సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న భూసార ఆరోగ్య కార్డులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌ఘఢ్‌లో భూసార ఆరోగ్య (సాయిల్ హెల్త్) కార్డు పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడటం ఈ పథకం ఉద్దేశం. సాయిల్ హెల్త్ కార్డు రైతులకు వారి నేల పోషక స్థితిపై సమాచారాన్ని అందిస్తుంది, నేల ఆరోగ్యం, దాని సారాన్ని మెరుగుపరచడానికి తగిన మోతాదుల్లో ఉపయోగించాల్సిన పోషకాలపై సిఫార్సులు చేస్తుంది.
సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ (www.soilhealth.dac.gov.in) అన్ని ప్రధాన భాషలు, ఐదు మాండలికాలలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన, ప్రామాణిక నమూనాలో రైతుల ప్రయోజనం కోసం సాయిల్ హెల్త్ కార్డులను తయారు చేయడానికి వీలు కల్పిస్తుంది. సాయిల్ హెల్త్ కార్డులో 12 ప్రమాణాలకు సంబంధించి నేల పరిస్థితి ఎలా ఉందో వివరాలు ఉంటాయి. ఈ 12 ప్రమాణాల్లో ఇవి ఉంటాయి: ఎన్, పీ, కే, ఎస్ (స్థూల పోషకాలు); జడ్ఎన్, ఎఫ్ఈ, సీయూ, ఎమ్ఎన్, బీఓ (సూక్ష్మపోషకాలు); పీహెచ్ (ఆమ్లత లేదా బేసిసిటీ), ఈసీ (విద్యుత్ వాహకత), ఓసీ (ఆర్గానిక్ కార్బన్). ఈ భూసార పరిస్థితి ఆధారంగా పొలానికి అవసరమైన ఎరువుల సిఫార్సులు, మట్టిలో మార్పులను కూడా కార్డు సూచిస్తుంది. రబీ, ఖరీఫ్ పంట కోత తర్వాత లేదా పొలంలో పంట లేనప్పుడు మట్టి నమూనాలను సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు తీసుకుంటారు. గ్రామ స్థాయి భూసార పరీక్షల ల్యాబ్ (వీఎల్ఎస్టీఎల్ఎస్)లకు 2023 జూన్‌లో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. వీఎల్ఎస్టీఎల్‌లను వ్యక్తిగత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంటే స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్ జీలు), పాఠశాలలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మొదలైన వాటితో సహా గ్రామీణ యువత మొదలైన వారు ఏర్పాటు చేయవచ్చు.
లబ్ధిదారుడు/గ్రామ స్థాయి పారిశ్రామికుడు వయస్సు 18 సంవత్సరాలకు పైబడి, 27 సంవత్సరాలకు లోపు ఉండాలి. స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్పీఓ)లు కూడా వీఎల్ఎస్టీఎల్‌గా నమోదు చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి నాటికి 17 రాష్ట్రాల్లో 665 గ్రామస్థాయి భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పాఠశాల భూసార పరీక్షా కార్యక్రమం
గ్రామీణ ప్రాంతాల్లోని 20 పాఠశాలల్లో (10 కేంద్రీయ విద్యాలయాలు, 10 నవోదయ విద్యాలయాలు) పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఎస్ఈ అండ్ ఎల్), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ పాఠశాల భూసార ఆరోగ్య కార్యక్రమం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. సుస్థిర వ్యవసాయ పద్ధతుల కోసం విద్యార్థులకు భూసారంపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ఈ పాఠశాలల్లో 20 సాయిల్ హెల్త్ ల్యాబ్ లను ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం కింద, పాఠశాల విద్యార్థుల ద్వారా మట్టి నమూనాలను సేకరించారు. విద్యార్థులచే భూసార పరీక్షలు కూడా చేయించారు. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. ఎరువులను విచక్షణతో ఉపయోగించడం, సాయిల్ హెల్త్ కార్డులో చేసిన పంట సిఫార్సుల గురించి రైతులకు విద్యార్థులు అవగాహన కల్పించారు.
2024 నాటికి 1,020 పాఠశాలలు పాఠశాల భూసార ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి, 1,000 భూసార పరీక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేయగా వాటిలో 1,25,972 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. 2022-23 సంవత్సరం నుంచి సాయిల్ హెల్త్ కార్డు పథకాన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకంలో విలీనం చేసి ‘భూమి ఆరోగ్యం, భూసారం’ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు.
సాంకేతిక పురోగతి: మొబైల్ యాప్
సాయిల్ హెల్త్ కార్డును పొందే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, భారత ప్రభుత్వం 2023లో సాయిల్ హెల్త్ కార్డ్ పథకంలో కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది. సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్‌ను పునరుద్ధరించి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) వ్యవస్థతో అనుసంధానం చేశారు. తద్వారా అన్ని పరీక్షా ఫలితాలను మ్యాప్‌లో చూడవచ్చు. పథకం అమలు/పర్యవేక్షణ సజావుగా సాగడానికి, రైతులు తమ సాయిల్ హెల్త్ కార్డును సులభంగా పొందడానికి వీలుగా, మొబైల్ అప్లికేషన్‌ను అదనపు ఫీచర్లతో పటిష్టంగా రూపొందించారు. ఇప్పుడు మట్టి నమూనాలను సేకరించిన ప్రాంతం, వాటి ఫలితాలు అన్నీ జియో మ్యాపింగ్ కారణంగా కచ్చితంగా పోర్టల్‌లో కనిపిస్తాయి. మనుషులు ప్రత్యేకంగా వాటి వివరాలను అందించవలసిన అవసరం ఉండదు.
ఈ అప్లికేషన్ భారతదేశం అంతటా హద్దుల సమాచారాన్ని అందిస్తుంది. రాష్ట్ర సరిహద్దు, జిల్లా సరిహద్దు, తాలూకా సరిహద్దు, పంచాయతీ సరిహద్దు, చట్టపరమైన సరిహద్దును కూడా చూపిస్తుంది. 2023 ఏప్రిల్లో ఈ కొత్త విధానం అమల్లోకి రాగా, ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ ద్వారా నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరించిన పోర్టల్‌లో సాయిల్ హెల్త్ కార్డులు తయారవుతాయి. సాయిల్ హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ కోసం హెల్త్ కార్డ్ పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించింది. సాయిల్ హెల్త్ కార్డు పథకం గత దశాబ్దంలో భారతదేశంలో వ్యవసాయ పద్ధతులను గణనీయంగా మార్చివేసింది. 2015 నుంచి ఇది నేలలో పోషకాల స్థితి, సరైన ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మెరుగైన పంట ఉత్పాదకతపై రైతులకు కీలక సమాచారాన్ని అందిస్తోంది. పాఠశాల సాయిల్ హెల్త్ కార్యక్రమం వంటి కార్యక్రమాలు విద్యార్థులు, స్థానిక సమాజాలలో నేల ఆరోగ్యం గురించి అవగాహనను పెంచాయి. పటిష్టమైన మొబైల్ యాప్‌తో సాయిల్ హెల్త్ కార్డు పొందే ప్రక్రియ సులభతరం అయింది. ఈ ప్రక్రియ సామర్థ్యం, పారదర్శకత కూడా పెరిగాయి. ఈ పథకం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇది సుస్థిర వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడంలో, భవిష్యత్ తరాల కోసం భారతదేశ భూసార ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.

