కొత్త రేషన్ కార్డులకు మరింకెన్నాళ్లు ఎదురు చూపులు?
ఎంతో ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం… అరకొరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురవుతున్నది. రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం అర్హత కలిగిన కుటంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి తెల్ల రేషన్‌కార్డును ప్రామాణికం చేసింది. దీంతో ఏ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా కచ్చితంగా తెల్ల రేషన్‌కార్డు ఉండాల్సిందే. అధికారంలోకి వస్తే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావొస్తున్నా కొత్త రేషన్‌కార్డులను మాత్రం జారీ చేయడం లేదు. అప్పుడిస్తాం..ఇప్పుడిస్తాం.. అంటూ ప్రకటనలు చేయడమే తప్ప.. ప్రక్రియ మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ఓవైపు పథకాలకు రేషన్‌కార్డును తప్పనిసరి చేయడం, మరోవైపు కొత్తవాటిని జారీ చేయకపోవడంతో అర్హులైన వారు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు. దీంతో తమకు కొత్త కార్డులు జారీ చేయాలంటూ అర్హులైన వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కొత్త రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సమీపిస్తున్నా ఈ విషయంలో ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకవేళ షెడ్యూల్ విడుదలైతే కొత్త పథకాలు అమలు చేసే అవకాశం ఉండదు. ఇదే జరిగితే కొత్త రేషన్‌కార్డుల కోసం మరో మూడు నెలల పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనే మాటే ఉండదు. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు రోజుల క్రితం రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు పథకాలకు కూడా తెల్ల రేషన్‌కార్డును తప్పనిసరి చేసింది. తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే ఈ పథకాలకు అర్హులని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అన్ని అర్హతలున్నా కేవలం తెల్ల రేషన్‌కార్డు లేకపోవడంతో ఆ పథకాలను అందులేకపోతున్నారు. దీంతో అర్హుల్లో అందోళన వ్యక్తమవుతున్నది. ఈ విధంగా ఓవైపు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంటే అర్హత కలిగిన వాళ్లు అసంతృప్తికి లోనవుతున్నారు. తమకు కూడా తెల్ల రేషన్‌కార్డు జారీ చేస్తే పథకాల ద్వారా లబ్ధి పొందే వాళ్లం కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో కొత్త కార్డులు ఎప్పుడిస్తారంటూ గ్రామస్థాయి అధికారులను, నేతలను ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారికి కొత్త కార్డులు ఇవ్వకుండా పథకాలను ఏ విధంగా అమలు చేస్తారంటూ నిలదీస్తున్నారు.
మార్చి 1 నుంచి ఈ రెండు పథకాలు అమల్లోకి తెచ్చామంటున్నారు. దానితో గ్రామాల్లో కొత్త రేషన్‌కార్డు జారీ డిమాండ్ మరింత పెరుగుతుంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 48 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉండగా, అందులో సుమారు 34 లక్షల వరకు 200 లోపు యూనిట్లు వాడుతున్నట్లు డిస్కంలో లెక్కలు ఉన్నాయి. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్ల రేషన్ కార్డు నిబంధనతో విద్యుత్ శాఖ అధికారులు ఫిబ్రవరిలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. నెల చివరి నాటికి గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో మొత్తం 11 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు మాత్రమే గృహజ్యోతి పథకం కింద అర్హులుగా గుర్తించారు. తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల సుమారు 23 లక్షల మంది వరకు ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతిని పొందలేకపోతున్నారు
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కొత్త కార్డులను జారీ చేశామని, తద్వారా సుమారు 21 లక్షల మందికి లబ్ధి చేకూరిందని కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యులు చెబుతున్నారు. 2021లో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 3.11 లక్షల కొత్త రేషన్ కార్డులను పౌరసరఫరాల శాఖ జారీ చేసిందని అంటున్నారు. కానీ అసలైన గణాంకాలతో ప్రభుత్వం ప్రజల ముందుకు రావడం లేదు. తెల్ల రేషన్‌కార్డుల జారీలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌కార్డుల సంఖ్యను పెంచడం వల్ల పథకాల లబ్ధిదారులు పెరిగి ప్రభుత్వంపై ఆర్థికభారం పెరుగుతుందనే ఆందోళనలో ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టం అవుతుంది.
ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉండగా 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో సుమారు మరో 9 లక్షల వరకు రేషన్‌కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. ఈ ఆర్థిక భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త రేషన్‌కార్డుల జారీని మొదలుపెట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే… రెండు నెలల క్రితం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులోనే ప్రత్యేక కాలమ్ పెట్టడం ద్వారా రేషన్‌కార్డుల దరఖాస్తులను స్వీకరించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణ చైతన్య