అంబేద్కర్ ఆశయాలకు ప్రాధాన్యమిస్తున్న బిజెపి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం డా బీఆర్ అంబేద్కర్ కృషిని, వారసత్వాన్ని గౌరవిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టింది. ఆయన చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం, ఆయన బోధనలను ప్రోత్సహించడం, సామాజిక న్యాయం, సమానత్వానికి ఆయన చేసిన కృషిని కొనసాగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం అమలు చేసింది, చేస్తోంది.
పంచతీర్థం అభివృద్ధి
అంబేద్కర్ జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రదేశాలను బిజెపి ప్రభుత్వం ‘పంచతీర్థాలు’ అని పిలుస్తోంది. వాటిని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలుగా అభివృద్ధి చేసింది. అవి:
- జన్మభూమి (మవు, మధ్యప్రదేశ్): అంబేద్కర్ జన్మస్థలం, స్మారక చిహ్నంగా అభివృద్ధి చేశారు.
- శిక్షా భూమి (లండన్): ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన ప్రదేశం.
- దీక్షా భూమి (నాగపూర్): ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం.
- మహాపరినిర్వాణ భూమి (దిల్లీ): ఆయన దహన సంస్కారాలు జరిగిన ప్రదేశం.
- చైతన్య భూమి (ముంబై): ఆయన అంతిమ సమాధి. పవిత్ర స్మారక చిహ్నంగా తీర్చిదిద్దారు.
అంబేద్కర్ పేరిట భీమ్ యాప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమ్ యాప్‌ను అంబేద్కర్ పేరుతో ప్రారంభించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారంగా బ్యాంకుల ద్వారా నేరుగా ఈ-చెల్లింపులను సులభతరం చేయడానికి, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు, సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు సాధికారత కల్పించడానికి నగదు రహిత లావాదేవీలను ఈ యాప్ ప్రోత్సహిస్తుంది.
పోస్టల్ స్టాంప్
సెప్టెంబర్ 30, 2015న టెలికమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి సామాజిక న్యాయం, సాధికారత మంత్రి సమక్షంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.
గణతంత్ర దినోత్సవ శకటం
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2016 జనవరి 26న రాజ్‌పథ్ లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై ఒక శకటాన్ని ప్రదర్శించింది.
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
భారత న్యాయ వ్యవస్థను రూపొందించడంలో ఆయన పాత్రను ప్రజలకు గుర్తు చేయడానికి, ఆయన సేవలను గౌరవించడానికి మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
1990 ఏప్రిల్ 12న దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి కృషితో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జెబా అమ్రోహావి వేసిన చిత్రాన్ని అప్పటి ప్రధాన మంత్రి వీపీ సింగ్ ఆవిష్కరించారు. అప్పుడు వీపీ సింగ్ ప్రభుత్వం బిజెపి మద్దతుతో అధికారంలో ఉంది.
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
పదేళ్ల క్రితం వరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబర్ 26వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమితంగా ఆరాధించే వ్యక్తులు, సంస్థలు మాత్రమే సంబరాలు జరుపుకునేవి. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం, భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా గుర్తిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు 2010లో, భారత రాజ్యాంగం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన, ప్రతీకాత్మకమైన ‘రాజ్యాంగ ఆత్మగౌరవ యాత్ర’ నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా భారత రాజ్యాంగ ప్రతిని ఒక ఏనుగు తలపై ఉంచి నగరం అంతటా ఊరేగుతూ భారత రాజ్యానికి పునాది అయినా పత్రం పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు. 2015కు ముందు నవంబర్ 26ను న్యాయ, విద్యా రంగాల్లో న్యాయ దినోత్సవంగా జరుపుకునేవారు. ఈ చారిత్రాత్మక పత్రం రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ శాశ్వత వారసత్వాన్ని గౌరవిస్తూ, ఈ రోజున ఇప్పుడు యావత్ దేశం సగర్వంగా రాజ్యాంగ సంబరాలు జరుపుకుంటోంది.
