హరియాణాలో బిజెపి హ్యాట్రిక్ విజయం
హరియాణాలో బిజెపి చరిత్ర సృష్టించింది. ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న ఈ రాష్ట్రంలో బిజెపి హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. హరియాణా రాష్ట్ర చరిత్రలోనే ఒక పార్టీ వరుసగా మూడోసారి గెలవడం ఇదే తొలిసారి. ప్రీ పోల్, పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. రాజకీయ నిపుణుల విశ్లేషణలను అబద్ధం చేస్తూ.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. అక్టోబర్ 5న ఎన్నికలు జరగగా అక్టోబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు.
మొత్తం 90 సీట్లు ఉన్న హరియాణాలో బిజెపి 48 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఎన్నికల షెడ్యూలు వెలువడినప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ దాకా.. ప్రతి దశలోనూ గెలుపుపై అతివిశ్వాసాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ.. కేవలం 37 సీట్లకు పరిమితమైంది. ఐఎన్‌ఎల్‌డీ రెండు సీట్లతో సరిపెట్టుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. గత ఎన్నికల్లో 10 సీట్లు సాధించిన జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఈసారి ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడింది! ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా కూడా దారుణాతిదారుణంగా ఓడిపోయారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా బిజెపి ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. ఆ పార్టీ ఆశించనంతగా ప్రభుత్వ వ్యతిరేకత లేదని స్పష్టమైంది. ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీ కేవలం 200 రోజుల పాలనతోనే ప్రజల మనసులు చూరగొన్నారు.
త్రివిధ దళాల్లో అగ్నివీర్‌గా పని చేసిన వారికి సర్వీస్ అనంతరం ఉపాధి కల్పనకు ఆమోదం, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే పంటల సంఖ్యను 24కు పెంచడం, విద్యుత్ బిల్లుల కనీస చార్జీల రద్దు వంటి సైనీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సీఎం సైనీపై నమ్మకాన్ని పెంచేశాయి. ఇక, ఎన్నికల ప్రచారంలోనూ పార్టీని ముందుండి నడిపించిన సైనీ… బిజెపి సాధించిన విజయాలను, ఎన్నికల హామీల అమలు అంశంలో తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది.
‘‘ఈరోజు (మంగళవారం) శరన్నవరాత్రుల్లో ఆరో రోజు. చేతిలో కమలం పట్టుకుని, సింహవాహనాన్ని అధిరోహించిన కాత్యాయనీ మాతను ఆరాధించే రోజు. ఆ తల్లి మనందరినీ ఆశీర్వదించింది. ఈ పవిత్ర సమయంలో.. హరియాణాలో వరుసగా మూడోసారి కమలం వికసించింది. భగవద్గీత పుట్టిన గడ్డపై సత్యం, అభివృద్ధి గెలిచాయి. అబద్ధాల మూటపై అభివృద్ధి హామీ విజయం సాధించింది. ’’
– ప్రధాని మోదీ
జమ్మూ కాశ్మీర్ లో పెరిగిన బిజెపి బలం
జమ్మూ కాశ్మీర్ లో బిజెపి బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల కన్నా 4 సీట్లు ఎక్కువ గెలిచి 29 సీట్లు సాధించింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో బిజెపి ఎప్పుడు ఇన్ని సీట్లు సాధించలేదు. బిజెపి ఓట్ల శాతం కూడా 23 నుంచి 25.64కు పెరిగింది. ఇక 43 సీట్లున్న జమ్మూ ప్రాంతంలో మాత్రం బిజెపిదే హవా. బిజెపి గెలిచిన 29 సీట్లు ఈ ప్రాంతం నుంచే. ఈ ప్రాంతంలో రెండో స్థానంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. అయితే కాశ్మీర్ ప్రాంతంలో 41 సీట్లు గెలిచిన ఎన్సీ మొత్తం 49 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్సీతో కూటమి కట్టిన కాంగ్రెస్ 6 సీట్లకే పరిమితమైంది. మరో ఇండీ కూటమి పార్టీ సీపీఐ 1 స్థానంతో సరిపెట్టుకుంది. పీడీపీ 3, ఆప్ 1, ఇతర పార్టీలు 1, స్వతంత్రులు 7 సీట్లు గెలిచారు.
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వర్తించిన రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ ముక్త్ జమ్మూకశ్మీర్ సాధనలో మేం విజయం సాధించాం. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పని చేశారు. ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పని చేస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధానమంత్రి మోదీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు. మోదీపై ప్రజలకున్న విశ్వాసమేంటో.. జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ముక్త్ జమ్మూను ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపించారు.’’ అని అన్నారు.