Manoharlal Khattar

జల్ జీవన్ మిషన్ వల్లే తెలంగాణ గ్రామాల్లో నల్లా కనెక్షన్లు

ల్ జీవన్ మిషన్ కింద తెలంగాణలో 38.30 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు అందించామని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయంటే అది జల్ జీవన్ మిషన్ వల్లేనని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పేరుతో మా ఘనతేనని బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. డిసెంబర్ 24న కరీంనగర్ లో పర్యటించిన మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హౌజింగ్ బోర్డు కాలనీలో 24 గంటల నీటి సరఫరా చేసే చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఈ కాలనీలోని 2,660 ఇండ్లకు ప్రతిరోజూ 24 గంటల పాటు తాగునీరు సరఫరా కానుంది. ఇప్పటి వరకు దేశంలోని ఒకటి, రెండు పట్టణాల్లో మాత్రమే 24 గంటలపాటు తాగునీటి సదుపాయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 24 గంటల తాగునీరు సరఫరా అవుతున్న తొలినగరంగా కరీంనగర్ ఘనత సాధించింది. దీంతో పాటు స్థానిక ఎంపీ అయిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులతో కలిసి తెలంగాణ చౌక్ వద్ద రూ.8.2 కోట్లతో చేపట్టిన పార్క్ పనులను, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం వద్ద రూ.22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను, కుమ్మర్ వాడి హైస్కూల్ లో స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హౌజింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ ‘‘నగరాల్లో జీవన నాణ్యతను మెరుపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ జీ దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా దేశంలోని 74 శాతం గృహాలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల దేశవ్యాప్తంగా డయేరియా సంబంధిత మరణాలు మూడు లక్షల తగ్గాయి. “హర్ ఘర్ నల్ సే జల్’’ పథకం కింద 2023లో దేశవ్యాప్తంగా 3 కోట్ల కనెక్షన్లు ఇచ్చాం. మరో నాలుగేళ్ళల్లో దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని నల్లా ద్వారా అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులను సమగ్రంగా వినియోగించుకుని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది. మిగతా పట్టణాలతో పోలిస్తే కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులు చాలా బాగా జరిగాయి. రోడ్ల చుట్టూ పచ్చదనం బాగుంది. ప్రజలు ఆశించిన బహుళ రకాల ప్రయోజనాల ఫలితాలను అందించడమే స్మార్ట్ సిటీ ఆశయం. అందుకే స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ లకు రూ.1,116 కోట్ల నిధులు విడుదల చేసినం. 122 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,733 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నయ్. స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ కు రూ.826 కోట్లు వచ్చాయి. ఇందులో కేంద్రం నుండి రూ.428 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.398 కోట్లు విడుదలయ్యాయి. స్మార్ట్ సిటీ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లిస్తే గళమెత్తిన నాయకుడు బండి సంజయ్. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఈ అంశంపై నిలదీశారు. దారి మళ్లించిన నిధులను వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేయించేలా చేసిన ఘనత సంజయ్ దే. ఇవాళ కరీంనగర్ లో కేంద్రం విడుదల చేసిన నిధులన్నీ ఖర్చవుతున్నాయంటే ఆ క్రెడిట్ బండి సంజయ్ కే దక్కుతుంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలి. మా కరీంనగర్ ఎంపీ సొంతూరైన ఈ కార్పొరేషన్ మిగతా పట్టణాలకు పోటీగా అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ నా వంతు సహకారం ఎల్లప్పుడూ బండి సంజయ్ కు, ఈ కరీంనగర్ ఉంటుందని తెలియజేస్తున్నాను. కరీంనగర్ స్మార్ట్ సిటీ లో భాగంగా కమాండ్ కంట్రోల్ ఆధునికరించారు దీన్ని ద్వారా ప్రజల భద్రతకు మరింత మేలు జరుగుతుంది. స్మార్ట్ క్లాసులో ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పట్టణాల్లో అమలు చేస్తున్న.. పీఎం స్వనిధి పథకం అమలు విషయంలో కరీంనగర్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 12,000 మంది వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణసహాయం అందుతోంది.

నరేంద్రమోదీ నాయకత్వంలోని మా ప్రభుత్వం గత పదేళ్లలో 10 లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. పన్నుల రూపేణా రూ.2.3 లక్షల కోట్లు, వివిధ పథకాల కింద రూ.6.2 లక్షల కోట్లు తెలంగాణకు కేటాయించినం. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద తెలంగాణకు గత పదేళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయించినం. ఈ ఆర్థిక (2024-25) సంవత్సరంలోనే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.21,636 కోట్లను కేటాయించేలా బడ్జెట్ అంచనాలను రూపొందించినం. దురుదృష్టమేందంటే కేంద్రం కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. యుటిలైజేషన్ సర్టిఫికేట్ (యూసీ) ను సమర్పించడంలో జాప్యం చేయడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి.’’ అని అన్నారు.

డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం 

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో కరీంనగర్ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న ‘డంపింగ్ యార్డ్’ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానని, అందుకు ఎంత ఖర్చయినా కేంద్రమే భరిస్తుందని బహిరంగ సభ వేదికగా కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో కరీంనగర్ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. కొద్ది రోజుల క్రితం ఆయన ఈ విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఖట్టర్ కరీంనగర్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి అధిక సంఖ్యలో ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించారు. ‘‘ఈ ఏడాది కోటి ఇండ్లను దేశవ్యాప్తంగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో తెలంగాణకు రావాల్సిన వాటా కంటే అధికంగా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చేసిన తాజా ప్రకటన రాష్ట్రంలో ఇండ్లులేని పేదల పాలిట వరంగా మారనుంది. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లను నిర్మించకుండా పేదలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఫలితంగా రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకు పైగా ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కేంద్రం అధికంగా ఇండ్లను మంజూరు చేస్తే పేదలకు గూడు లభిస్తుంది.