Agri Infra

మౌలిక సదుపాయాల ద్వారా రైతుల సాధికారత

రైతుల జీవితాలను మెరుగుపరచాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తపన, వారి పట్ల ఆయన శ్రద్ధ రైతుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన విధానాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మన అన్నదాతల జీవితాలను సమూలంగా మార్చి వేయడం ప్రధానమంత్రి మొట్టమొదటి, అత్యంత ముఖ్యమైన లక్ష్యం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వ మొదటి 100 రోజుల పాలనలో వ్యవసాయానికి, రైతాంగ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం వ్యవసాయరంగ సాధికారత, అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కృషి చేస్తోంది.

రైతుల ఆదాయాలను పెంచడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్), ‘పీఎం ఆశా’ వంటి పథకాల్లో ఇది ప్రతిబింబిస్తుంది. పంట కోసిన తర్వాత జరిగే నష్టాలు మన దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సవాలు. దీనివల్ల వ్యవసాయరంగ ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేగాక లక్షల మంది మన రైతులు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. తాజా అంచనాల ప్రకారం మన దేశంలో మొత్తం ఆహార ఉత్పత్తిలో ఏటా 16-18 శాతం పంట కోసిన తర్వాత వృథా అవుతుంది. పంట కోతలు, నూర్పులు, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ ఇలా వివిధ దశల్లో ఈ నష్టం జరుగుతోంది. పంటల నిల్వకు సరిపడా సదుపాయాలు, శీతల గిడ్డంగులు లేకపోవడం, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అవసరమైన సంఖ్యలో లేకపోవడం, సకాలంలో సరిపడినన్ని రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వీటన్నిటి కారణంగా నష్టాలు భారీగా ఉంటున్నాయి. ఫలితంగా దేశంలో మొత్తం ఆహార భద్రతకు భంగం వాటిల్లుతోంది. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దటానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి కొత్త ఉత్సాహంతో కృషి చేస్తోంది.

నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో ప్రభుత్వం ప్రయోగశాల నుంచి పరిశోధనా ఫలితాలను క్షేత్రస్థాయికి (ల్యాబ్‌తో ల్యాండ్) తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా తగ్గి రైతుల లాభాలు పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి 2020 జూలైలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎంతో దార్శనికతతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని (ఏఐఎఫ్) ప్రారంభించారు. ఇది ఒక పరివర్తనాత్మక పథకం. రైతుల ఆదాయాలను పెంచడం, వ్యవసాయరంగ సదుపాయాలని మెరుగుపరచడం ద్వారా పంట కోసిన తర్వాత జరిగే నష్టాలను నివారించి ఆహార పంటల వృథాను నివారించడం దీని ముఖ్య ఉద్దేశం. కొత్త ప్రాజెక్టులను, అధునాతన టెక్నాలజీలను ప్రోత్సహించడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏఐఎఫ్ కింద బ్యాంకులు మూడు శాతం వడ్డీ రాయితీతో ఏడాదికి గరిష్టగా 9 శాతం వడ్డీతో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పరపతి హామీ నిధి ట్రస్టు కింద రెండు కోట్ల రూపాయల వరకు రుణాలు అందజేస్తాయి. రైతులు తమ ఉత్పత్తుల నాణ్యతను, పరిమాణాన్ని పరిరక్షించుకోవడంతో పాటు వారు మరింత సమర్థంగా మార్కెట్ సౌకర్యాలను పొందేటట్లు చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. దీనివల్ల ఉత్పాదకత పెరగడమే కాక వారి ఆదాయం కూడా పెరుగుతుంది. 

