జలశక్తికి నారీశక్తి దోహదం
29 సెప్టెంబర్ 2024న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
సాధారణంగా ఉబుసుపోక ముచ్చట్లు, నెగిటివ్ విషయాలు ఉంటే తప్ప ప్రజల దృష్టిని ఆకర్షించలేమన్న అభిప్రాయం ఉంది. కానీ ‘మన్ కీ బాత్’ దేశంలోని ప్రజలు సానుకూల సమాచారం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో నిరూపించింది. సానుకూల అంశాలు, స్పూర్తిదాయక ఉదంతాలు, ప్రోత్సహించే గాథలను ప్రజలు ఇష్టపడతారు. చకోర పక్షి కేవలం వర్షపు చినుకులు మాత్రమే తాగుతుందంటారు. చకోర పక్షి లాగే మన్ కీ బాత్ శ్రోతలు కూడా దేశ ప్రయోజనాల అంశాలను, ఉమ్మడి ప్రయోజనాల విషయాలను ఎంతో గర్వంతో వింటారు. ప్రతి ఎపిసోడ్‌తో కొత్త గాథలు, కొత్త రికార్డులు, కొత్త వ్యక్తులను జోడించేవిధంగా ఒక ధారావాహికను ‘మన్ కీ బాత్’ సృష్టించింది. మన సమాజంలోని వ్యక్తులు సామూహిక స్ఫూర్తితో ఏ పని చేసినా వారికి ‘మన్ కీ బాత్’ ద్వారా గౌరవం లభిస్తుంది.
జల సంరక్షణ ప్రాధాన్యతను వర్షాకాలం గుర్తు చేస్తుంది. వర్షపు రోజుల్లో పొదుపు చేసుకున్న నీళ్లు నీటి సంక్షోభం సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ‘క్యాచ్ ది రెయిన్’ వంటి ప్రచారాల వెనుక ఉన్న భావన ఇదే. నీటి సంరక్షణ కోసం చాలా మంది కొత్త కార్యక్రమాలు చేపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. అలాంటి ఒక ప్రయత్నం ఉత్తరప్రదేశ్‌లో కనిపించింది. నీటి కొరతకు గుర్తింపు పొందిన బుందేల్‌ఖండ్‌లోని ఝాన్సీలో స్వయం సహాయక బృందంతో అనుబంధం ఉన్న మహిళలు ఘురారి నదికి కొత్త జీవితం ఇచ్చారు. ‘జల్ సహేలీ’గా మారి, ఈ ఉద్యమానికి ఆ మహిళలు నాయకత్వం వహించారు. ఈ జల్ సహేలీలు ఇసుకను బస్తాలలో నింపి ఒక చెక్ డ్యామ్‌ను సిద్ధం చేశారు. వర్షం నీరు వృథా కాకుండా కాపాడారు. నదిని నీటితో నింపారు. వందలాది రిజర్వాయర్ల నిర్మాణం, పునరుజ్జీవనంలో ఈ మహిళలు చురుగ్గా దోహదపడ్డారు. ఈ ప్రాంత ప్రజల నీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చూశారు.
కొన్ని చోట్ల జలశక్తిని నారీశక్తి పెంచుతుంది. మరికొన్ని చోట్ల నారీశక్తిని జలశక్తి బలోపేతం చేస్తుంది. మధ్యప్రదేశ్ డిండౌరీ లోని రాయపురా గ్రామంలో పెద్ద చెరువు కట్టడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల అక్కడి మహిళలకు లబ్ధి కలిగింది. అక్కడి ‘శారదా జీవనోపాధి స్వయం సహాయక బృందం’లోని మహిళలు చేపల పెంపకం వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. అక్కడ వారి ఆదాయం కూడా చేపల విక్రయం ద్వారా పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ మహిళల ప్రయత్నాలు కూడా ప్రశంసనీయం. అక్కడి ఖోప్ గ్రామంలో పెద్దచెరువు ఎండిపోవడంతో అక్కడి మహిళలు దాని పునరుజ్జీవనానికి కృషి చేశారు. ‘హరి బగియా స్వయం సహాయక బృందా’నికి చెందిన ఈ మహిళలు చెరువులోని పూడిక మట్టిని పెద్ద మొత్తంలో తీశారు. చెరువులోంచి వచ్చిన పూడికమట్టితో బంజరు భూమిలో ఫల వనాన్ని సిద్ధం చేశారు. ఈ మహిళల కృషి వల్ల చెరువు పుష్కలంగా నిండడమే కాకుండా పంట దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. దేశంలోని ప్రతి మూలలో జరుగుతున్న ఇటువంటి నీటి సంరక్షణ ప్రయత్నాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. మీ చుట్టూ జరుగుతున్న అలాంటి ప్రయత్నాలలో మీరు కూడా తప్పకుండా పాల్గొంటారని నాకు నమ్మకం ఉంది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ‘ఝాలా’ అనే సరిహద్దు గ్రామం ఉంది. అక్కడి యువకులు తమ గ్రామంలో ‘ధన్యవాదాలు ప్రకృతి- థాంక్యూ నేచర్’ అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు రెండు గంటల పాటు గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారు. గ్రామంలోని వీధుల్లో ఉన్న చెత్తను సేకరించి గ్రామం వెలుపల నిర్దేశించిన స్థలంలో వేస్తారు. దీంతో ‘ఝాలా’ గ్రామం కూడా పరిశుభ్రంగా మారుతోంది. ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ప్రాంతం ఇలాంటి థాంక్యూ ప్రచారం ప్రారంభిస్తే ఎంత పరివర్తన వస్తుందో ఒక్కసారి ఆలోచించండి! పుదుచ్చేరి సముద్ర తీరంలో పరిశుభ్రతపై అధ్బుతమైన ప్రచారం జరుగుతోంది. అక్కడ రమ్య అనే మహిళ మాహే మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాల యువ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. తమ కృషితో మాహే ప్రాంతాన్ని, ముఖ్యంగా అక్కడి బీచ్‌లను పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు ఈ బృందంలోని వ్యక్తులు.
‘స్వచ్ఛ భారత్ మిషన్’ విజయంతో ‘వ్యర్థాల నుండి సంపద’ అనే మంత్రం ప్రజల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రజలు ‘రెడ్యూస్, రీ-యూజ్, రీసైకిల్’ గురించి మాట్లాడటం ప్రారంభించారు. కేరళలోని కోజికోడ్‌లో 74 సంవత్సరాల వయసున్న సుబ్రహ్మణ్యన్ 23 వేలకు పైగా కుర్చీలకు మరమ్మతులు చేసి, వాటిని మళ్లీ ఉపయోగించుకునేలా చేశారు. ప్రజలు ఆయనను ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్- అంటే RRR (ట్రిపుల్ ఆర్) ఛాంపియన్’ అని కూడా పిలుస్తారు. కోజికోడ్ సివిల్ స్టేషన్, పిడబ్ల్యుడి, ఎల్‌ఐసి కార్యాలయాలలో ఆయన చేసిన ఈ అపూర్వ ప్రయత్నాలను చూడవచ్చు.
నా అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం దాదాపు 300 పురాతన కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షులు బైడెన్ పూర్తి ఆప్యాయతను ప్రదర్శిస్తూ, డెలావేర్‌లోని తన వ్యక్తిగత నివాసంలో ఈ కళాఖండాలలో కొన్నింటిని నాకు చూపించారు. తిరిగి వచ్చిన కళాఖండాలు టెర్రకోట, రాయి, ఏనుగు దంతాలు, కలప, రాగి, కాంస్యం వంటి పదార్థాలతో తయారయ్యాయి. వీటిలో చాలా వస్తువులు 4వేల సంవత్సరాల కిందటివి. 4 వేల సంవత్సరాల కిందటి నుండి 19వ శతాబ్దం వరకు ఉన్న కళాఖండాలను అమెరికా తిరిగి అందించింది. వీటిలో పూల కుండీలు, దేవతల టెర్రకోట ఫలకాలు, జైన తీర్థంకరుల విగ్రహాలు, బుద్ధుడి ప్రతిమలు, శ్రీ కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. తిరిగి వచ్చిన వస్తువులలో చాలా జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయి. పురుషులు, స్త్రీల బొమ్మలతో జమ్మూ కాశ్మీర్‌లోని టెర్రకోట టైల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో దక్షిణ భారతదేశానికి చెందిన కంచుతో చేసిన గణేశుని విగ్రహాలు కూడా ఉన్నాయి. తిరిగి వచ్చిన వస్తువులలో పెద్ద సంఖ్యలో విష్ణువు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు సంబంధించినవి. ఈ కళాఖండాలను చూస్తే మన పూర్వికులు సూక్ష్మ నైపుణ్యాలపై ఎంత శ్రద్ధ చూపారో స్పష్టమవుతుంది. కళ పట్ల వారికి ఎంతో అద్భుతమైన అవగాహన ఉండేది. ఈ కళాఖండాలను చాలా వరకు అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా దేశం నుండి బయటకు తీసుకువెళ్ళారు. ఇది తీవ్రమైన నేరం. ఒక విధంగా ఇది మన వారసత్వాన్ని నాశనం చేయడం లాంటిది. అయితే గత దశాబ్దంలో ఇటువంటి అనేక కళాఖండాలు, మన పురాతన వస్తువులు చాలా వరకు తిరిగివచ్చాయి.
ఏ పిల్లవాడైనా ఏ భాషను సులభంగా, త్వరగా నేర్చుకుంటాడు అని నేను అడిగితే – మీ సమాధానం ‘మాతృభాష’ అనే వస్తుంది. మన దేశంలో దాదాపు ఇరవై వేల భాషలు, మాండలికాలు ఉన్నాయి. అవన్నీ ఎవరో ఒకరికి మాతృభాషలే. వ్యవహారాల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కొన్ని భాషల్లో ఒకటి మన ‘సంథాలీ’ భాష. డిజిటల్ ఇన్నోవేషన్ సాయంతో ‘సంథాలీ’కి కొత్త గుర్తింపు తెచ్చేలా ఉద్యమం మొదలైంది. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో నివసిస్తున్న సంథాల్ ఆదివాసీ సమాజానికి చెందిన ప్రజలు ‘సంథాలీ’ని మాట్లాడతారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లలో కూడా సంథాలీ మాట్లాడే ఆదివాసీ సమాజాలు ఉన్నాయి. ఒడిషాలోని మయూర్‌భంజ్‌లో నివసిస్తున్న రామ్‌జిత్ టుడు సంథాలీ భాష ఆన్‌లైన్ గుర్తింపు పొందేందుకు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. రామ్‌జిత్ డిజిటల్ వేదికను సృష్టించారు. ఇక్కడ సంథాలీ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని సంథాలీ భాషలో చదవవచ్చు. రాయవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం రామ్‌జిత్ మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రారంభించినప్పుడు తన మాతృభాషలో సందేశాలు పంపలేనందుకు ఆయన బాధపడ్డారు. ఆ తర్వాత ‘సంథాలీ భాష’ లిపి ‘ఓల్ చికీ’ని టైప్ చేసే అవకాశాలను అన్వేషించడం ప్రారంభించారు. తన సహోద్యోగుల సహాయంతో ‘ఓల్ చికీ’లో టైపింగ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆయన కృషి వల్ల సంథాలీ భాషలో రాసిన వ్యాసాలు లక్షలాది మందికి చేరుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో దేశంలోని నలుమూలల ప్రజలు అద్భుతాలు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ ప్రచారం కింద ఉత్తరప్రదేశ్‌లో 26 కోట్లకు పైగా మొక్కలు నాటారు. గుజరాత్ ప్రజలు 15 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఒక్క ఆగస్టు నెలలోనే రాజస్థాన్‌లో 6 కోట్లకు పైగా మొక్కలను నాటారు. దేశంలోని వేలాది పాఠశాలలు కూడా ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాయి.
విపత్తులోనూ ధైర్యం కోల్పోకుండా, దాని నుండి నేర్చుకునే కొంతమంది మన చుట్టూ ఉన్నారు. అటువంటి మహిళ సుభాశ్రీ. ఆమె తన ప్రయత్నాలతో అరుదైన, చాలా ఉపయోగకరమైన మూలికలతో కూడిన అద్భుతమైన తోటను సృష్టించారు. ఆమె తమిళనాడులోని మధురై నివాసి. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైనా ఆమెకు ఔషధ మొక్కలు, వైద్య మూలికల పట్ల మక్కువ అధికంగా ఉంది. 80వ దశకంలో ఆమె తండ్రి విషపూరితమైన పాము కాటుకు గురైనప్పుడు వీటిపై ఆమెకు ఆసక్తి ప్రారంభమైంది. అప్పుడు సాంప్రదాయిక మూలికలు ఆమె తండ్రి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడ్డాయి. ఈ సంఘటన తర్వాత ఆమె సాంప్రదాయిక ఔషధాలు, మూలికల కోసం అన్వేషణ ప్రారంభించారు. నేడు మధురైలోని వెరిచియూర్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన హెర్బల్ గార్డెన్‌ను ఆమె రూపకల్పన చేశారు. ఇందులో 500 కంటే ఎక్కువ అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ తోటను సిద్ధం చేయడానికి ఆమె చాలా కష్టపడ్డారు. ప్రతి మొక్కను కనుగొనడానికి చాలా దూరం ప్రయాణించి, సమాచారాన్ని సేకరించారు. చాలాసార్లు ఇతర వ్యక్తుల నుండి సహాయం కోరారు. కోవిడ్ సమయంలో ప్రజలకు రోగనిరోధక శక్తిని పెంచే మూలికలను ఆమె పంపిణీ చేశారు. నేడు ఆమె రూపకల్పన చేసిన హెర్బల్ గార్డెన్‌ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. మూలికల మొక్కలు, వాటి ఉపయోగాల గురించిన సమాచారాన్ని ఆమె అందరికీ వివరిస్తారు. వందల ఏళ్లుగా మన సంస్కృతిలో భాగమైన మన సంప్రదాయ వారసత్వాన్ని సుభాశ్రీ ముందుకు తీసుకువెళుతున్నారు.
