లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా ఆందోళనలు సిగ్గుచేటు
సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలన పట్ల అభిమానంతోనే వేలాది మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరుతున్నారన్నారు. మార్చ్ 17న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను కండువా కప్పి బిజెపిలోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 400కు పైగా సీట్లను గెలుచుకునే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరి నోట.. మోదీ మాట వినబడుతోందని సమగ్రాభివృద్ధి, పేదలు, అణగారిన వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు మొదలైన వర్గాలంతా ‘మేమంతా మోదీ కుటుంబం’ అని గర్వంగా చెబుతున్నారన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పదేళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో పాటు నిరంకుశ, నియంతృత్వ పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలను ప్రజలు ద్వేషించారన్నారు. కేసీఆర్ కూతురు కవితను మనీలాండరింగ్ కేసులో అధికారులు అరెస్టు చేశారన్నారు. ఈడీ దర్యాప్తులో లభించిన ఆధారాలు, ఆమెతో కలిసి పని చేస్తున్న వారు ఇచ్చిన వాంగ్మూలాల కారణంగానే కోర్టులో హాజరు పరిచారన్నారు. బిజెపికి, ఈడీకి సంబంధం లేదని.. తప్పుచేసింది ఎంతవారైనా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చర్యలు తప్పవన్నారు. చివరకు బిజెపి కార్యకర్తలు తప్పు చేసినా వదిలిపెట్టబోమన్నారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకోవడం, సిగ్గు లేకుండా మద్యం కుంభకోణంలో భాగస్వామి కావడం పట్ల పశ్చాత్తాప పడాల్సింది పోయి.. బిజెపి మీద, మోదీ మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కోర్టు బోనులో తప్పు చేశామని ఒప్పుకుని.. న్యాయపరమైన చర్యలకు సహకరించాల్సింది పోయి.. ఏదో సాధించినట్లు మాట్లాడటాన్ని, సెల్ఫోన్లను ధ్వంసం చేసి.. ఆధారాల్లేకుండా చేసేందుకు ప్రయత్నించిన కవిత తీరును చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ‘తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు కవిత లిక్కర్ కుంభకోణంలో దూరారా? దీని వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తాను పర్యటిస్తున్నప్పుడు ఒక ఊళ్లో 16 బెల్టు దుకాణాలు ఉన్న విషయం చూసి ఆశ్చర్యపోయానని.. తెలంగాణలో బెల్టు షాపులను ప్రోత్సహించి ప్రజల రక్తం తాగిన కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బాటలోనే.. ఇవాళ్టి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బిజెపి తీరును ఇప్పుడు కాంగ్రెస్ కూడా విమర్శిస్తుండటం హాస్యాస్పదమన్నారు. దేశవ్యాప్తంగా అనేక అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నాయకులు వందల కోట్ల రూపాయల నల్లధనంతో పట్టుబడిన విషయాన్ని మరిచారా? అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తెలంగాణలో బిజెపి 17 సీట్లు గెలిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బిజెపి రోజురోజుకూ గ్రామాల్లోనూ బలోపేతం అవుతోందని.. ఇది ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోందన్నారు.
ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధే పరమావధిగా పని చేస్తున్న మోదీ నాయకత్వం పట్ల ఆకర్శితుడనై బిజెపిలో చేరుతున్నట్లు వెల్లడించారు. దీనికితోడు ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో బిజెపి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని.. అందుకే తాను బిజెపిలో చేరానన్నారు. పదేళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా మోదీ పాలన కొనసాగిస్తుండటం పట్ల.. గ్రామాల్లో యువత బిజెపి వైపే మొగ్గుచూపుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, జైపాల్, వన్నాల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఆరూరి రమేశ్ తో పాటుగా.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు తదతరులు పార్టీలో చేరారు.