రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు
విదేశాల్లో భారత్ ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని, వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తారా? మమ్ముల్ని కూల్చమంటారా? అంటూ సీఎం హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
సెప్టెంబర్ 12న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ జనరల్ బజార్ లో పలువురి బిజెపి సభ్యత్వం నమోదు చేయించారు. బట్టలు, బంగారు దుకాణాల వద్దకు తిరుగుతూ బిజెపి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామాన్య ప్రజలను, ఆటో డ్రైవర్ సహా పలువురి వద్దకు వెళ్లి నేరుగా వెళ్లిన బండి సంజయ్ వారు బిజెపి సభ్యత్వం తీసుకునేలా స్ఫూర్తినింపారు. ఈ సందర్భంగా స్థానిక, జిల్లా నేతలతో కలిసి ప్రఖ్యాతి గాంచిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో తెలంగాణలో సంచలనం సృష్టిస్తామన్నారు. బిజెపి కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ‘‘అక్రమ నిర్మాణాలను మీరే కూలుస్తారా? మమ్ముల్ని కూల్చమంటారా? అని సీఎం చెప్పడం ఆశ్చర్యమేస్తుంది. అవి అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులెట్లా పర్మిషన్ ఇచ్చారు? రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే కూలుస్తారా? ప్రభుత్వ నిర్వాకం వల్లే ఇయాళ అక్రమ నిర్మాణాలు వెలిశాయి కదా? మరి అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో ముందు సమాధానం చెప్పాలి. మేం హైడ్రాకు వ్యతిరేకం కాదు. కానీ పేద, మధ్య తరగతి ఇండ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. పేదల పొట్టకొడితే సహించేది లేదు. 6 గ్యారంటీలపై దృష్టి మళ్లించడానికి హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతున్నారు. దీనిపేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు.
రాహుల్ గాంధీ విదేశాల్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. విదేశాలకు వెళ్లి స్వదేశాన్ని విమర్శిస్తారా? గతంలోనూ విదేశాలకు వెళ్లి భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, జోక్యం చేసుకోవాలని పాశ్చాత్య దేశాలను కోరిన మూర్ఖుడు రాహుల్ గాంధీ. మొన్న అమెరికాకు వెళ్లి భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని, మోదీకి అనుకూలంగా ఉండటం వల్లే బిజెపికి సీట్లు వచ్చాయని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? ఆయనకు ఈ దేశ చట్టాలు, న్యాయస్థానాలు, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకపోవడం సిగ్గుచేటు. సిక్కులు తలపాగా, కడియం పెట్టుకునే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ చెప్పడం సిగ్గుచేటు. సిక్కులను ఊచకోత కోసి దుర్మార్గంగా వ్యవహరించిందే రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ. సిక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేనేలేదు. దేశాన్ని చీల్చాలని కుట్ర చేసే వాళ్లతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నడు. అందుకే ప్రత్యేక దేశం కావాలని భారత్ ను చీల్చాలనుకుంటున్న టెర్రరిస్టు సంస్థలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సమర్థిస్తున్నాయి. దీనిని బట్టి రాహుల్ కు, టెర్రరిస్టు సంస్థలకు లింకులున్నాయని అనుమానం వస్తోంది. అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానే కాదు… ఇటలీ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని మూడు ముక్కలు చేసింది. రాహుల్ గాంధీ పొరపాటున అధికారంలోకి వస్తే మళ్లీ 7 ముక్కలు చేసే ప్రమాదముంది. రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించరు? జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను మళ్లీ తీసుకురావాలని, రెండు జెండాలుండాలని కోరుకునే పార్టీలతో కాంగ్రెస్ జట్టు కట్టడం సిగ్గుచేటు. అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు, రాహుల్ దేశ ద్రోహ వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నా. దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దేశం వదిలి వెళ్లాలని బిజెపి పక్షాన డిమాండ్ చేస్తున్నా.