NaMo Exhibiton

ప్రజల ఆస్తులు రక్షించే బాధ్యత మాది

Photo Exhibitionహైడ్రా దాడుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైడ్రా దాడులపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోకుంటే బిజెపి తెగించి కొట్లాడేందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు. ప్రజలకు బిజెపి అండగా ఉంటుందన్నారు. ప్రజల ఆస్తులను రక్షించే బాధ్యత తీసుకుంటామన్నారు. ‘‘మీ ఆయుధం మేమవుతాం. ముందు బిజెపి కార్యకర్తలపైన, మాపైన బుల్డోజర్లు దిగిన తరువాతే మీ ఇండ్లను తాకాలి. అందుకు పూర్తిగా సన్నద్ధమై ఉన్నాం.’’ అని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 29న హైదరాబాద్ బర్కత్ పురాలోని బిజెపి సిటీ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా మహాయజ్ఞం – 2024లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ హైడ్రా దాడులు, కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన మోసాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘‘సర్కార్ తీరు డామిట్ కథ అడ్డం తిరిగినట్లుగా ఉంది. పెద్దలు ఆక్రమించిన భవనాలను కూలగొడతారని మేం మొదట భావించాం. కానీ పేదల ఇండ్లు కూలుస్తున్నారు. పేద ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కొత్ల ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేస్తే… ఆ ఇంటి తోరణాలు వాడకముందే వచ్చి కూల్చేస్తున్నారు. అన్ని అనుమతులు తీసుకుని, బ్యాంకు రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే.. వాటిని కూల్చడం ఎంత వరకు న్యాయం? వాళ్లంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్న కుటుంబాలు. ఆ ఇండ్లపై దాడులు చేస్తే వాళ్లకు దిక్కెవరు? వాళ్లు ఎట్లా బతకాలి? కాంగ్రెస్ తీరు వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. దీనిపై ఆలోచించకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం సరికాదు. బిజెపి పూర్తిగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ దాడులకు వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నాం. పేదలకు ఆయుధంగా బిజెపి మారబోతోంది. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడుతుంది.

పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? పేదల ఉసురు తీసుకోవడమే ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? పేదలు కన్నీళ్లు పెడుతుంటే మీకు కన్పించడం లేదా? గతంలో బీఆర్ఎస్ కూడా ఇట్లనే చేసింది. మీరు అదే పంథా కొనసాగుతున్నరు. మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా బీఆర్ఎస్ మోసం చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్లను మోసం చేస్తూనే ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ మోసం చేసింది… కాంగ్రెస్ సైతం 6 గ్యారంటీల అమలు పేరుతో ఓట్లు దండుకుని ప్రజలను నిండా మోసం చేసింది.

పేదల స్థల్లాల్లోనే కలెక్టరేట్లు, పైర్ స్టేషన్ల నిర్మాణం పేరుతో పేదల స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చేస్తోంది. అందుకే పేదలకు అండగా ఉండటానికి, ప్రజల ఆస్తులు కాపాడటానికి బిజెపి తెగించి కొట్లాడేందుకు సిద్ధమైంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ప్రణాళిక రూపొందించి అమలు చేయబోతున్నాం.’’ అని అన్నారు.