బిజెపి అభ్యర్థులకు వెల్లువలా మద్దతు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజెపి దూసుకుపోతుంది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి సి. అంజిరెడ్డి, కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థి మల్క కొమరయ్య, వరంగల్-నల్గొండ-ఖమ్మం అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి మద్దతుగా బిజెపి నాయకులు ఓటర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సహా బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ, పట్టభద్రుల ఆకాంక్షలు నెరవేరాలంటే బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సభలు, సమావేశాలు, సదస్సులు, సమ్మేళనాల్లో ప్రసంగిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా ప్రజల కోసం బిజెపి చేసిన, చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలను వారికి గుర్తు చేశారు. బిజెపి అభ్యర్థులు గెలిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుకలవుతారని వివరించారు. బిజెపి నాయకుల ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. రోజురోజుకు బిజెపి అభ్యర్థులకు మద్దతు పెరుగుతోంది. ఫిబ్రవరి 27న జరగనున్న పోలింగ్ లో బిజెపి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామంటూ ఓటర్లు స్పష్టం చేశారు.
కుటుంబ పార్టీల పాలనలో ఆర్థిక సంక్షోభం: కిషన్ రెడ్డి
ప్రచారంలో భాగంగా పలు చోట్ల కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ‘‘ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రాధాన్యత ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలబడాలి. తెలంగాణ అభివృద్ధి విషయంలో నేరుగా పోటీ చేసే ధైర్యం లేదు, ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి లేదు కానీ.. సోనియాగాంధీ సంతకంతో ఇంటింటి ప్రచారం చేసి, ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసారు. ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదు. సకల జనులు కలిసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు, గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేశాయి. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని రెండు పార్టీలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి దివాలా తీయించారు. ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని గత రెండు ప్రభుత్వాలు రూ.9 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు. ఒకటవ తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి, కనీసం విద్యుత్ దీపాలు వేయించలేని దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది.
గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం జరగడం లేదు. రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నా స్వార్థంతో కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీయించారు. పనుల్లో కమిషన్, కంపెనీలో కమిషన్, అది ఇవ్వలేని పక్షంలో బెదిరింపులకు పాల్పడుతూ పాలన కొనసాగించారు. ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీలు అమలు చేయలేదు. 317 జీవో కారణంగా టీచర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హామీలు అమలు చేయలేక, ప్రజల ముందు మొహం చెల్లక, దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేరుగా బిజెపిని ఎదుర్కోలేక వెనుక నుంచి కుట్రలు పన్నుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి అధికారంలోకి రాబోతుంది. తెలంగాణలో కూడా వచ్చే శాసనసభ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతుంది, నీతి నిజాయితో పనిచేస్తుంది. ఉగ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో అణచివేసిన మోదీ ప్రభుత్వం దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలబడింది. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా నిలబడింది. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం ఆడబిడ్డలకు మోదీ ధైర్యాన్ని నింపారు. ఈ భూ ప్రపంచంలో ఒకే చోట 60 కోట్ల మందితో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన ఒకే ఒక్క ప్రభుత్వం మోదీ ప్రభుత్వం, బిజెపి ప్రభుత్వం. మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’ అని అన్నారు.
అరెస్టెందుకు చేయరు?: బండి సంజయ్
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… ‘‘కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదు. కాలేజీ యాజమాన్యాలు తమ కాలేజీలు మూసుకునే దుస్థితి ఏర్పడింది. దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైన పరిస్థితి కాంగ్రెస్ కే దక్కింది. పోటీ చేసే వాళ్లు లేకపోవడంతో బయట నుండి తెచ్చిన వ్యక్తిని గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా నిలబెట్టారు. మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థులే దొరకలేదు. బీఆర్ఎస్ ఏకంగా పోటీ నుండి తప్పుకునే కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ స్కాంల్లో అరెస్ట్ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా కాళేశ్వరం, ఫాంహౌజ్ డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు కేసుల్లో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్లను అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారు. కేసీఆర్ సైతం దిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో డీల్ మాట్లాడుకుని రావడంతోనే ఆ కేసులన్నీ నీరుగారిపోతున్నాయి. రేవంత్ రెడ్డిని ఆనాడు కేసీఆర్ జైలుకు పంపారు. బిడ్డ పెండ్లిరోజు అరెస్ట్ చేసి లోపలేశారు. మరి కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున స్కాములు చేసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. రేవంత్ రెడ్డికి చీము, నెత్తురు, పౌరుషం చచ్చిపోయిందా? తెలంగాణలో బలపడుతున్న బిజెపిని అణిచివేయడానికి బీఆర్ఎస్ తో చేతులు కలపడం సిగ్గు చేటు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలను నట్టేట ముంచారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నరు. నెలానెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నరు. 14 నెలలుగా రూ.56 వేల బాకీ పడ్డారు. రుణమాఫీ సగం మందికి ఇవ్వనేలేదు. రైతు భరోసా అతీగతీ లేదు.
