సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్-ఉత్తమ్ మధ్య ఆధిపత్య పోరు!
గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కన్నా ఎక్కువగా చివరి వరకూ ప్రయత్నం చేసి విఫలమైన సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య నిత్యం ఆధిపత్య పోరు జరుగుతుంది. దీని ప్రభావం కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై పడుతుంది. 2013లోనే రిటైరైనా సాగునీటి శాఖలో కీలకపాత్ర పోషిస్తున్న ఈఎన్‌సీ (జనరల్) మురళీధర్‌రావును కృష్ణా ప్రాజెక్టుల వివాదం జటిలం కావడానికి కారకుడిగా భావించి రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించడానికి కూడా వీరి మధ్య రగులుతున్న విభేదాలే కారణంగా తెలుస్తున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి సొమ్ము కక్కిస్తానంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారంపై దర్యాప్తుకు పట్టుబడుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ పనులు జరిగిన సమయంలో టిపిసిసి అధ్యక్షుడిగా ఆ లావాదేవీలలో పరోక్షంగా సంబంధం ఉందని భావిస్తున్న ఉత్తమ్ కుమార్ మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజి వరకే దర్యాప్తు జరపాలని పట్టుబడుతున్నారు. ఇంతలో కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించే విషయంలో సైతం వీరిద్దరి దారి ఎవరికీ వారుగా ఉంది. ఆ శాఖ చూస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంబంధం లేకుండా ఈ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. గత జనవరి 17న దిల్లీలో కేంద్ర జల్‌శక్తి సమావేశం, ఫిబ్రవరి 1న జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం, ఈ రెండింటిలోనూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మురళీధర్‌రావు ‘కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు అంగీకారమే’ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశంపైనే ఆ విధంగా చెప్పినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం లేకుండానే ‘ప్రాజెక్టుల అప్పగింత’ తతంగం జరిగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికలలో ఓటమి అనంతరం నిరసనల పేరుతో ప్రజల మధ్యకు వచ్చేందుకు ఎప్పుడైతే కేసీఆర్ సిద్ధపడ్డారో వెంటనే రేవంత్ రెడ్డి మాటమార్చారని తెలుస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టుల అప్పగింతకు ఆమోదం తెలపడాన్ని నిర్ధారిస్తూ జనవరి 19న కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశ మినిట్స్‌ను కేంద్రం అధికారికంగా పంపిస్తే, తీరుబడిగా 29వ తేదీన గాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం లేఖ ఇవ్వకపోవడం గమనార్హం.
జనవరి 17న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా కేంద్ర జల్‌శక్తిశాఖ ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోనే సమావేశం కావాలని కృష్ణా బోర్డుకు సూచించింది. వాస్తవానికి గత పదేండ్లలో కేవలం త్రిసభ్య కమిటీ సమావేశాలు మినహా కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశాల్లో ఈఎన్సీలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, ఇతర ఇంజనీర్లు కూడా పాల్గొంటారు. తొలిసారి కేవలం ఇద్దరు ఈఎన్సీలతోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా ఈ సమావేశానికి ఒకరోజు ముందు అంటే జనవరి 31న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బోర్డు సమావేశంపై ఈఎన్సీతోపాటు పలువురు అధికారులతో సమావేశమైనట్టు తెలుస్తున్నది. ‘మీరు సమావేశంలో ఏమీ మాట్లాకుండా… కేంద్ర జల్‌శక్తి శాఖకు జనవరి 27న మనం రాసిన లేఖ ఇచ్చి రండి’ అని మంత్రి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. కానీ ఫిబ్రవరి 1న జరిగిన సమావేశంలో ఈఎన్సీ మురళీధర్‌రావు గంటల తరబడి ‘ఆపరేషన్ ప్రొటోకాల్’పై చర్చించారు. బోర్డు నిర్వహణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా ఆయన ఆ విధంగా వ్యవహరించే అవకాశం లేదు. కృష్ణా బోర్డు వ్యవహారం గత నెల 18 నుంచి రాష్ట్రంలో సంచలనంగా మారుతూ వచ్చింది. ఈ సమయంలో పలు పర్యాయాలు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖకు సంబంధించి సమీక్ష జరిపారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంపైనా సమీక్ష నిర్వహించారు. కానీ ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రం ఎక్కడా ఫిబ్రవరి 4 వరకు అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఆరా తీసినట్టు కూడా సీఎంవో నుంచి సమాచారం బయటికి రాలేదు.
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంపై సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస సమాచారం కూడా లేదని ఈ సందర్భంగా తెలుస్తున్నది. అసెంబ్లీలో కృష్ణా ప్రోజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం సైతం ప్రజల దృష్టిని కాళేశ్వరం అవినీతి నుండి మళ్లించడం కోసమే అని భావించాల్సి వస్తుంది. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి నేతలు ఈ సందర్భంగా మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ కుంభకోణాలపై విరుచుకుపడ్డ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని నిలదీస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను బతికించేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని డ్రామాలు ఆడుతోందని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో విమర్శించారు. బీఆర్ఎస్ ట్రాప్‌లో కాంగ్రెస్ పడొద్దని సూచించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ప్రభుత్వం ఎందుకు తీర్మానం చేసిందో ముఖ్యమంత్రి సభకు తెలిజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లోని 15 ఔట్ లెట్ల నుండి ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఆపగలిగే శక్తి మనకు లేనప్పుడు కేఆర్ఎంబీ ప్రవేశించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
-ప్రవీణ్