పరివర్తన చెందుతున్న ఈ కాలంలో ఉద్యోగాల స్వభావాలు మారుతున్నాయి. కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. గేమింగ్, యానిమేషన్, రీల్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ లేదా పోస్టర్ మేకింగ్ వంటివి వస్తున్నాయి. మీరు ఈ నైపుణ్యాలు దేంట్లోనైనా బాగా చేయగలిగితే మీ ప్రతిభకు భారీ వేదిక లభిస్తుంది. మీరు బ్యాండ్‌తో అనుసంధానమై ఉంటే లేదా కమ్యూనిటీ రేడియో కోసం పని చేస్తే, మీకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ‘క్రియేట్ ఇన్ ఇండియా’ అనే థీమ్‌తో 25 సవాళ్లను ప్రారంభించింది. కొన్ని సవాళ్లు సంగీతం, విద్య, యాంటీ పైరసీపై కూడా దృష్టి సారించాయి. అనేక వృత్తిపరమైన సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఇవి ఈ సవాళ్లకు తమ పూర్తి సహకారం అందిస్తున్నాయి. వీటిలో చేరడానికి మీరు wavesindia.org వెబ్ సైట్ లో లాగిన్ చేయవచ్చు. ఇందులో పాల్గొని సృజనాత్మకతను ప్రదర్శించవలసిందిగా దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లకు నా ప్రత్యేక కోరిక.
ఈ నెలలో మరో ముఖ్యమైన ప్రచారానికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రచారం విజయవంతం కావడంలో దేశంలోని పెద్ద పరిశ్రమల నుండి చిన్న దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరి సహకారం ఉంది. నేను ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు MSME లు ఈ ప్రచారం నుండి చాలా ప్రయోజనాలను పొందడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రచారం ద్వారా ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నేడు భారతదేశం తయారీ రంగంలో పవర్‌హౌస్‌గా మారింది. దేశ యువ శక్తి కారణంగా యావత్ ప్రపంచం దృష్టి మనపై ఉంది. ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా డిఫెన్స్ ఇలా అన్ని రంగాలలో దేశ ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిరంతరంగా పెరుగుతున్న ఎఫ్‌డిఐలు కూడా మన ‘మేక్ ఇన్ ఇండియా’ విజయగాథను చెప్తున్నాయి. ఇప్పుడు మనం ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి పెడుతున్నాం. అందులో మొదటిది ‘క్వాలిటీ’. అంటే మన దేశంలో తయారయ్యే వస్తువులు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలి. రెండోది ‘వోకల్ ఫర్ లోకల్’. అంటే స్థానిక విషయాలను వీలైనంతగా ప్రచారం చేయాలి. ‘మన్ కీ బాత్’లో #MyProductMyPride గురించి కూడా చర్చించాం.
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో టెక్స్ టైల్స్ లో పాత వారసత్వం ఉంది. దాని పేరు ‘భండారా టసర్ సిల్క్ హ్యాండ్లూమ్’. టసర్ సిల్క్ దాని డిజైన్, రంగు, దృఢత్వానికి ప్రసిద్ధి చెందింది. భండారాలోని కొన్ని ప్రాంతాల్లో 50కి పైగా స్వయం సహాయక బృందాలు దీనిని పరిరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. వీటిలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉంది. ఈ సిల్క్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్థానిక సమాజాలకు సాధికారత కల్పిస్తోంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి.
మన్ కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన
చెట్ల పెంపకానికి సంబంధించిన అనేక ఉదాహరణలు మన దేశంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక ఉదాహరణ తెలంగాణకు చెందిన కె.ఎన్.రాజశేఖర్ ది. మొక్కలు నాటడం పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నాలుగేళ్ల క్రితం మొక్కలు నాటే కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. రోజూ ఓ మొక్క తప్పకుండా నాటాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ ఉద్యమాన్ని కఠినమైన వ్రతంలా నిర్వహించారు. ఆయన 1500కు పైగా మొక్కలు నాటారు. ఈ ఏడాది ప్రమాదానికి గురైన తర్వాత కూడా ఆయన తన దృఢ సంకల్పాన్ని వదలకపోవడం అత్యంత గొప్ప విషయం. అలాంటి ప్రయత్నాలన్నింటినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పవిత్ర ఉద్యమం ‘ఏక్ పేడ్ మా కే నామ్’లో చేరాలని నేను మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను.