కవితను తప్పించేందుకే బిఎల్ సంతోష్ పై కేసు!
అసెంబ్లీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బిజెపి తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విఫల ప్రయత్నాలు వెనుక భారీ కుట్ర ఉన్నట్లు వెల్లడవుతుంది. ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ అంశం వెల్లడైంది. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను దిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా? బిజెపి అధిష్ఠానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ ప్రణాళిక రచించారా? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇచ్చారు. కేసీఆర్ వేసిన ఎత్తుగడ పోలీసుల వైఫల్యంతో విఫలమైనట్లు చెప్పారు. అదొక్కటే కాదు తన నేరాంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్మెంట్)లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు సంచలన అంశాలను వెల్లడించారు.
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలకు సంబంధించి పలు కొత్త విషయాలను రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. బిజెపి పైలెట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపిన విషయం తెలుసుకున్న కేసీఆర్ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని ఆదేశించినట్టు రాధాకిషన్ రావు తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేరసారాలు ఆడాలన్నది కేసీఆర్ ఎత్తుగడ అని ఆయన వివరించారు. ఈ కేసుకు సంబంధించి కీలకంగా భావిస్తున్న కేరళలోని మాతా అమృతానందమయి ఇన్స్టిట్యూట్లో ఉన్న వ్యకిని అరెస్టు చేసేందుకు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు కేరళకు వెళ్లగా అయన తప్పించుకున్నారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతోపాటు, ఇతర అధికారులను చార్టర్డ్ విమానంలో కేరళకు పంపారు. అయినా ప్లాన్ వర్కవుట్ కాలేదు. అంతలోనే న్యాయస్థానం ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి అప్పగించింది. ఈ సమయంలో అనుకున్న విధంగా పని జరగకపోవడంతో పెద్దాయన (కేసీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని రాధాకిషన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఆ సమయంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బిజెపికి చెందిన కొందరు టచ్‌లోకి వెళ్లారని, పార్టీ మారేందుకు ఆయన్ను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ నుంచి సమాచారం వచ్చిందని ప్రభాకర్ రావు చెప్పారు. బిజెపిని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేని కేసీఆర్ ఎమ్మెల్యేతోపాటు బిజెపి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాలని సూచించారు. ఈ పనిని ప్రణీత్ రావుకు అప్పగించారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కొన్ని ఆడియో క్లిప్‌లను సేకరించి పంపించాడు. అవే ఆడియో క్లిప్‌లను సీఎం కేసీఆర్‌కు ఇచ్చాం. తమకు అనుకూలంగా పని చేయాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఆదేశించిన సీఎం కేసీఆర్, ఎట్టి పరిస్థితుల్లో బిజెపి నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ఆదేశాలతోనే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి బిజెపి నేతల తరఫున వచ్చిన వారితో సంప్రదింపులు జరిపారు. వీరి వ్యవహారం రికార్డ్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌ను దిల్లీ పంపి కెమెరాలను తెప్పించి, సమావేశానికి ఒకరోజు ముందు ఫామ్‌హౌస్ లో బిగించారని రాధాకిషన్ రావు వివరించారు.
మరోవంక, బిజెపి నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వారితో పాటు, టీవీ5, ఎన్టీవీ చైర్మన్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్‌రావు వాంగ్మూలమిచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్లి ఐన్యూస్ ఎండీశ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రావు అందించిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రవీణ్