రాజ్యాంగ ఆమోద వార్షికోత్సవాలు
25వ వార్షికోత్సవం: ఎమర్జెన్సీ రాజ్యాంగ హక్కులను రద్దు చేసి, పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రజాస్వామ్యం గొంతు నులిమిన చీకటి కాలం- కాంగ్రెస్ చరిత్రలో ఇది చెరిగిపోని మచ్చ.
50వ వార్షికోత్సవం: 2000 నవంబర్ 26న ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఐక్యత, ప్రజల భాగస్వామ్యం సందేశంతో రాజ్యాంగం నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుకొన్నారు.
60వ వార్షికోత్సవం: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అపూర్వమైన ఉత్సాహంతో జరుపుకొన్నారు. ‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’ అనే ఊరేగింపు ద్వారా రాజ్యాంగాన్ని గౌరవించారు. ఇది రాజ్యాంగం పట్ల భక్తి, రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి ప్రజల అవగాహనను సూచిస్తుంది.
75వ వార్షికోత్సవం: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఏడాది పొడవునా చారిత్రాత్మక వేడుకలు జరుగుతున్నాయి. ‘హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్’ అనే ఉద్యమ నినాదంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, రాజ్యాంగ నిర్మాతల సేవలను గౌరవించడమే లక్ష్యంగా, అందులో పొందుపరిచిన ప్రధాన విలువలను పునరుద్ఘాటిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ముంబైలో ‘సమానత్వ విగ్రహం’
అంబేద్కర్ వారసత్వాన్ని, బోధనలను గౌరవిస్తూ ముంబైలో ‘సమానత్వ విగ్రహం’ (‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’) పేరుతో ఆయన భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. 2024 డిసెంబర్ నాటికి 47 శాతం ఈ విగ్రహ నిర్మాణం పూర్తయింది.
డాక్టర్ అంబేద్కర్ లండన్ ఇంటి పరిరక్షణ
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టర్ అంబేద్కర్ ఉన్న సమయంలో నివసించిన ఇంటిని బిజెపి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చేందుకు స్మారక, సాంస్కృతిక కేంద్రంగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు.
డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, దిల్లీ
చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని మొదట ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎలాంటి పురోగతి లేదు. 40 ఏళ్ల పాటు ఈ ఆలోచన కాగితాలకే పరిమితమై పురోగతి కనిపించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో దీనిని పునరుద్ధరించారు. ఏప్రిల్ 20, 2015న డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ దిల్లీలోని జన్‌పథ్ 15 వద్ద డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను 2017 డిసెంబర్ 7న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు, ఈ కేంద్రాన్ని సామాజిక-ఆర్థిక పరివర్తన రంగంలో అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, విధాన రూపకల్పన కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రకటించారు. ముమ్మరమైన, సాధికారికమైన పరిశోధనలు నిర్వహించడం ద్వారా సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను తగ్గించడంపై ఈ కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తుంది.
అంబేద్కర్ రచనల డిజిటలైజేషన్, ప్రచురణ
అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు మరింతమంది పాఠకులకు అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం వాటిని డిజిటలైజ్ చేసి ప్రచురించడం ప్రారంభించింది.
రాజ్యాంగం పట్ల గౌరవం: రాజ్యాంగ సవరణలు
1947 నుంచి 1952 వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ విజయం సాధించని, ప్రజలు ఎన్నుకోని కాంగ్రెస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేసింది. ఈ కాలంతో సహా కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న సమయంలో 75 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం ఎనిమిది సార్లు మాత్రమే రాజ్యాంగాన్ని సవరించారు. ఈ సవరణలన్నీ ప్రతిపక్షాల మద్దతుతో ఆమోదం పొందడం గమనార్హం. పాలనలో బిజెపి ప్రభుత్వం ఏకాభిప్రాయంతో కూడిన విధానాన్ని అనుసరించడాన్ని ఇది సూచిస్తుంది. ప్రతి సవరణను సామాజికంగా బలహీనమైన వర్గాల సాధికారత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, న్యాయ వితరణను మెరుగు పరిచే లక్ష్యంతో జాగ్రత్తగా రూపొందించారు. ఈ సవరణల వివరాలు:
- 2017లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రవేశపెట్టారు.
- 2017లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ)కి రాజ్యాంగ హోదా కల్పించారు.
- 2019లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.
- 2019లో ఆర్థిక సంఘం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలుకు సంబంధించిన నిబంధనల సవరణ.
- లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్ళు పొడిగిస్తూ 2019లో సవరణ చేశారు.
- 2021లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత ఓబీసీ జాబితాలను మార్చుకునే అధికారం కల్పించారు.
- 2023లో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్లను ప్రవేశ పెట్టారు.
2014 తర్వాత సామాజిక న్యాయ పరిధి విస్తరణ
- నీట్ అఖిల భారత మెడికల్ కోటాలో ఓబీసీ రిజర్వేషన్లు: నీట్ అఖిల భారత మెడికల్ కోటాలో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేసింది. దీనిద్వారా వైద్య విద్యలో ఓబీసీ విద్యార్థులకు మెరుగైన ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించింది.
- జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ)కి రాజ్యాంగ హోదా: ఎన్సీబీసీకి రాజ్యాంగ సంస్థ హోదా కల్పించడం వల్ల వెనుకబడిన తరగతుల సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించే అధికారం దానికి లభించింది.
- నవోదయ విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు: నవోదయ విద్యాలయాల్లో ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం వల్ల వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది.
- కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ మంత్రులకు చోటు: విభిన్నవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం, వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా అమలు: విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు విద్యా ఉద్యోగ అవకాశాలకు ఆటంకం కలిగించవు. ఇది సమానత్వం, సామాజిక న్యాయమనే భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
- తొలిసారిగా సుప్రీంకోర్టులో ముగ్గురు దళిత న్యాయమూర్తుల నియామకం: ఈ చారిత్రాత్మక నియామకం అత్యున్నత న్యాయవ్యవస్థలో అణగారిన వర్గాలకు ప్రాతినిథ్యానికి, సమ్మిళితత్వానికి దోహదం చేస్తుంది.
- ఓబీసీలకు సెంట్రల్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఆర్జీఎన్ఎఫ్): ఓబీసీ అభ్యర్థులకు రీసెర్చ్ ఫెలోషిప్‌లు ఇవ్వడం వల్ల వెనుకబడిన తరగతుల్లో ఉన్నత విద్య, పరిశోధనలను ప్రోత్సాహం లభిస్తుంది.
- నామినేటెడ్ కేటగిరీ కింద రాజ్యసభకు దళిత సభ్యుడు: సంగీతానికి చేసిన అపారమైన కృషిని గుర్తించి, కళారంగంలో అణగారిన వర్గాల విజయాలకు ప్రతినిధిగా తొలిసారిగా దళిత కళాకారుడు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేశారు.
రాజ్యాంగ అధికరణం 370 రద్దు
2019లో అధికరణం 370 రద్దు జమ్మూ కాశ్మీర్‌ను భారత రిపబ్లిక్‌లో పూర్తిగా రాజ్యాంగపరమైన విలీనం చేసే దిశలో ఒక మైలురాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముందు, భారత రాజ్యాంగంలోని అనేక నిబంధనలు జమ్మూ కాశ్మీర్‌కు వర్తించలేదు. ఫలితంగా గణనీయమైన అసమానతలు, అన్యాయాలు చోటుచేసుకున్నాయి. అధికరణం 370 ప్రకారం దేశ విభజన కాలం నుంచి వేల మంది హిందూ, సిక్కు శరణార్థులకు జమ్మూ కాశ్మీర్‌లో ఓటు హక్కు, నివాస హోదాను నిరాకరించారు. రాష్ట్రంలో మైనారిటీ హక్కులు, రిజర్వేషన్లు వంటి సామాజిక న్యాయ విధానాలు అమలు చేయలేదు. అర్హతలతో సంబంధం లేకుండా శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను నిరాకరించి స్వీపర్లు వంటి ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం చేయడంతో దళితులు వెనుకబాటుకు గురయ్యారు. 2019 నుంచి రాష్ట్రంలో చోటుచేసుకున్న పరివర్తనాత్మక మార్పులు జమ్మూ కాశ్మీర్లో మహిళలకు సమాన ఆస్తి హక్కులను, గిరిజన వర్గాలకు రిజర్వేషన్, సామాజిక సంక్షేమ నిబంధనల ప్రయోజనాలను కల్పించాయి. ఈ విలీనం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలంగా నిరాకరించబడిన సమానత్వాన్ని, న్యాయాన్ని తీసుకువచ్చింది.
