత్మక, విధానపర నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టే దేశం సుభిక్షంగా ఉందని స్పష్టం చేశారు. మార్చ్ 2న అంబర్ పేట్ మహంకాళి ఆలయం వద్ద నిర్వహించిన ముగింపు సభలో పాల్గొన్న ఆయన పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సభలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ‘‘వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు.. ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేవి. దేశ భవిష్యత్తును నిర్ణయించేవి.. శాంతి భద్రతలు నిర్ణయించే ఎన్నికలు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాకముందు దేశ పరిస్థితి ఎలా ఉందో చూసాం. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఎలా ఉందో మనందరం చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలి.
గత యూపీఏ పాలనలో ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. మొత్తం అవినీతి కుంభకోణాలే. సోనియా గాంధీ నేతృత్వంలో గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలు, సామాన్య ప్రజలు దగా పడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. రూ.12లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేసింది. జలయజ్ఞం పేరుతో తెలంగాణలో కూడా అవినీతి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి.. దోపిడీ ప్రభుత్వం పోవాలని 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి దేశ ప్రజలు పట్టం కట్టారు. పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. నీతివంతంగా, నిజాయితీగా ధర్మ పాలన చేయడమే మోదీ గ్యారెంటీ.
గత యూపీఏ పాలనలో బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యక్రమాలు జరిగేవి. ఏకే47లతో ఉగ్రవాదులు తిరిగేవారు. గత 10సంవత్సరాలుగా నరేంద్ర మోదీ దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేశారు. టెర్రరిజం విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి పని చేసింది కాబట్టే ఉగ్రవాదులు పాకిస్తాన్ కి పారిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆడిందే ఆట…పాడిందే పాట. నేడు దేశంలో ఉగ్రవాదాన్ని అడ్రస్ లేకుండా అణచి వేశారు.
50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వేసిన జాతీయ రహదారుల కంటే తొమ్మిదిన్నరేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వేసిందే ఎక్కువ. మెడికల్ కాలేజీలు, ఐఐటీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, బీబీనగర్ లో ఏయిమ్స్, సనత్ నగర్ లో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ నరేంద్ర మోదీ నాయకత్వంలోనే తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం. యూపీఏ పాలనలో అనేక విద్యుత్ కోతలు, ఎరువుల కోతలు ఉండేవి.. ప్రస్తుతం దేశంలో మిగులు విద్యుత్, ఎరువులు ఉన్నాయి. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేసి, భూమి పూజ చేసి, పునఃప్రారంభించింది నరేంద్రమోదీనే.
మోదీ పేద కుటుంబంలో పుట్టారు కాబట్టే పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజల కోసం రూ.5లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. జన్ ధన్ పేరుతో పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘనత నరేంద్ర మోదీదే. కరోనా కష్ట కాలంలో 140 కోట్ల భారతీయులకు మనోధైర్యం కల్పించి ఉచిత వ్యాక్సిన్లు అందించిన ఘనత నరేంద్ర మోదీదే. ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్లు సరఫరా చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే దేశంలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రూ.9లక్షల కోట్ల నిధులు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
వచ్చే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు.. దిల్లీ ఎన్నికలు. దేశ ఎన్నికలు, దేశ అభివృధ్ధి, దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు. కుటుంబ పాలనకు, అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఎన్నికలు. కమలం పువ్వుకు గుర్తుకు ఓట్లేసి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుద్దాం. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తున్నాం. వ్యవసాయ రంగం, మహిళల సంక్షేమం, యువశక్తిని దేశ అభివృధ్ధిలో భాగస్వామ్యం చేయడం, పేద ప్రజలను ఆదుకోవడం…. ఇవన్నీ మోదీ గ్యారెంటీ. వచ్చే ఐదు సంవత్సరాలలో ఈ నాలుగు గ్యారెంటీలను అమలు చేయడమే మోదీ గ్యారెంటీ.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ వెళ్లిపోయారు. ఓటమి చెందిన తర్వాత ఒకేసారి కనిపించారు. తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతో పని లేదు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది. బీఆర్ఎస్ నిన్నటి పార్టీ.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మూసీలో వేసినట్టే.. గెలిచినా వచ్చే లాభం లేదు. బీఆర్ఎస్ పార్టీ దిల్లీలో లేదు.. గల్లీలో లేదు. బీఆర్ఎస్ కి ఓటు వేసి ఓటును దుర్వినియోగం చేయకండి.
కాంగ్రెస్ దేశంలో రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయేది తెల్వదు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు కాలేదు. అలవి కాని హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా లేదు. పదేండ్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే…ఈరోజు రాహుల్ గాంధీ ముఠా తెలంగాణ ప్రజలను దోచుకుంటుంది. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజల మీద రాహుల్ గాంధీ ట్యాక్స్ వేస్తున్నారు. కాంగ్రెస్ కు దేశంలో భవిష్యత్తు లేదు.. 40 సీట్లు కూడా రావు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపదు. 370 సీట్లు స్వతహాగా, 400 సీట్లతో ఎన్డీయే కూటమి దేశంలో మూడవసారి అధికారంలోకి రాబోతుంది. తెలంగాణలోని 17కు 17సీట్లు గెలిపించి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భాగస్వామ్యులవుదాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ను పక్కకు పెట్టి కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి 17కు 17సీట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మనవి చేస్తున్నా.’’ అని అన్నారు.
ఇక 5,345 కి.మీ మేర కొనసాగిన ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా బిజెపి నాయకులు 10 లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు. 100 స్వాగత సభలతో పాటు 96 అసెంబ్లీలలో రోడ్ షోలు, బహిరంగ సభలు జరిగాయి. బిజెపి జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రుల పర్యటనలు పార్టీ శ్రేణులను, ప్రజలను ఉత్సాహపరిచింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 12 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగి, లక్షలాది ప్రజలు అపూర్వ మద్దతు తెలిపి, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యే సంకల్పంలో భాగస్వాములవుతూ ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యాత్ర ప్రముఖ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.