GKR in Parliament

బొగ్గు గనుల వేలంలో సింగరేణీ పాల్గొనవచ్చు

బొగ్గు గనుల వేలం వెనుక సింగరేణి ప్రైవేటీకరణ ఉద్దేశమేదీ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌ రెడ్డి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు. గనుల వేలం నిరంతర ప్రక్రియ అని, ఇందులో ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థలన్నీ పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ అంశంపై హైదరాబాద్‌ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు బ్లాక్‌లనూ వేలం పద్ధతిలోనే కేటాయిస్తున్నట్లు చెప్పారు. బొగ్గు శాఖ నిర్ణయించిన ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఎవరికీ నేరుగా కేటాయింపులు చేయకూడదని చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమలవుతున్న వేలం విధానంలో ప్రభుత్వరంగ సంస్థలూ పాల్గొనవచ్చని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులిస్తూ గనుల కేటాయింపు అంతా వేలం పద్ధతిలోనే జరుగుతోంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కూడా ఈ వేలంలో పాల్గొనవచ్చని వెల్లడించారు. రాజ్యసభలో బిజెపి సభ్యుడు డా. కె.లక్ష్మణ్‌ అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుతం సింగరేణి సంస్థ 2024 మార్చి 31 నాటికి 224 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. సింగరేణి చేతిలో తెలంగాణలోని 39 బొగ్గు బ్లాకులు ఉన్నాయని మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ”రాష్ట్రంలో గత అయిదేళ్లలో 327.697 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో 2020-21లో మినహాయించి మిగిలిన సంవత్సరాల్లో తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి పెరిగింది” అని వివరించారు. సింగరేణి బొగ్గు గనుల్లో 2020 నుంచి 2023 వరకు జరిగిన 25 ప్రమాదాల్లో 36 మంది మృతి చెందినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

మద్దతు ధరపై మొసలి కన్నీరొద్దు

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పంటల కనీస మద్దతు ధరపై మోదీ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ఖండించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని, కనీస మద్దతు ధరకు, పంట ఖర్చులకు ముడిపెడితే ప్రతికూల ఫలితాలు వస్తాయని 2013 డిసెంబరు 13న లోక్‌సభలో అప్పటి వ్యవసాయశాఖ సహాయమంత్రి తారిఖ్‌ అన్వర్‌ ఇచ్చిన సమాధానప్రతితో కలిపి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ”పార్లమెంటు సాక్షిగా 2013లో మీ సర్కారు ఏం చెప్పిందో మరిచారా? స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయలేమని చెప్పింది నిజం కాదా? పెట్టుబడిపై 50% కనీస మద్దతు ధర ఇస్తే.. మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ప్రకటించిన కౌలు రైతులకు రూ.15,000 ఆర్థిక సహాయం, వరికి రూ.500 బోనస్‌ ఏమయ్యాయి. పార్లమెంటు వేదికగా రైతు రాజకీయాలు చేయాలనే ప్రయత్నం తగదు” అని రాహుల్‌పై కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

మహిళల భద్రత కోసం రూ.13,412 కోట్లు : బండి సంజయ్

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తొలిసారి పార్లమెంటులో ప్రసంగిస్తూ మహిళల భద్రతకు హోం మంత్రిత్వ శాఖ రూ.13,412 కోట్లు విలువ గల వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. వాటి వివరాలు చెప్తూ ”ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం కోసం రూ.3375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కోసం రూ.531.24 కోట్లు, స్కీం ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ కోసం రూ.280 కోట్లు, మోడర్నైజేషన్ ఆఫ్ ప్రిజన్స్ కోసం రూ.950 కోట్లు, రాష్ట్ర సైన్స్ ఫోరెన్సిక్ లాబరేటరీల బలోపేతం కోసం రూ.106.75 కోట్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలు అప్ గ్రెడేషన్ కు, ఫోరెన్సిక్ డేటా సెంటర్, 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీల కోసం రూ.354.25 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కోసం రూ.2840 కోట్లు, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం రూ.76.5 కోట్లు, స్కీం ఫర్ పూర్ ప్రిజనర్స్ కోసం రూ.60 కోట్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కోసం రూ.113.76 కోట్లు, మహిళా హెల్ప్ డెస్కుల కోసం రూ.164.2 కోట్లు, చండీఘడ్ లో DNA ల్యాబ్ ఏర్పాటు కోసం రూ.42.84 కోట్లు, మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాల నియంత్రణ కోసం రూ.224.76 కోట్లు, సెంట్రల్ విక్టిమ్ కాంపోజిషన్ ఫండ్ కోసం రూ.200 కోట్లు, దిల్లీ పోలీస్ స్కీం ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్, కౌన్సిలర్స్, న్యూ బిల్డింగ్ ఫర్ విమెన్ సెంట్రిక్ ఫెసిలిటీస్ ఫర్ స్పెషల్ నీడ్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ కోసం రూ.38.8 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ స్కీం కోసం రూ.2254 కోట్లు చొప్పున కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో హోం మంత్రిత్వ శాఖ రూ.13,412 కోట్లు మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, బిడ్డల కోసం ఖర్చు పెడుతోంది.” అని తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల లబ్ధి : డా. కె. లక్ష్మణ్