కేంద్ర విద్యాసంస్థల (ఉపాధ్యాయుల కేడర్‌లో రిజర్వేషన్) బిల్లు 2019
యూనివర్సిటీలు, కాలేజీల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు నిష్పక్షపాతంగా అమలయ్యేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని ఆర్డినెన్స్ పునరుద్ధరించింది. ఈ బిల్లు ఆమోదం ఒక చారిత్రాత్మక ముందడుగు. విశ్వవిద్యాలయ వ్యవస్థలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత నిర్లక్ష్యానికి, వక్రీకరణలకు ఇది ముగింపు పలికింది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వామపక్ష ప్రాబల్యం ఉన్న విద్యాసంస్థల్లో సాంకేతికమైన అంశాలను సాకుగా చేసుకుని రిజర్వేషన్లను నిర్వీర్యం చేశారు. 1995 సబర్వాల్ తీర్పు స్ఫూర్తిని ఉల్లంఘించి, ఖాళీగా ఉన్న వేల రిజర్వుడ్ సీట్లను రాత్రికి రాత్రే అన్‌రిజర్వుడ్ సీట్లుగా మార్చిన ఒక కీలకమైన సంఘటన 1997లో జరిగింది. ఖాళీల ఆధారిత రిజర్వేషన్ల నుంచి పోస్ట్ ఆధారిత రిజర్వేషన్లకు మారాలని తీర్పులో పేర్కొన్నప్పటికీ, అన్ని రిజర్వుడ్ సీట్లు భర్తీ అయ్యే వరకు మునుపటి ప్రక్రియను కొనసాగించాలని షరతు విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించడంతో అణగారిన వర్గాల అభ్యర్థులు పెద్దసంఖ్యలో అవకాశాలు కోల్పోయారు. 2019లో మోదీ ప్రభుత్వం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ మోసకారి పద్ధతికి తెరదించింది. 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను పునరుద్ధరించేలా చేసింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) నుంచి వేలమంది అధ్యాపకులను నియమించారు.
పౌరసత్వ (సవరణ) చట్టం 2019
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మతపరమైన హింస నుంచి పారిపోయిన ముస్లిమేతర వ్యక్తులు — హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు — భారత పౌరసత్వం ఇవ్వడానికి 2019 పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ)ను మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టం కింద పౌరసత్వం పొందిన వారిలో అత్యధికులు దళితులు, గిరిజన వర్గాలే కావడం గమనార్హం. గతంలో బెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ దళిత నాయకుడు జోగేంద్రనాథ్ మండల్ ‘భీమ్-మిమ్’ రాజకీయ సమీకరణ కింద పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాడు, ఇందుకు దళిత-ముస్లిం ఐక్యతను కారణంగా చూపాడు. తత్ఫలితంగా పెద్ద సంఖ్యలో దళితులు, ముఖ్యంగా నమోశూద్రులు, మతువా దళితులు తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్)లో ఉండిపోయారు.
మండల్ పాకిస్తాన్ మొదటి న్యాయ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. అయినప్పటికీ, పాకిస్తాన్‌లో హిందువులు, సిక్కులపై అఘాయిత్యాలు పెరిగాయి. తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన దళితులు తీవ్రమైన హింసను ఎదుర్కొన్నారు. చివరికి మండల్ భారతదేశానికి పారిపోయి వచ్చాడు, ఇది తూర్పు పాకిస్తాన్ నుంచి హిందువులు, ముఖ్యంగా నమోశూద్ర, మతువా దళితుల సామూహిక వలసలకు నాంది పలికింది. దాదాపు 70 ఏళ్లు దేశాన్ని పాలించినప్పటికీ, ఈ అణచివేతకు గురైన వలసదారులకు పౌరసత్వం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పుకోదగిన చర్యలు తీసుకోలేదు.
ఎస్టీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 (2016లో సవరణ)
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989ను మొదట కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. అయితే దళితులు, గిరిజనులపై జరిగే అనేక తీవ్రమైన నేరాలకు శిక్షలు విధించే నిబంధనలు అందులో లేవు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దళితుల అభ్యున్నతికి, దౌర్జన్యాల నుంచి వారికి విముక్తి కల్పించేందుకు గణనీయమైన చర్యలు తీసుకున్నారు. 2015లో ప్రభుత్వం ఈ చట్టానికి గణనీయమైన సవరణలు చేసింది. మునుపటి చట్టం విస్మరించిన అనేక నిబంధనలను చేరుస్తూ చేసిన ఈ సవరణ జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చింది.
ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) నిబంధనలు 1995 (సవరణ 2016)
దళితులను, గిరిజనులను అత్యాచారాల నుంచి కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గణనీయమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు బాధితులకు ఆర్థిక సాయం అందించే నిబంధనలు కూడా చేర్చింది. జూన్ 14, 2016 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సవరణలు బాధితులకు మద్దతు ఇచ్చే యంత్రాంగాలను గణనీయంగా పెంచాయి. చట్టపరమైన నిబంధనలను బలోపేతం చేశాయి. ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సాయంతో పోలిస్తే 4-5 రెట్లు పెంచారు. హత్య, మూకుమ్మడి హత్యలు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, శాశ్వత అంగవైకల్యం కేసుల్లో బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించేందుకు పింఛను ప్రయోజనాలు కల్పించారు.
భారతీయ న్యాయ సంహిత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వలస కాలం నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారత న్యాయ స్మృతిని తీసుకురావడం ద్వారా భారతదేశ న్యాయ శాసనాల్లో ఒక చరిత్రాత్మక సంస్కరణను చేపట్టింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)లతో కలిసి భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)ను గత ఏడాది చట్టాలుగా తెచ్చారు. 160 సంవత్సరాల నాటి వలసవాద చట్టాలను రద్దు చేయడం ద్వారా భారతీయ న్యాయ వ్యవస్థను వలసవాద బంధనాల నుంచి విముక్తి చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. వలస న్యాయ వ్యవస్థ వ్యవస్థాగతమైన అణచివేతను కొనసాగించింది. ముఖ్యంగా దళిత, గిరిజన, ఓబీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకున్న నేరస్థ గిరిజన తెగల చట్టం, 1871 (క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్) వంటి క్రూరమైన చట్టాల ద్వారా ఈ అణచివేత సంస్థాగతమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ వర్గాలు వివక్షను, దోపిడీని ఎదుర్కొంటూనే ఉన్నాయి. కొత్త చట్టాలు భారతదేశ శాసన చట్రంలో నిష్పాక్షికత, సమానత్వం, సమ్మిళితత్వాన్ని పొందుపరచడం ద్వారా ఈ చారిత్రక అన్యాయాలకు ముగింపు పలుకుతాయి.
భారతీయ న్యాయ సంహిత అత్యంత ప్రశంసనీయమైన లక్షణాలలో ఒకటి కేవలం శిక్ష వేయడం కంటే బాధితులకు న్యాయం అందించడానికి ప్రాధాన్యం ఇవ్వడం. మహిళలు, పిల్లల రక్షణ కోసం బీఎన్ఎస్ కీలక సంస్కరణలను పెట్టడం ద్వారా ఈ ఈ బలహీన వర్గాల రక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. భారతీయ న్యాయ సంహిత, దాని అనుబంధ చట్టాలు భారతదేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఆధునీకీకరించడానికి అనుసరించిన సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన విధానాన్ని సూచిస్తాయి. రాజ్యాంగ విలువలను నిలబెట్టడం ద్వారా ఈ సంస్కరణలు నవ భారత ఆకాంక్షలను నెరవేర్చే న్యాయమైన, సమ్మిళితమైన, ముందుచూపుతో కూడిన శాసన చట్రానికి మార్గం సుగమం చేస్తాయి.