జమ్మూ కాశ్మీర్ లో కుటుంబ రాజకీయాలకు తెరదించనున్న ఎన్నికలు
ఈ అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ చరిత్రలో అత్యంత కీలకంగా నిలవబోతున్నాయి. 2019లో అప్పటి రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ నుంచి ఏర్పాటు చేసిన కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) లో సెప్టెంబరులో మొట్టమొదటి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంత (యూటీ) శాసనసభలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను యూటీగా ప్రకటించిన అనంతరం కొన్ని పరిపాలనాపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మునుపటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 83 అసెంబ్లీ సీట్లు ఉండగా, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ సంఖ్య 90కి పెరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ ఆధ్వర్యంలో 2020 మార్చిలో పునర్వ్యవస్థీకరణ కమిషన్ ను ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కలిసి ఒక తాత్కాలిక కూటమి ‘గూప్కార్ అలయన్స్’ను ఏర్పాటు చేసి, న్యాయస్థానాల్లో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను సవాలు చేసినప్పటికీ కమిషన్ 2022 మధ్యనాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసింది.
ఈ ఎన్నికలలో ప్రధాన పాత్రధారులు బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు. సజ్జాద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్, అల్తాఫ్ బుఖారీ నాయకత్వంలోని జేకే అప్నీ పార్టీ వంటి అనేక ఇతర చిన్న పార్టీలు కూడా కాశ్మీర్ లోయలో ఉద్భవించాయి. కాశ్మీర్ లోయ రాజకీయాల్లో ఆశ్చర్యం కలిగించే ఒక కొత్త పరిణామం ఏమిటంటే, ఇంజనీర్ రషీద్‌గా ప్రసిద్ధి చెందిన చంచల మనస్తత్వం గల వేర్పాటువాద నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్ నేతృత్వంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ) అనే వేర్పాటువాద అనుకూల సంస్థ బలం పుంజుకోవడం. రషీద్ ఈ సంవత్సరం మొదట్లో బారాముల్లాలోని ఉత్తర కాశ్మీర్ లోక్‌సభ స్థానంలో ఎన్సీ బలమైన నాయకుడు, లోయ రాజకీయాలలో దిగ్గజం వంటి ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించి జమ్మూ కాశ్మీర్ రాజకీయాల పరిశీలకులను దిగ్భ్రాంతి పరిచాడు. అప్పటి నుంచి శాసనసభ ఎన్నికల ద్వారా కాశ్మీర్ లోయ రాజకీయాల్లో రషీద్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇది ఈ ప్రాంతానికి, దేశానికి కూడా మంచి పరిణామం కాదు. జమ్ము ప్రాంతంపై బలమైన పట్టు ఉన్న బిజెపి, అక్కడ బలీయమైన శక్తిగా కొనసాగుతుంది. పీర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ వంటి ముస్లిం ఆధిక్యం ఉన్న ప్రాంతాలతో సహా జమ్మూ ప్రాంతంలోని దాదాపు మొత్తం 43 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి బలమైన సంస్థాగత, రాజకీయ ఉనికిని కలిగి ఉంది. గత కొన్ని నెలలుగా అనేక మంది ప్రముఖ ముస్లిం నాయకులు పార్టీలో చేరడంతో ముస్లిం ఓట్లు కీలకమైన పదికి పైగా స్థానాల్లో పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయి. కాశ్మీర్ లోయలో మెజారిటీ సీట్లను గెలుచుకోవడం ద్వారా తిరిగి పుంజుకోవాలని ఎన్సీ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో దాని నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఓడిపోవడంతో ఆ పార్టీ ఉత్సాహం నీరుగారిపోయింది. దీంతో జమ్మూలో బిజెపి ఘనవిజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో అబ్దుల్లాలు కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. బిజెపి ఉప్పెనను అడ్డుకోవడంలో ఇండీ కూటమి తమకు సహకరిస్తుందని వారు ఆశిస్తున్నారు. అయితే 2022 ఆగస్టులో గులాం నబీ ఆజాద్ నిష్క్రమణ తర్వాత కాంగ్రెస్ ఈ ప్రాంతంలో పేలవ శక్తిగా మిగిలిపోయింది. దాని ఇతర నాయకులు చాలా మంది బిజెపి వంటి పార్టీలకు వలస వచ్చారు.