తాజా కేంద్ర బడ్జెట్‌ ద్వారా తెలంగాణకు రూ.70 వేల కోట్ల ప్రయోజనం కలుగుతోందని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కోవా లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ ఇవ్వలేదని ఆరోపిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం గత పదేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో లక్ష్మణ్‌ ప్రసంగిస్తూ ”కేంద్ర బడ్జెట్‌ నుంచి పన్నుల్లో వాటా రూపంలో రూ.25,639 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.21,075 కోట్లు వస్తున్నట్లు తెలంగాణ బడ్జెట్‌లో చెప్పారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్‌ నుంచి తెలంగాణకు దాదాపు రూ.70 వేల కోట్లు వస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, బయటికి మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెబుతున్నారు. యూపీయే హయాంలో పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.82,227 కోట్లు రాగా.. మోదీ హయాంలో రూ.1,19,782 కోట్లు వచ్చాయి.” అని పేర్కొన్నారు. మరో సందర్భంలో రాజ్యసభలో జీరో అవర్‌లో డా. లక్ష్మణ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

సామాజిక న్యాయానికి చిరునామా బిజెపి: ఈటల

దేశంలో సామాజిక న్యాయానికి చిరునామా బిజెపి తప్పితే ఇంకో పార్టీ కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఓబీసీని ప్రధాని, మైనార్టీ, దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులను చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో రైతులు, సామాజిక న్యాయం గురించి రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ”75 ఏళ్ల ఈ దేశంలో 50 ఏళ్లకుపైగా పాలించింది కాంగ్రెసే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. బిజెపి ఓబీసీ నేతను ప్రధానమంత్రిగా, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన అబ్దుల్‌ కలాం, దళిత, గిరిజన బిడ్డలు రామ్‌నాథ్‌ కోవింద్, ద్రౌపదీ ముర్ములను రాష్ట్రపతులుగా చేసింది. ఇలాంటి సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్‌ ఎప్పుడూ ఊహించలేదు” అని పేర్కొన్నారు.

కేంద్రం డబ్బులు తీసుకొని బద్నాం చేస్తున్నారు: రఘునందన్‌

రాష్ట్రంలో పరిపాలన సాగించిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు మంచి జరిగితే తమ గొప్ప అని చెప్పుకొంటూ చెడు జరిగితే కేంద్రం బాధ్యత అని నిందలు వేస్తున్నారని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. అభివృద్ధికి కేంద్రం నుంచి డబ్బు తీసుకొని మళ్లీ తమనే బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో రఘునందన్‌రావు మాట్లాడుతూ ”తాజా బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు రూ.48 వేల కోట్లు ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మాత్రం బిజెపికి 8 మంది ఎంపీలను ఇస్తే 8 పైసలు కూడా తేలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. పీఎంఏవై కింద కేంద్రం ఇచ్చిన డబ్బుతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేసీఆర్‌ తనవిగా చెప్పుకొన్నారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా కేంద్రం నిధులతో నిర్మించిన గృహాలను ఇందిరమ్మ ఇళ్లు అని ప్రచారం చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి కూడా ప్రజలకు చెప్పడంలేదు.” అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

కేంద్రం మద్దతుతోనే తెలంగాణ సర్కారు మనుగడ: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వ మద్దతుతోనే తెలంగాణ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని చేవెళ్ల బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రసంగిస్తూ ”తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బిజెపి ఎంపీలు రాష్ట్రానికి ఏమీ చేయలేదని కాంగ్రెస్‌ నాయకులు మా పోస్టర్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. కానీ, బడ్జెట్‌కు.. ఎంపీల సంఖ్యకు సంబంధం లేదన్న విషయం వారికి తెలియకపోవడం హాస్యాస్పదం. ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.31 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. కేంద్రం గత జనవరిలో తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రూ.9 వేల కోట్ల మేర అప్పు తీసుకోవడానికి అనుమతించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో రూ.3 వేల కోట్లు, మార్చిలో రూ.4 వేల కోట్ల పరిమితి పెంచింది. దానివల్లే ఈ రోజు తెలంగాణ మనుగడ సాగించగలుగుతోంది” అని పేర్కొన్నారు.

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 3.65 లక్షల మందికి వైద్యం

తెలంగాణ బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 2023-24 సంవత్సరానికి మొత్తం 3,65,395 మంది అవుట్‌ పేషెంట్లు, 7,953 మంది ఇన్‌ పేషెంట్లకు వైద్యసేవలు అందించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి అయిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 750 పడకల సామర్థ్యమున్న ఈ సంస్థలో ప్రస్తుతం 21 స్పెషాలిటీ, 10 సూపర్‌ స్పెషాలిటీ డిపార్టుమెంట్లు పని చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ 100 మంది ఎంబీబీఎస్, 30 మంది బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు.

కాజీపేట పీవోహెచ్‌కు రూ.150 కోట్లు

కాజీపేటలో రూ.521.36 కోట్లతో అభివృద్ధి చేస్తున్న పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌(పీవోహెచ్‌) యూనిట్‌కు గత మార్చి వరకు రూ.190.88 కోట్లు ఖర్చు చేశామని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.150 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తెలంగాణలో రూ.32,946 కోట్ల విలువైన 2,298 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన వివరించారు. రూ.16,935 కోట్లతో 997 కిలోమీటర్ల మేర చేపడుతున్న 7 కొత్త లైన్లలో గత మార్చి నాటికి 245 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మరో ప్రశ్నకు బదులిస్తూ అమృత్‌ భారత్‌ స్టేషన్ల కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి దశలవారీగా ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునిక వసతులతోపాటు స్టేషన్‌ భవనాన్ని రెండువైపులా స్థానిక నగరంతో అనుసంధానించనున్నట్లు చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి టోకన్‌ సాహు రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులిస్తూ స్మార్ట్‌సిటీ మిషన్‌ కింద ఎంపికైన వరంగల్, కరీంనగర్‌లలో ఈ ఏడాది జులై 12 నాటికి రూ.2,725 కోట్ల విలువైన 146 ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో రూ.2,125 కోట్ల విలువైన 88 ప్రాజెక్టులు పూర్తయినట్లు చెప్పారు. ఈ రెండు నగరాలకు కేంద్ర, రాష్ట్రవాటాల కింద జులై 12 వరకు రూ.1,350 కోట్లు విడుదల చేశామన్నారు.

రాష్ట్రంలోని హైవేలకు రూ.7,394 కోట్లు

రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.7,394 కోట్లు కేటాయించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రాలవారీగా ఆ శాఖకు కేటాయించిన నిధుల పద్దుల్లో ఈ విషయం పేర్కొంది. రహదారుల విస్తరణతోపాటు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, వంతెనల నిర్మాణానికి, రహదారి భద్రతకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో రెండు లేన్ల రహదారులను నాలుగు వరుసలకు విస్తరించేందుకు, మూడు ప్రాంతాల్లో నాలుగు వరుసలుగా ఉన్న జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించింది. హైదరాబాద్‌-పుణె రహదారిలో బీహెచ్‌ఈఎల్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.112 కోట్లు, ఉప్పల్‌ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు రూ.78 కోట్లు, అంబర్‌పేట క్రాస్‌రోడ్‌ ఫ్లైఓవర్‌కు రూ.58 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని జాతీయ రహదారులకు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,730 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం పేర్కొంది.