సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ లిబరేషన్ డే’
నిజాం, రజాకార్ల పీడ నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలతో కూడిన నాటి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ నిర్వహించాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చ్ 12న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది. ‘‘భారత్ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ‘ఆపరేషన్ పోలో’తో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినం’ నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినం’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇప్పటికే 2022, 2023లో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ వేడుకలకు అధికారికంగా నిర్వహించింది. అప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగరేశారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణలోనూ దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసింది. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను మోదీ ప్రభుత్వం నెరవేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
1948 సెప్టెంబర్ 17న రజాకార్ల నుంచి తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న సందర్భం పురస్కరించకుని ప్రతి ఏటా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం పట్ల కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులందరికీ సరైన గౌరవం దక్కిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం గురించి భవిష్యత్ తరాలకు తెలిసేందుకు ఇది బాటలు వేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.