పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పునాది సభా నియమావళి
చట్టాలను చేయడం, పర్యవేక్షణ, ప్రభుత్వం ఆర్థికంగా జవాబుదారీగా ఉండేటట్టు చూడటం వంటి పవిత్రమైన బాధ్యతలు చట్టసభలకు ఉన్నాయి. దశాబ్దాలుగా చట్టసభల పాత్ర, బాధ్యతలు ముఖ్యంగా మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేక రెట్లు పెరిగాయి. చట్టసభలలో క్రమశిక్షణ, సభా మర్యాదలను పాటించడం సభ సజావుగా సాగడంలో, సభా కార్యక్రమాల నిర్వహణలో, ఉన్నతమైన ఫలితాల సాధనలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయం సాధించడంలో కీలకమైన ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చట్టసభలలో అంతరాయం ఒక సాధారణ లక్షణంగా మారితే దాని వల్ల ప్రజాధనం వృథా కావడమే కాక చట్టసభలు ప్రజల దృష్టిలో పలుచనై వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. చట్టసభల్లో క్రమశిక్షణ, మర్యాద లేకపోవడం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం.
దేశంలోని చట్టసభల ప్రిసైడింగ్ అధికారుల అత్యున్నత సంస్థ అయిన అఖిల భారత సభాపతుల సదస్సు (ఏఐపీఓసీ) నవంబర్ 2001 సమావేశంలో పార్లమెంటు, రాష్ట్ర , కేంద్రపాలిత (యుటీ) శాసనసభలలో క్రమశిక్షణ, సభామర్యాదలపై చర్చించింది. సభ్యుల కోసం ఒక తీర్మానం, ప్రవర్తనా నియమావళిని ఏకగ్రీవంగా ఆమోదించారు. 2000లో ఏఐపీఓసీ ప్రయత్నాల ఫలితంగా నైతిక నియమావళిపై ఒక ఆపద్ధర్మ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 2015లో లోక్‌సభ శాశ్వత స్థాయీ సంఘంగా మారింది. దాని సిఫార్సులు సభ్యుల ప్రవర్తనపై గణనీయమైన ప్రభావం చూపాయి.
చట్ట సభల్లో సభ్యులు పాటించాల్సిన నియమాలు, సంప్రదాయాలు, మర్యాదలను నియంత్రించే అంశాలు పార్లమెంటరీ ప్రవర్తనా నియమావళిలో భాగం. సభాపతి, సభాధ్యక్షుడి పట్ల, తోటి సభ్యుల పట్ల గౌరవం, చర్చకు సంబంధించిన ప్రసంగాలు, ప్రశ్నల ఔచిత్యం, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, ఇతర సభ్యులకు అంతరాయం కలిగించకపోవడం, రభస చేయక పోవడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ఇతర ఎటువంటి పనులు చేయకపోవడం, సభ్యులు సభలో సముచితమైన, గౌరవప్రదమైన భాషను ఉపయోగించడం ఈ ప్రవర్తనా నియమావళిలో ప్రధానాంశాలు. లోక్‌సభ సభ్యులకు సంబంధించిన నియమాలు, ప్రవర్తనా ప్రమాణాలు ‘లోక్‌సభలో విధివిధానాలు, ప్రవర్తనా నియమావళి’లో ఉన్నాయి. సభ్యులు ఈ నియమాలు, మార్గదర్శకాలపై మంచి అవగాహన కలిగి ఉండాలి. గత అనుభవాల ఆధారంగా నెలకొల్పిన పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాలను కూడా సభ్యులు పాటించాలి. ఒక సభ్యుడు అసమంజసంగా లేదా అనుచితమైన రీతిలో ప్రవర్తించాడో లేడో ప్రతి సందర్భంలోను సభ తనకు గల అధికారాల పరిధిలో నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలోని 105, 194 అధికరణలు పార్లమెంటు, దాని సభ్యుల అధికారాలు, మినహాయింపులను వివరిస్తాయి. ఇవి పార్లమెంటు, దాని సభ్యులు తమ బాధ్యతలను భయం లేదా ఆటంకం లేకుండా నిర్వర్తించేందుకు వీలు కల్పిస్తాయి. సభ్యులు వాటిని చట్టసభల్లో శాసన వ్యవహారాలు, ఇతర కార్యకలాపాల కోసం ప్రభావయుతంగా, నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవాలి. లోక్‌సభ స్పీకర్‌కు రాజ్యాంగం, విధివిధానాలు, సభా ప్రవర్తన నియమాలు, పార్లమెంటరీ సంప్రదాయం ద్వారా విస్తృత అధికారాలు, బాధ్యతలు అప్పగించింది. స్పీకర్‌కు ప్రయోక్తగా, సమావేశాల సమన్వయకర్త మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన పార్లమెంటరీ సంస్కృతీ సంప్రదాయాలను సృష్టించి, మంచి నియమాలను రూపొందించి, పద్ధతులను ప్రోత్సహించే అధికారం కూడా ఆయనకు ఉంది. ఆయనకు గల విస్తృతమైన, భారమైన బాధ్యతల దృష్ట్యా స్పీకర్‌కు క్రమశిక్షణా అధికారాలను కూడా లోక్‌సభ ఇచ్చింది.
సభలో క్రమశిక్షణ, మర్యాదలను కాపాడటం చాలా సున్నితమైన పని. ఉదాహరణకు, సభ్యుడు అనవసరమైన లేదా పరువు నష్టం కలిగించే వ్యాఖ్య చేసినప్పుడు తన అవాంఛనీయ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కోరే, దాన్ని తొలగించమని ఆదేశించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ఒక సభ్యుడు సభలో గొడవకు దిగినప్పుడు, స్పీకర్ నిర్ణయాన్ని ధిక్కరించి సభకు అంతరాయం కలిగించినప్పుడు సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభాపతి అధికారాన్ని ప్రశ్నించకూడదు లేదా అతని/ఆమె సూచనలను విస్మరించకూడదు. చట్టసభ ఆవరణలో తలెత్తే అన్ని ప్రశ్నలపై స్పీకర్ దే తుది నిర్ణయం. సభ్యులు సభాపతిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక అత్యున్నత సంస్థగా, పార్లమెంటు అధికారానికి సజీవ ప్రతీకగా పరిగణించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే భవనం బలంగా నిలబడాలంటే పార్లమెంటరీ ప్రవర్తనా నియమావళి అనే పునాది బలంగా ఉండాలి. పార్లమెంటేరియన్లు, శాసనసభ్యులు, చట్టసభల్లో ఉన్నత ప్రవర్తనా ప్రమాణాలను పాటించినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నట్టు భావించాలి.
ఓం బిర్లా,
లోక్ సభ స్పీకర్