Modi Nalanda

దేశాన్ని ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యం

Nalanda Modiగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు కానీ జ్ఞానం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు స్పష్టం చేశారు. జూన్ 19న బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి నలంద యూనివర్సిటీ గుర్తింపుగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. నలంద విశ్వవిద్యాలయ పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని పేర్కొన్నారు. ఈ నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తోందని మోదీ వివరించారు. భారతదేశాన్ని ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తన లక్ష్యమని ప్రధాని తెలిపారు. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో భారతదేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోందని ప్రధాని పేర్కొన్నారు. నలంద అనేది కేవలం పేరు మాత్రమే కాదని.. ఒక గుర్తింపు, గౌరవం అని… ఒక విలువైన మంత్రం అని అన్నారు. బలమైన మానవ విలువలపై ఆధారపడిన దేశాలకు గతాన్ని ఎలా పునరుద్ధరించాలో, మంచి భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో ఇది మార్గనిర్దేశంగా ఉంటుందని వెల్లడించారు. గత 10 ఏళ్లలో దేశంలో సగటున ప్రతి వారం రోజులకు ఒక విశ్వవిద్యాలయం నిర్మితమవుతోందని.. ప్రతిరోజూ సగటున రెండు కొత్త కళాశాలలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ప్రస్తుతం 23 ఐఐటీలు ఉన్నాయని.. 10 ఏళ్ల క్రితం13 ఐఐటీలు మాత్రమే ఉండేవని ప్రధాని మోదీ వెల్లడించారు. 

ఈ సందర్భంగా నలంద యూనివర్సిటీలోని పురాతన శిథిలాలను ప్రధాని ఆసక్తిగా సందర్శించారు. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో సంస్థ వార‌స‌త్వ క‌ట్టడంగా గుర్తించిన న‌లంద మ‌హావీర‌ను ప్రధాని సందర్శించారు. పూర్వం అంటే 16 వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం ప‌ని చేసిన న‌లందా విశ్వ‌విద్యాల‌యం ప్ర‌పంచంలోనే మొద‌టి రెసిడెన్షియ‌ల్ విశ్వవిద్యాల‌యంగా పేరొందింది. 5వ శతాబ్దంలో స్థాపించిన పురాతన నలంద విశ్వవిద్యాలయానికి అప్పట్లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం… నలంద విశ్వవిద్యాలయం 800 సంవత్సరాల పాటు ఎంతోమంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించింది. అయితే 12వ శతాబ్దంలో భారతదేశంలోకి చొరబడిన ఆఫ్ఘన్లు ఈ విశ్వవిద్యాలయాన్ని కూల్చివేశారు. అందులోని పుస్తకాలు, ఇతర గ్రంథాలను తగులబెట్టారు. ఇక ఆ తర్వాత కొత్తగా న‌లంద విద్యాసంస్థను 2010లో ప్రారంభించగా.. 2014 నుంచి ఇది పనిచేస్తూ ఉంది. ఈ ప్రాంతాన్ని 2016లో ఐక్యరాజ్యసమితి వారసత్వ సంపదగా ప్రకటించింది. 

ప్రస్తుత న‌లందా విశ్వ‌విద్యాల‌య క్యాంప‌స్ లో రెండు అకాడమిక్ బ్లాక్స్ వున్నాయి. 1900 మంది విద్యార్థులు కూర్చోవ‌డానికి వీలుగా 40 త‌ర‌గ‌తి గ‌దుల‌ను నిర్మించారు. ఒక్కోదాంట్లో 300 వంద‌ల మంది కూర్చునేలా రెండు ఆడిటోరియాల‌ను నిర్మించారు. 550 మంది విద్యార్థుల‌ కోసం హాస్ట‌ల్ వ‌స‌తి వుంది. అంత‌ర్జాతీయ కేంద్రం, రెండు వేల మంది సామ‌ర్థ్యం గ‌ల ఆంపిథియేట‌ర్, ఫాక‌ల్టీ క్ల‌బ్‌, క్రీడా స‌ముదాయం మొద‌లైన వ‌స‌తులు ఈ యూనివ‌ర్సిటీలో ఉన్నాయి. ఈ క్యాంప‌స్ ప‌ర్యావ‌ర‌ణ హితంగా రూపొందింది. సౌర విద్యుత్ త‌యారీ ప్లాంట్, తాగునీటి శుద్ధి ప్లాంట్, వ్య‌ర్థాల‌ను శుద్ధి చేసే క‌ర్మాగారం, వంద ఎక‌రాల్లో నీటి వ‌న‌రులు, ఇంకా అనేక ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన సౌక‌ర్యాలు ఈ విశ్వ‌విద్యాల‌యంలో ఉన్నాయి.