మహారాష్ట్ర ప్రజలకు మా హామీ ఒక్కటే… అభివృద్ధి
ముంబైలో మహా వికాస్ అఘాది (ఎంవీఏ)కి రెండంకెల సీట్లు రావడం కూడా కష్టమని బిజెపి ముంబై అధ్యక్షుడు, మాజీ మంత్రి ఆశీష్ సెలార్ అన్నారు. ఒక ఆంగ్ల పక్ష పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ఎజెండాతో సహా పలు అంశాలపై చర్చించారు. మాజీ మిత్రుడు ఉద్దవ్ థాక్రేతో బిజెపి సంబంధాలు, వివాదాస్పదమైన ధారవి అభివృద్ధి ప్రాజెక్టు, ముంబైలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. అభివృద్ధి కేంద్ర బిందువుగా బిజెపి నిర్దేశించుకున్న ఎజెండా పార్టీని విజయం వైపు నడిపిస్తుందన్న దృఢవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు:
ప్ర. ఈ ఎన్నికలకు సంబంధించి మీ వ్యూహం లేదా ఎజెండా ఏమిటి ?
జ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఒకే ఒక వాగ్దానం చేస్తున్నాం. అది మహారాష్ట్ర అభివృద్ధి. మహారాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత అభివృద్ధి. మానవీయ దృక్పథంతో కూడిన అభివృద్ధి మా ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశం.
ప్ర: అనేక సంవత్సరాలు మీరు ముంబైలో ఉద్ధవ్ థాక్రేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా ఎన్నికలకు ముందు, ఆ తర్వాత మీరు పొత్తులో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు థాక్రే పార్టీ , బిజెపి విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దీన్ని ఒక ముప్పుగా లేదా పెను సవాలు గా మీరు భావిస్తున్నారా?
జ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. 2014లో థాక్రే అహంకారం ప్రదర్శించారు. అందువల్ల మేం విడిగా పోటీ చేశాం. దాని ఫలితంగా బిజెపి 120 సీట్లు దాటింది. కానీ థాక్రే ఉమ్మడి పార్టీ అందులో సగం సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. 2017లో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో థాక్రే అహంకారంతో విడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దాని ఫలితంగా ఆయన ఉమ్మడి పార్టీ 84 సీట్లు గెలుచుకోగా బిజెపి 82 సీట్లు గెలుచుకుంది. అంటే అహంకారంతో ఉద్ధవ్ ఎప్పుడు విడిగా పోటీ చేసినా ముంబై ప్రజలు బిజెపి పట్ల తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఆయా ఎన్నికల్లో మేం గెలిచాం. గత రెండు ఎన్నికల్లో ఇది స్పష్టంగా రుజువైంది.
ప్ర: లోక్ సభ ఎన్నికల సంగతేమిటి? ముంబైలోని ఆరు నియోజకవర్గాల్లో ఎంవీఏ తక్కువ మెజారిటీతో అయినా నాలుగు సీట్లు గెలుచుకోగా ఎన్డీఏ మహాయుతి రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. లోక్ సభ ఎన్నికలను మీరు ఎలా చూస్తారు?
జ: లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాం. ఆత్మావలోకనం చేసుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. మేం వాటిపై ఆత్మపరిశీలన చేసుకున్నాం. ఇప్పుడు మేం అన్ని రకాల తప్పుదోవ పట్టించే కథనాలను, ప్రచారాలను ఎదుర్కోవడానికి సంసిద్ధులమై ఉన్నాం. ఎంవీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించేందుకు అవసరమైన సాధన సంపత్తి అంతా ఇప్పుడు మాకు ఉంది. వారికి నాలుగు లోక్ సభ స్థానాలు వచ్చి మాకు రెండు స్థానాలే వచ్చినా మొత్తం ఓట్లు చూస్తే వారి కంటే మాకే రెండు లక్షల ఎక్కువ ఓట్లు వచ్చాయి. మేం దీంతో సంతృప్తి చెందటం లేదు. మేం ఇంకా సీట్లు సంపాదించాలనుకుంటున్నాం. ఓట్లకు సంబంధించినంత వరకు ప్రజలు మా వైపే మొగ్గు చూపారు.
ప్ర: మీరు తరచుగా ‘ఓటు జీహాద్’ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీ ఉద్దేశం ముంబై, మహారాష్ట్రలో ముస్లింలు కూడబలుక్కుని ఎంవీఏకు అనుకూలంగా ఓటు వేస్తున్నారని. ముస్లింలు ఎంవీఏకు ఓటు వేయడం మీ దృష్టిలో చట్టవిరుద్ధమా?
జ. ఇక్కడ ప్రశ్న చట్టబద్ధమా, చట్ట విరుద్దామా అన్నది కాదు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక పార్టీ ఒక తరగతి ఓటర్లను బుజ్జగించడానికి కార్యక్రమాలను రూపొందిస్తే, ఆ వర్గాన్ని సంతుష్టీకరించడానికి ఎన్నికల ప్రణాళిక తయారు చేస్తే, ఆ వర్గం వారికి సంబంధించిన అంశాలపైనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అది ఎంతమాత్రం సమ్మతం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కేవలం ఒక వర్గం ఒక మతం లేదా ఒక తెగ ప్రజల గురించే ఆలోచించి సంతుష్టీకరణ రాజకీయాలను అనుసరిస్తే అది ప్రమాదకరం. మా వాదన అదే.
ప్ర: మహారాష్ట్రలో బిజెపి అధికారంలోకి వస్తే అహ్మదాబాద్, గుజరాత్ లతో పోలిస్తే ముంబై బలహీనమవుతుందన్న అంశాన్ని ఎంవీఏ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా చేసుకుంది. ప్రధానమంత్రికి గుజరాత్ తో ఉన్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కూటమి ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.
జ: 2017 ఎన్నికల్లో కూడా వారు ఈ ప్రయత్నం చేశారు. ఫలితం ఏమిటి? ప్రజలు ఇటువంటి సెంటిమెంట్లు లేదా తప్పుడు ప్రచారాలను నమ్మబోమని తెగేసి చెప్పారు.
ప్ర: అంటే ఈ ఎన్నికల్లో మరాఠీ భావన ముంబైలో ఎన్నికల అంశం కాదంటారా?
జ: నేనెప్పుడూ ఆ మాట అనలేదు. మరాఠీ సెంటిమెంటు ఉంది. దాన్ని కాదనను. నేను చెప్పేది ఏమిటంటే ఓట్ల కోసం చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని. మరాఠి ప్రజల ప్రయోజనాలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. మేం గృహ నిర్మాణ పథకాలను అమలు చేశాం. ధారవి మురికివాడ వాసులు సాంకేతికంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గృహాలకు అర్హులు కాకపోయినా వారికి ఇల్లు ఇవ్వాలని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎందుకు? వారు ముంబైలోనే ఉండాలని మేం భావిస్తున్నాం కనుక. ఉద్దవ్ థాక్రే పాలనలో అనేకమంది ముంబై విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీనికి మాకు సమాధానం కావాలి.
ప్ర. మీరు ధారవి గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మీరు ముంబై రియల్ ఎస్టేట్ ను దోపిడీ చేస్తున్న ఒక పారిశ్రామికవేత్తకు ధారవిని ఇచ్చి వేస్తున్నారని శివసేన (యూబీటీ), కాంగ్రెస్ లు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం?
జ: నేను వారిని అడుగుతున్నాను: టీడీఆర్ రేట్లను నిర్ణయించింది ఎవరు? ఇదంతా చేసింది థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ధారవి అభివృద్ధిలో అర్హత లేని వారికి కూడా ముంబైలోనే ఇళ్ళు రాబోతున్నాయి. మా మిల్లులో పని చేసే కార్మికులకు ముంబైలో ఇళ్ళు వచ్చాయి. కొంత మొత్తం చెల్లించి పునరావాస గృహ సదుపాయం పొందడానికి అర్హులైన వారు ధారవిలోనే ఇల్లు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద ఇళ్ళు కట్టి, ఎక్కువ మందికి గృహ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పట్టణ పునరుజ్జీవన పథకం ఈ ప్రాంతం మొత్తాన్ని సమూలంగా మార్చేస్తుంది. అనేక కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉన్నా మేం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు.
ప్ర: ముంబైలో 36 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బిజెపి, దాని మిత్రపక్షాలు ఎక్కువ సీట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు?
జ. నేను నిర్దిష్టమైన సంఖ్య చెప్పలేను కానీ ముంబైలో ఎంవీఏ రెండంకెల సీట్లు సంపాదించడం చాలా కష్టం. వారు నిలబెట్టిన అభ్యర్థులను బట్టి చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.
ప్ర: మహారాష్ట్ర మొత్తం మీద ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా?
జ. నిజంగా చెప్పాలంటే నాలుగైదు నెలలు క్రితం నుంచి పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. అంతకుముందు మేం ఎంవీఏ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వారు కేవలం మా పథకాలను, ప్రజల ప్రయోజనాలను వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఐక్యత లేదు. గందరగోళం వ్యాపించి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు లేని చోట అది రెండు పార్టీల కూటమిలాగే కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలు తప్ప సమైక్య ఎజెండా లేదు. ఎంవీఏ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరని ఉద్ధవ్ థాక్రే అడుగుతూ ఉన్నారు. మహాయుతి కూటమిలో అటువంటి గందరగోళం లేదు.
ప్ర: కానీ మహాయుతి కూటమిలో కూడా విభేదాలు ఉన్నాయి. బిజెపి కార్యకర్తలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. మరోవైపు ఏక్ నాథ్ శిందే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు?
జ ప్రతిపక్ష కూటమికి, మాకు తేడా ఏమిటంటే మాలో ఎవరూ ముఖ్యమంత్రి పదవి గురించి డిమాండ్లు చేయడం లేదు. తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కొందరు కార్యకర్తలు కోరుకోవడం సహజమే. కానీ మా కూటమి అజెండాలో అది భాగం కాదు.
నాగార్జున