Atal Bihari Vajpayee

భారత ఆర్థిక వృద్ధిని పునరుజ్జీవింపజేసిన వాజ్‌పేయి

రాజకీయ పార్టీని స్థాపించి దశాబ్దాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన వ్యక్తి ఎన్నటికీ సాధారణ వ్యక్తి కాబోడు. ఎందుకంటే దీనికి అత్యున్నత స్థాయి నిబద్ధత అవసరం. నిజానికి ఇదంతా బిజెపి ఈ రోజు దేశాన్ని పాలించడానికి కారకుడైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి. మొదటిసారి 1996లో 13 రోజులు, రెండోసారి 1998 నుంచి 1999 వరకు 13 నెలలు, మూడోసారి 1999 నుంచి 2004 వరకు ఆయన మొత్తం మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నా భారత్ మాజీ ప్రధాని చేపట్టిన కార్యక్రమాల ప్రాముఖ్యాన్ని కూడా గ్రహించడం చాలా ముఖ్యం.

అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది పోఖ్రాన్ (1998), కార్గిల్ యుద్ధం (1999). కానీ, ప్రధాని వాజ్‌పేయి తన హయాంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అంతకుముందు దశాబ్దాల క్రితమే అమలు చేసి ఉంటే దేశం పూర్తిగా మారిపోయి ఉండేది. దురదృష్టవశాత్తు ఇది చాలా ఆలస్యంగా జరిగింది. నెహ్రూ-గాంధీ కుటుంబం అన్నింటిని నియంత్రించాలనుకోవడమే దీనికి ప్రధాన కారణం. దానివల్ల అంతా కేంద్రీకృతమైంది. ఇక విషయానికి వస్తే లక్షల ఉద్యోగాలను సృష్టించే ఏ దేశ జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి)లోనైనా మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. వాజ్‌పేయి హయాంలో 1999 నుంచి 2004 వరకు రోడ్లు, హైవే నిర్మాణాలు, పాఠశాల విద్యను మెరుగుపరచడం నుంచి టెలికాం విప్లవం తీసుకురావడం వరకు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ “అమెరికా సంపన్న దేశం కావడం వల్ల అమెరికా రోడ్లు బాగుండటం కాదు, అమెరికా రోడ్లు బాగున్నాయి కాబట్టి అమెరికా సంపన్న దేశమైంది” అన్న ప్రసిద్ధ వ్యాఖ్య ఒక దేశ అభివృద్ధిలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి తన పదవీకాలంలో సరిగ్గా ఇదే చేశారు. చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబై మహా నగరాలను, దేశంలోని పలు ప్రధాన పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక కేంద్రాలను హైవే వ్యవస్థ ద్వారా అనుసంధానించడానికి స్వర్ణ చతుర్భుజిని అమలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలను రహదారుల వ్యవస్థతో అనుసంధానించడానికి ఆయన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను అమలు చేశారు. దీనిఫలితంగా గత రెండు దశాబ్దాలలో, దేశంలో మొత్తం రహదారుల వ్యవస్థ 64 లక్షల కిలోమీటర్లకు చేరుకుంది. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారులు, గ్రామీణ, పట్టణ రహదారులు ఉన్నాయి. మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌లో జాతీయ రహదారుల వాటా 2 శాతం. ముఖ్యంగా, రోడ్డు, రైలు అనుసంధానిత ఏ దేశమైనా సుభిక్షంగా ఉండటానికి విశేషంగా దోహదం చేస్తుంది. ఇది వస్తువులను తరలించడంలో సమయాన్ని ఆదా చేస్తుంది.

చైనాను మనం ఉదాహరణగా తీసుకున్నా ఆర్థిక సంస్కరణల ప్రారంభ దినాల్లో అది ప్రధానంగా రోడ్డు, రైలు అనుసంధానతపై దృష్టి సారించింది. 90వ దశకం మధ్యలో చైనా ప్రపంచ బ్యాంకు సహాయంతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలతో ముడిపడి ఉన్న ‘పేదరిక నిర్మూలన కోసం రోడ్ల అభివృద్ధి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనే సంక్షేమానికి కీలకమని గ్రహించి రోడ్డు, రైలు అనుసంధానతపై మరింతగా దృష్టి సారించింది. నేటికీ చైనా ‘బెల్ట్ అండ్ రోడ్’ కార్యక్రమం ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది. దీని సహాయంతో ప్రపంచ మార్కెట్‌ను నియంత్రించాలనుకుంటోంది. 1999లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మౌలిక సదుపాయాల కల్పనలో కొన్ని భారీ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత భారత జీడీపీ వేగంగా వృద్ధి చెందిందని గణాంకాలు చెబుతున్నాయి. 90వ దశకం ప్రారంభంలో నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం ప్రారంభమైంది.

1994లో భారతదేశ మొత్తం జీడీపీ 333 బిలియన్ డాలర్లు. కానీ ఇది 2002 లో పెరగడం ప్రారంభించింది; అప్పుడు భారతదేశ మొత్తం జీడీపీ 523.77 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత రెండేళ్లలో అది 721 బిలియన్ డాలర్లకు చేరింది. అప్పటి నుంచి భారత జీడీపీ వృద్ధి అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ముఖ్యంగా 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ మొత్తం జీడీపీ 428 బిలియన్ డాలర్లు. అందువల్ల, మాజీ ప్రధాని వాజ్‌పేయి పదవీకాలం తరువాత, భారత ఆర్థిక వ్యవస్థకు ఒక లక్ష్యం, దిశ దొరికాయి. వాజ్‌పేయి కేవలం ఆర్థికాభివృద్ధిని సాధించడమే కాకుండా పలు దేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరిచారు. పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత అమెరికాతో భారత్ సంబంధాలు దెబ్బతిని అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించినా అదే కాలంలో వాజ్‌పేయి అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచారు.

రవి మిశ్రా