ఎన్సీతో చేతులు కలపడం ద్వారా కాంగ్రెస్ లాభపడటం పోయి అవకాశవాద పొత్తులకు దిగినందుకు దేశ ప్రజలతో పాటు జమ్మూ ప్రజలు, కాశ్మీర్‌లోని జాతీయవాద శక్తుల ఆగ్రహాన్ని మూటగట్టుకోవలసి ఉంటుంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఎన్సీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అందులో ఆ పార్టీ మొదటి డిమాండ్ భారత రాజ్యాంగంలోని అధికరణం 370, 35 ఏ ల పునరుద్ధరణ. “ఆగస్టు 5, 2019న జరిగిన దానితో (అధికరణం 370 రద్దు) జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏకీభవించడం లేదని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా తెలియజేయడం ఎన్నికైన అసెంబ్లీ మొదటి పని. మనకు ఏమి జరిగిందో దాన్ని రద్దు చేయడం ప్రారంభిస్తాం,” అని ఒమర్ అబ్దుల్లా ఇటీవల ప్రకటించారు.
పార్టీ ప్రణాళిక మృదువైన వేర్పాటువాద మనస్తత్వాన్ని, కాశ్మీరీ ఆధిపత్యం, జమ్మూ ప్రజల పట్ల, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల పట్ల చులకన భావాన్నీ కనబరుస్తోంది. పార్టీ స్థాపకుడు షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ‘స్వయంప్రతిపత్తి’ వాదాన్ని బలంగా ప్రచారం చేశారు. ఇది 1953లో జవహర్లాల్ నెహ్రూ ఆయన్ను జైలుకు పంపేలా చేసిన ప్రమాదకరమైన నినాదం. మళ్ళీ 2000 సంవత్సరంలో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టేందుకు జమ్మూ కాశ్మీర్ లో అపఖ్యాతి పాలైన ‘స్వయంప్రతిపత్తి’ వాదాన్ని తీసుకువచ్చింది ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వమే. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో తీర్మానాన్ని తిరస్కరించడం ద్వారా ఫరూక్ అబ్దుల్లాకు తగిన విధంగా సమాధానం చెప్పింది. రెండు దశాబ్దాల తర్వాత ఎన్సీ ఎన్నికల ప్రణాళిక మరోసారి స్వయంప్రతిపత్తి, అధికరణం 370 గురించి మాట్లాడటం విచారకరం. ఉగ్రవాద అనుకూల, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి జైలులో ఉన్న ఖైదీలను విడుదల చేయడం గురించి కూడా ప్రణాళిక మాట్లాడుతుంది. శ్రీనగర్‌లోని ప్రసిద్ధ శంకరాచార్య కొండను తఖ్త్-ఐ-సులైమాన్ గా, పక్కనే ఉన్న హరి పర్వతం కోటను కోహ్-ఎ-మారన్ గా ఎన్నికల ప్రణాళిక అభివర్ణించింది.
గుజ్జర్లు, పహాడీలు, ఇతర తెగలకు సామాజిక న్యాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. ఎన్సీ ప్రణాళిక రాష్ట్రంలోని అన్ని రిజర్వేషన్లను ‘సమీక్షించాలని’ కోరుతోంది. ఇది ఎన్సీ జమ్మూ వ్యతిరేక ధోరణులకు అద్దం పడుతోంది. జమ్మూ సమాజంలోని హిందూ ఎస్సీలు, పహాడీలు, ముస్లిం గుజ్జర్లు, బకర్వాల్ల వంటి అట్టడుగు వర్గాలకు సవాలు విసురుతుంది. ఎన్సీ మృదువైన వేర్పాటువాద, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక రాజకీయ ఎజెండాతో భాగస్వాములైనందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. కుటుంబ రాజకీయాల నుంచి ప్రజలను విముక్తం చేసి, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల ద్వారా నిజమైన ప్రజాస్వామ్యానికి నాంది పలకాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ఈ ఎన్నికలు కొనసాగిస్తాయి. ఈ దృక్పథమే కాశ్మీర్ లోయ తన మూడు స్థానాల నుంచి మొదటిసారిగా ఒక సున్నీ, ఒక షియా, ఒక గుజ్జర్ ను పార్లమెంటుకు పంపడానికి దారితీసింది. ఈ లోక్ సభ ఎన్నికల ఫలితం లోయలోని గొప్ప వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ కుల రాజకీయాలను తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంలో బిజెపి బలమైన శక్తిగా కొనసాగుతుండటంతో ఈ ఎన్నికల ఫలితాలు చరిత్రాత్మకం కానున్నాయి. ‘గుప్కారీ’ల విష కౌగిలి నుంచి ప్రజలు విముక్తులు కాబోతున్నారు.
రామ్ మాధవ్,
బిజెపి సీనియర్ నాయకులు