పాతబస్తీలో మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ మోకాలడ్డు.. భూసేకరణే సమస్య!
దశాబ్ద కాలం గడుస్తున్నా హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో కారిడార్ నిర్మాణం సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు 15 కి.మీ మెట్రో కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమై, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించినా ఇప్పటికే పనులు ప్రారంభం కావడం లేదు. పైగా పాతబస్తీలో నిర్మించే 5.5 కి.మీ మెట్రో మార్గానికి గతంలో కేంద్ర అనుమతులు ఇవ్వడంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద నిధులు కూడా మంజూరు చేసింది. పీపీపీ విధానంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ మాత్రం నిర్మాణానికి ముందుకు రావడం లేదు.
ఇప్పటికే మూడు కారిడార్లలో నిర్మించిన మెట్రో మార్గాల నిర్వహణ సంస్థకు భారంగా మారడమే కాకుండా, లాభాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పాతబస్తీలో పెండింగ్‌లో ఉన్న 5.5 కి.మీ (ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా) మెట్రో మార్గాన్ని నిర్మించలేమని చేతులెత్తేసింది. ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా నిర్ణీత సమయంలో ప్రాజెక్టు చేపట్టేందుకు రైట్ ఆఫ్ వే ఇవ్వకపోవడం, ఈలోగా సంవత్సరాలు గడిచిపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడం కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో మెట్రో ప్రాజెక్టు నిర్వహణ ఎల్ అండ్ టీ ఏమాత్రం ఆసక్తి కనబర్చడం లేదని సమాచారం. పాతబస్తీలో మెట్రో కారిడార్ నిర్మించే అలైన్మెంట్ ప్రకారం మెట్రో ప్రాజెక్టును చేపట్టాలంటే 1000కి పైగా ఆస్తులను సేకరిస్తే గానీ మెట్రోకు రైట్ ఆఫ్ వే దొరకదు. ఈ మార్గంలో ఆస్తుల సేకరణకే రూ.600-రూ.800 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. దీనికి తోడు పాతబస్తీ అంటే చాలా రకాల మౌలిక వసతులు మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఉంటాయి. వీటన్నింటినీ మరో చోటుకు తరలించాల్సి ఉంటుంది.
స్థానికంగా నెలకొన్న రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో ఇవన్నీ అంత తేలికగా అయ్యే పనులు కాదని అధికారవర్గాలు భావిస్తున్నాయి. రెండో దశలో ప్రతిపాదించిన మార్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, పాతనగరానికి సంబంధించిన 5.5 కి.మీ మెట్రో కారిడార్ నిర్మాణానికి చాలా చిక్కుముళ్లు ఉండడంతో వాటన్నిటినీ పరిష్కరించే రాజకీయ సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఉందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే పాత నగరానికి సంబంధించిన 5.5 కి.మీ మార్గానికి హెచ్ఎంఆర్ కొత్త డీపీఆర్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అయితే, ప్రస్తుతం హెచ్ఎంఆర్ రూపొందిస్తున్న పాతనగరం మెట్రో డీపీఆర్‌ను అంత సులువుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి కనబడటం లేదు. కొత్త డీపీఆర్‌ను కేంద్రం ముందుకు తీసుకెళ్తే పాత నగరం మెట్రో మార్గాన్ని ఎల్ అండ్ టీ ఎందుకు పూర్తి చేయలేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. వాళ్ల నుంచి ఏమైనా రికవరీ చేయాల్సి ఉందా? ఇంత కాలం ఎందుకు జాప్యం జరిగింది? 2011లోనే అనుమతులు వచ్చిన మొదటి దశ మెట్రోను 2017 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా, ఎందుకు ఆలస్యమైంది? వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఇటువంటి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు చెప్పే పరిస్థితులు కూడా కనబడటం లేదు. పాతనగరంలో మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎల్ అండ్ టీ మెట్రో ముందుకు రాకపోవడంతో కొత్తగా డీపీఆర్ రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తున్నా మెట్రో ప్రాజెక్టు నిర్వహణ అంటేనే ఎల్ అండ్ టీకి భయపడి వెనుకడుగు వేస్తున్న సమయంలో మరో కంపెనీ ముందుకు రావడం అంత తేలికైన అంశం కాదని పలువురు భావిస్తున్నారు.
ప్రవీణ్