గాంధీజీ సిద్ధాంతాలకు కాంగ్రెస్ తిలోదకాలు
బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరుస్తూ చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలు, హిందూమతంపై చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ‘ఇండి’ కూటమికి, అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి మధ్య వ్యత్యాసాన్ని అయన గుర్తు చేశారు. మార్చి 19న దిల్లీ లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముంబై ర్యాలీలో రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. గాంధీ తన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం చెందలేదని ఆరోపిస్తూ, ఆయన పార్టీ ప్రతినిధులు వాటిని సమర్థించే ప్రయత్నం చేశారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి వాటి స్థానంలో మావోయిస్టు, వేర్పాటువాద, విభజనవాద వ్యూహాలను స్వీకరించిందని విమర్శించారు. ఇది విభజన మనస్తత్వం, మావోయిస్టు, హిందూ వ్యతిరేక ఆలోచనలతో కూడిన కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ ఈ దుష్ప్రభావాలకు పూర్తిగా లొంగిపోయారని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇతర మతాల విశ్వాసాలకు, వాటి మౌలిక సూత్రాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఇదేవిధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తారా? చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ‘ఎన్నికల హిందువు’ మాత్రమేనని, కానీ తన మనసులో మాత్రం ఎప్పుడూ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తారని ఆరోపించారు. ‘శక్తి’ లక్ష్మిదేవి, సరస్వతి, దుర్గ, కామాక్షి మాతతో సహా దేశంలోని ప్రతి మహిళలోనూ మూర్తీభవించి ఉందని ఉద్ఘాటిస్తూ రాహుల్ గాంధీ తన ర్యాలీలో ఈ భావనను కించపరచడాన్ని, వ్యతిరేకించడాన్ని తీవ్రంగా ఖండించారు. “రాహుల్ గాంధీ, ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, బీహార్ మాజీ విద్యా మంత్రి చంద్రశేఖర్, ఏ. రాజాల మధ్య తేడా లేదు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఇటువంటి అపచారాలకు దేశం ప్రతిస్పందిస్తుంది. జవాబిస్తుంది. రాబోయే ఎన్నికల్లో బిజెపి ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది,” అని ప్రసాద్ పేర్కొన్నారు. దేశ ప్రజల విశ్వాసాలను గౌరవించడం ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగమని ఆయన నొక్కి చెప్పారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ మతాన్ని అగౌరవపరచడం కొందరికి అలవాటుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘శక్తి’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఇచ్చిన వివరణను రవిశంకర్ ప్రసాద్ ఆక్షేపించారు. ‘ఇదే ‘శక్తి’ ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్, మీడియాను నియంత్రిస్తోంద’ని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీకి ఓట్లు రానంత మాత్రాన ప్రజాస్వామ్య వ్యవస్థలపై అవిశ్వాసం వ్యక్తం చేయడం తప్పని విమర్శించారు.
“రాహుల్ గాంధీ దేశ ప్రజల విశ్వాసాలను అవమానించారు. అదేమిటని అడిగితే మీడియాపై ఎవరో పెత్తనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంల) గురించి కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేసింది. కానీ అదే ఎన్నికల సంఘం, అవే ఈవీఎంలతో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది,” అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తన ఓటమికి భయపడుతూ అయినా ఉండవచ్చని లేదా లేదా ఎన్నికల్లో నిజాయితీగా పోరాడే ఉద్దేశం ఆయనకు లేకపోవచ్చని ప్రసాద్ అన్నారు. రాహుల్ గాంధీ చుట్టూ మావోయిస్టులు ఉండి ఉండవచ్చని, ఆయనలా కాకుండా దేశాన్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులను బిజెపి అందించగలదని ప్రసాద్ పేర్కొన్నారు.
రాహుల్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యను రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “గత 10 సంవత్సరాలుగా వరుస ఓటములు చవిచూస్తున్నా రాహుల్ గాంధీ తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని, తన వైఖరిలో ఎటువంటి మార్పులు అవసరం లేదని భావిస్తున్నారు,” అని ప్రశాంత్ కిషోర్ అన్నారని, రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలు, వాటిపై వివరణ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చుతున్నాయని ప్రసాద్ అన్నారు. తన యూరప్ పర్యటనలో రాహుల్ గాంధీ హిందూ సంస్కృతిని అవమానించడాన్ని ప్రసాద్ ప్రస్తావించారు. “హిందూ తీవ్రవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనద”ని ఒక మాజీ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఉదహరించారని బిజెపి ఎంపీ గుర్తు చేశారు.
ముంబయిలో వీర్ సావర్కర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలతో పాటు రాహుల్ గాంధీ శివాజీ పార్క్ కార్యక్రమంలో చేసిన ప్రకటనను చరిత్ర విషయంలో రాహుల్ అజ్ఞానానికి నిదర్శనంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘దర్బారీ’ సంస్కృతిని పెంపొందించిందని అంటూ అదే దాని పతనానికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం ఉందని, కానీ కాంగ్రెస్ చాలా దురదృష్టకర ఆత్మవిధ్వంస పథంలో సాగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, కేంద్ర సంస్థలపై కాంగ్రెస్ నిరంతరం బురద చల్లడాన్ని అయన తప్పుపడుతూ అవినీతిని నిర్విరామంగా ఎదుర్కోవాలనే దృఢసంకల్పంతో ప్రధానమంత్రి ఉన్నారని స్పష్టం చేశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ గురించి రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ ను ‘అబద్ధాలకోరు’గా రవి శంకర్ ప్రసాద్ అభివర్ణించారు.