ప్రజల కోసం కొట్లాడింది బిజెపి. టీచర్ల కోసం లాఠీదెబ్బలు తిన్నది బిజెపి. నిరుద్యోగుల కోసం రక్తం చిందించి కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంది బిజెపి. నేను ప్రజల పక్షాన కొట్లాడుతుంటే నాపై హిందీ పేపర్ లీకేజీ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వడ్ల కొనుగోలు విషయంలో రైతుల బాధలను తెలుసుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వెళితే… బీఆర్ఎస్ గూండాలు రాళ్ల దాడి చేసి భయపెట్టాలని చూశారు. తుంగతుర్తి సమీపంలో మేం ఉన్న ఫంక్షన్ హాలు వద్ద పెట్రోలు, కిరోసిన్ పోసి సజీవ దహనం చేయాలని చూశారు. అయినా భయపడకుండా తెగించి కొట్లాడినం… ప్రజల కోసం పోరాడిన బిజెపిని కాదని, ఏనాడూ ఒక్క ఉద్యమం కూడా చేయని కాంగ్రెస్ కు ఓటేయడం వల్ల ఏం ఒరిగిందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ మోసాలతో అల్లాడుతున్న ప్రజల బాధలను, బిజెపి కార్యకర్తల పోరాటాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆసరా పెన్షన్ల పెంపు లేదు. రైతు భరోసా లేదు. రుణమాఫీ అరకొరే చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ లేదు. టీచర్ల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నయ్. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. చాక్ పీసులు కొనడానికి కూడా డబ్బుల్లేవ్. ఆఖరికి ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తోంది. గతేడాది 8 వేల మంది రిటైర్డ్ అయ్యారు. ఈ ఏడాది మరో 10 వేల మంది రిటైర్డ్ కాబోతున్నరు. బెనిఫిట్స్ చెల్లించాలంటే 11 వేల కోట్ల రూపాయలు కావాలి. పైసల్లేవంటున్నరు. డబ్బులిచ్చే పరిస్థితి లేక ఉద్యోగుల వయోపరిమితిని 65 ఏళ్లు చేయబోతున్నారు. బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే… ఆయా సమస్యలపై ముందుండి పోరాడే బాధ్యత మేం తీసుకుంటాం… కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేస్తే 14 నెలల పాలనలో మీకు ఏమిచ్చింది? 6 గ్యారంటీలను అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డు లేదు. ఒక్క ఇల్లు ఇయ్యలే. ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలే. ఒక్క సమస్యను పరిష్కరించలేదు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవాలని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. కాంగ్రెస్ మోసాలకు బుద్ది చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలి.’’ అని అన్నారు.
మోదీతో పోలికా?: డి.కె. అరుణ
ఎన్నికల ప్రచారంలో డి.కె. అరుణ మాట్లాడుతూ ‘‘రేవంత్ పాలనకు.. మోదీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. మీపై .. మీ పాలనపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రా.. ప్రజల్లో మీ మీద, మీ పాలన మీద ఎంత నమ్మకం, విశ్వాసం ఉందో తెలుస్తుంది. 2047 నాటికి భారత్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారు. మోదీ పాలనపై విశ్వాసంతోనే మూడోసారి ప్రజలు ఆయనను ప్రధానిగా గెలిపించారు. ఒకప్పుడు వీసా ఇవ్వమన్న అమెరికా దేశ అధ్యక్షుడే ఎంత మర్యాదలు ఇస్తున్నారో తెలియదా..? అలాంటి విజనరీ లీడర్ ను చూసి నేర్చుకుంటే కొంతైనా బాగుపడతారు.
రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ బిజెపి అభ్యర్థులు గెలుస్తారన్న నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అందుకే కనీసం అభ్యర్థులకు కూడా పోటీలో పెట్టలేదు. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనకు ప్రజలకు అనుకూలంగా లేరు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మొన్నటిదిల్లీలోని ఆ పార్టీకి భంగపాటు తప్పలేదు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇప్పటి వరకు 4 డీఏలు లేవు, పీఆర్సీ లేదు, బిల్లులు మంజూరు కావడం లేదు, సీపీఎస్ రద్దు చేయలేదు, 2003 డీఎస్సీ అభ్యర్థులకు ఓపీఎస్ అమలు చేయడం లేదు, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు భర్తీ కాలేదు. మరి ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీని నమ్మాలి? తెలంగాణలో ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే బిజెపి అభ్యర్థులను గెలిపించాలి.’’ అని అన్నారు.
విషప్రచారం నమ్మొద్దు: ఈటల
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు చోట్ల ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో.. అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో.. సోషల్ మీడియాలో.. అనేక రకాల విషప్రచారాలు చేస్తున్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు విజ్ఞులు.. అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉన్నారు.. ఇలాంటి కుట్రలు-కుతంత్రాలు, విష ప్రచారాలు, ఫేక్ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ధీరుడు ఎప్పుడు బరిగేసి కొట్లాడుతారు. కుట్రదారులు, గెలవలేనివారు, సత్తా లేనివారు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వారు మాత్రమే ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారు. మోదీ నాయకత్వంలో 2024-25 బడ్జెట్ లో రూ.4 లక్షల కోట్లు కేటాయించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. 25-26 బడ్జెట్లో కూడా నడుస్తున్న పరిశ్రమలకు మద్దతివ్వడం, కొత్తగా పరిశ్రమలు పెట్టుకునే వారికి, వ్యాపారం చేసేవారికి, స్టార్టప్ ల కోసం పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భం మీకు తెలుసు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బిజెపి కార్యాచరణ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్తుంది. టీచర్ల విషయంలో 317జీవోను, జరిగిన అక్రమాలను సవరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు సవరించలేదు. ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా 15 నెలలుగా అందడం లేదు. చివరికి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. హెల్త్ కార్డులు ఇతర సమస్యల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపి మోసం చేసింది. ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయండి.. ఈ సర్కార్ అంకుశం పట్టుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం చేసేలా లేదు. పోరాటం చేసి మీ సమస్యలను పరిష్కరించే బిజెపికి అండగా ఉండాలని కోరుతున్నాం.’’ అని అన్నారు. వీరితో పాటు బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థులకు మద్దతుగా చేసిన ప్రచారం ప్రజలను ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రులను ఆలోచనలో పడేశాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు ఖాయం అన్న విశ్వాసం సర్వత్రా వ్యక్తమవుతోంది.