సోనియా, రాహుల్, రేవంత్, కవిత, కేజ్రీవాల్.. చట్టం ముందు అందరూ సమానమే
2004-14 కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని శాసించిన సోనియా గాంధీ స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు (ఏజేఎల్) చెందిన వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి వేసిన కుట్రలపై ఈడీ, ఇతర సంస్థలను విచారణలను ఎదుర్కొంటున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పై తిరుగుతున్నారు. విచారణ సమయాల్లో కాంగ్రెస్ గూండాలు రోడ్లపై సృష్టించిన విధ్వంసం ఇంతాఅంతా కాదు. వేల కోట్ల ఏజేఎల్ ఆస్తులను సుమారు రూ.50 లక్షలకే కొట్టేయాలని, మధ్యలో కాంగ్రెస్ పార్టీని వాడుకుంటూ వేసిన పన్నాగాల్లో కాటికి కాలుచాపిన 87ఏళ్ల వయస్సున్న మోతీలాల్ వోహ్రాను వాడుకోవడం అత్యంత హేయమైనది. మన భారతదేశ చట్టం ముందు సోనియా అయినా, రాహుల్ అయినా, ఎవరైనా సమానమే.
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కొనడానికి వెళ్లి లక్షల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్ గా కెమెరా ముందు దొరికిపోయిన రేవంత్ రెడ్డి కేసు గత 8 సంవత్సరాలకు పైగా న్యాయస్థానాల్లో నడుస్తున్నది. కొంతకాలం అత్యున్నత న్యాయస్థానం స్టేల ద్వారా విచారణను వాయిదా వేయించుకొని తప్పించుకున్నా ఎప్పటికైనా చట్టం ముందుకు వచ్చి, విచారణను ఎదుర్కొని, న్యాయస్థానాలు నిర్ణయించిన శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, హోం శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న కారణంగా ఓటుకు నోటు కేసును ఇతర రాష్ట్రాల్లో విచారించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వచ్చిన సందర్భంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా అందరితో పాటు చట్టం ముందు సమానమే.
దేశం మొత్తాన్ని కుదిపేసిన దిల్లీ లిక్కర్ కేసులో ఎంతో మంది ప్రముఖులు జైలు జీవితం గడుపుతున్నారు. అందులో తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులతో పాటు దాదాపు 16 మంది జైలుకెళ్లారు. అత్యంత నీతిమంతుడిగా ఫోజులిచ్చిన కేజ్రీవాల్, తెలంగాణ ప్రజలను జాగృత పరుస్తున్నా అని చెప్పుకుంటున్న కవిత ఒక మద్యం కుంభకోణంలో భాగస్వాములుగా జైలుకు వెళ్లడం ప్రాంతీయ పార్టీల దోపిడీలు, వివిధ రకాల కుంభకోణాలకు నిదర్శనం. వీరి చర్యలు ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. 2023 నవంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్-బిజెపి ఒక్కటే అని కాంగ్రెస్ చేసిన భయంకర విషప్రచారం అబద్ధమని ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదన్న నిర్ణయం కారణంగా దొరికిన దురవకాశాలను దుర్మార్గంగా వాడుకొని, సాధ్యం కాని వందల కొలది హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తేటతెల్లమైన విష ప్రచారాన్ని ఎదుర్కోలేక, హామీలను నిలబెట్టుకోలేక, ఈ లోక్ సభ ఎన్నికల్లో పెద్ద భంగపాటుకు గురికానుంది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయంగా కనిపిస్తుంది. వివిధ కేసుల్లో ముద్దాయిలుగా పేర్కొనబడి వివిధ దశల్లో విచారణ ఎదుర్కొంటున్న ముఖ్యనాయకులు… బెయిళ్లు, జైళ్లు… వచ్చిన, వెళ్లిన తీరు చట్టం ముందు అందరూ సమానమే అని స్పష్టమవుతోంది. కాస్తా వెనకా ముందయినా విచారణ ఎదుర్కోక తప్పదని, వాళ్ల పాప ఫలితాలను అనుభవించక తప్పదని, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా ఏవిధంగానూ జోక్యం చేసుకోదని ప్రజలకు తేటతెల్లం అవుతోంది.
కొసమెరుపు ఏమిటంటే లిక్కర్ కేసు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ మాటల గారడీతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. అత్యాశకు పోయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కవితలు వాళ్ల దురాశ ఫలితాలను అనుభవించక తప్పదు. ఇదే భారతదేశ చట్టాల, న్యాయస్థానాల గొప్పతనం.