2024 ఆగస్టు వరకు ఈ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన మొత్తం రూ.47,500 కోట్లు దాటింది. ఇందులో రూ.30 వేల కోట్లు వివిధ ప్రాజెక్టుల కింద ఇప్పటికే పంపిణీ చేశారు. ముఖ్యంగా ఇందులో 54 శాతం ప్రాజెక్టులు రైతులు, సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక బృందాలకు సంబంధించినవి. ప్రధానమంత్రి ఆశించింది కూడా ఇదే. సాగు అనంతర మౌలిక సదుపాయాల కల్పనలో రైతుల బలమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనం. పంట కోత అనంతరం వ్యవసాయ ఉత్పత్తుల వృథాను నివారించడానికి సాగు అనంతర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారు. కోత అనంతరం పంట నష్టం నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి నిల్వ, (సాధారణ, శీతల గడ్డంగులు), రవాణా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ గిడ్డంగుల విషయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తితో పోలిస్తే భారత్ ప్రస్తుతం 1,740 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిల్వ సామర్థ్యం లోటు 44 శాతం ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయమే. అలాగే ఉద్యాన పంటల (హార్టికల్చర్) ఉత్పత్తుల (పళ్ళు, కూరగాయలు మొదలైనవి) నిల్వకు 441.9 లక్షల మెట్రిక్ టన్నుల శీతల గిడ్డంగుల సామర్థ్యం కలిగి ఉన్నాం. మన ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దేశంలో ఉత్పత్తి అయ్యే పళ్ళు, కూరగాయల్లో 15.72 శాతం మాత్రమే మనం ఈ గిడ్డంగుల్లో నిల్వ చేయగలం. ఏఐఎఫ్ కార్యక్రమం దాదాపు 500 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్య లోటును భర్తీ చేసేందుకు ఉపయోగపడింది. తద్వారా ఏడాదికి రూ.5,700 కోట్ల పంటకోత అనంతర నష్టాలను నివారించింది. అంతేగాక ప్రధానమంత్రి నాయకత్వంలో సరైన శీతల గిడ్డంగి సదుపాయాలు అభివృద్ధి చేయడం వల్ల ఉద్యాన పంటల నష్టం 10 శాతం తగ్గింది. దాని ద్వారా 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసి రూ.1,250 కోట్లు ఏడాదిలో ఆదా చేయడం జరిగింది. 

వ్యవసాయ రంగం, రైతుల పట్ల ప్రధానమంత్రి కి గల ఈ నిబద్దత వారి ఆర్థిక సాధికారతకు తోడ్పడటంతో పాటు వారి జీవన ప్రమాణాలను కూడా పెంచుతుంది. నరేంద్ర మోదీ సారథ్యంలో ఏఐఎఫ్ వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి విశేషమైన ప్రోత్సాహం కల్పిస్తోంది. 2024 ఆగస్టు నాటికి ఏఐఎఫ్ కింద దేశవ్యాప్తంగా 74,695 వ్యవసాయ మౌలిక సదుపాయాల సంబంధిత కార్యక్రమాలను ఆమోదించారు. వీటిలో 18,508 కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, 16,238 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు, 13,702 గిడ్డంగులు, 3095 సార్టింగ్, గ్రేడింగ్ కేంద్రాలు, 1,901 శీతల గిడ్డంగులు, 21,251 ఇతర రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 74,695 ప్రాజెక్టులు 2015 నుంచి మొత్తం 78,702 కోట్ల పెట్టుబడులను వ్యవసాయ రంగంలోకి ఆకర్షించాయి. వ్యవసాయ రంగంలో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు అసాధారణ పరిణామం. రైతుల్లో వ్యాపార కార్యకలాపాలను ప్రధానమంత్రి ప్రోత్సహిస్తూ ఉండడంతో దేశవ్యాప్తంగా 50 వేల కొత్త వ్యవసాయ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా ఎనిమిది లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ఉద్యోగాల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని 25 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 

ప్రధానమంత్రి సంక్షేమ విధానాలు రైతుల పనితీరులో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి. పొలాల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన రైతులు అనేక రకాల వినియోగదారులకు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సౌలభ్యం కల్పించింది. తద్వారా వారు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొంది తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కలిగింది. ఆధునిక ప్యాకేజింగ్, శీతల గిడ్డంగి వ్యవస్థల కారణంగా రైతులు తమకు లాభం అనిపించినప్పుడు ఉత్పత్తులను విక్రయించి గరిష్ట మైన ధరలను పొందగలరు. ఈ మౌలిక సదుపాయాల కల్పన కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు సగటున 11-14 శాతం ఎక్కువ ధరలను పొందగలుగుతున్నారు.

ప్రధానమంత్రి విధానాలు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు మొండి బకాయిల సమస్యను కూడా నివారిస్తాయి. పరపతి హామీ మద్దతు, వడ్డీపై సబ్సిడీ వల్ల రుణాలు ఇచ్చే సంస్థలు తక్కువ నష్ట భయంతో రుణాలు ఇస్తాయి. నాబార్డ్ మద్దతుతో ఈ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుండడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల మీద పడే వడ్డీ భారం వాస్తవంలో ఒక శాతానికి పరిమితం అవుతుంది. దీనివల్ల ప్రాథమిక సహకార సంఘాలలో సభ్యులైన వేల మంది రైతులకు గణనీయమైన లాభం చేకూరుతుంది. ఏఐఎఫ్ కింద ఇప్పటివరకు నాబార్డ్ 9,573 పిఎసిఎస్ (ప్రాథమిక సహకార సంఘాల) ప్రాజెక్టులను ఆమోదించింది. వీటి విలువ రూ.2,970 కోట్లు. ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాలు నిధి పథకాన్ని క్రమంగా విస్తరించుకుంటూ పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల వ్యూహాన్ని రూపొందించింది. ఉత్పత్తిని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం, పంటలకు న్యాయమైన ధరను కల్పించడం, ప్రకృతి విపత్తుల సమయంలో తగిన నష్టపరిహారాన్ని ఇవ్వడం, పంటల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, ప్రకృతి వ్యవసాయానికి మద్దతు ఇందులో ప్రధాన అంశాలు. ప్రస్తుతం వ్యవసాయ ఆస్తుల అభివృద్ధికి సంబంధించిన మంచి భవిష్యత్తు గల హైడ్రోపోనిక్ ఫార్మింగ్ (మట్టిలో కాక పోషకాలు పుష్కలంగా ఉండే ఇతర పదార్థాల్లో మొక్కల పెంపకం), పుట్టగొడుగుల సాగు, వర్టికల్ ఫార్మింగ్ (తక్కువ భూమిలో నిలువుగా అంతస్తులుగా పంటల సాగు), ఏరోపోనిక్ ఫార్మింగ్ (అసలు మట్టి లేకుండా గాలిలోనే పంటలు సాగు చేయడం), పాలీ హౌస్, గ్రీన్ హౌస్ వంటి ప్రాజెక్టులను కేవలం రైతుల బృందాలు లేక సమూహాలకు మాత్రమే పరిమితం చేశారు. ఏఐఎఫ్ పథకాన్ని ఇప్పుడు సమీకృత ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు కూడా విస్తరించినందున ఈ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులు మెరుగైన ధరలను పొందుతారు. దీనికి తోడు ‘పీఎం-కుసుమ్’ (ప్రధానమంత్రి ఊర్జ సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్) కింద బంజరు, సాగులో లేని భూములు, సాగు భూములు, పచ్చిక భూములు, చిత్తడి నేలల్లో రెండు మెగా వాట్ల వరకు ఉత్పత్తి సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చు. వీటిని కూడా సులభంగా ఏఐఎఫ్ పథకంతో అనుసంధానించవచ్చు. ఈ అనుసంధానం రైతులను లేదా రైతు బృందాలను సాధికారీకరించి వారి హోదాను ‘అన్నదాతల’ స్థాయి నుంచి ‘ఇంధన దాతల’ స్థాయికి పెంచుతుంది. ఏఐఎఫ్ కింద లభించే రాయితీలు రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసుకోవడానికి అవకాశాలను పెంచుతాయి. మొత్తం మీద అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కాలాన్ని పెంచి, రవాణా సామర్థ్యాలను మెరుగుపరచి, గ్రామీణ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసి పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ ను తీరుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయం మౌలిక సదుపాయాల నిధి వ్యవసాయరంగం అభివృద్ధికి, భారతీయ రైతుల సాధికారతకు ఇతోధికంగా తోడ్పడుతూ వికసిత భారత్ వైపు సాగే ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తోంది.

శివరాజ్ సింగ్ చౌహాన్,
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి