Digital Agriculture

సాగు రంగంలో డిజిటల్ విప్లవం

వ్యవసాయ రంగంలో డిజిటల్ ప్రజా మౌలిక వ్యవస్థల (డీపీఐ) కల్పన కోసం రూ.2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ (డిజిటల్ వ్యవసాయ కార్యక్రమం)కు సెప్టెంబర్ 2న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఏమిటి? అది రైతులపైనా, వ్యవసాయ రంగంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుంది?

డీపీఐ మిషన్

వ్యవసాయ రంగంలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల కల్పన ఇతర రంగాలలో ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలనే పోలి ఉంటుంది. ఉదాహరణకు గత అనేక సంవత్సరాలుగా ఆధార్, డిజిలాకర్ డాక్యుమెంట్ ఫోల్డర్, ఎలక్ట్రానిక్ సంతకం వంటి డిజిటల్ ఆవిష్కారాలకు మూలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. వీటి ఆధారంగా తక్షణ నగదు బదిలీకి వీలు కల్పించే యూపీఐ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌ల వంటివి అమల్లోకి వచ్చాయి. అదే బాటలో వ్యవసాయరంగానికి కూడా డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం నడుం బిగించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లో భాగంగా ప్రతిపాదించిన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి అగ్రిస్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్ఎస్), నేల వివరాల మ్యాప్స్. డీపీఐలోని ఈ భాగాలు ప్రతి ఒక్కటి రైతులకు వివిధ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి కచ్చితమైన అంచనాలను అందించే డిజిటల్ సార్వత్రిక పంట అంచనా సర్వే (డీజీసీఈఎస్) అనే సాంకేతిక-ఆధారిత పర్యావరణ వ్యవస్థను రూపొందించడం కూడా ఈ మిషన్ లక్ష్యం.

మిషన్‌కు నిధులు

ఈ మిషన్‌కు రూ.2,817 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇందులో రూ.1,940 కోట్లు కేంద్రం, మిగిలింది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీలు) అందజేస్తాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలలో భాగంగా ఈ మిషన్ ను ప్రారంభించారు. ఈ మిషన్ ను వచ్చే రెండేళ్లలో (2025-26 నాటికి) దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే ఈ మిషన్ ను ప్రారంభించాలని అనుకున్నారు, కానీ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో వాయిదా పడింది. ఆ తర్వాత 2023-24, 2024-25 బడ్జెట్‌లలో వ్యవసాయం కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జూలై 23న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా అన్నారు: “పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, మా ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో రైతులకు, వారి భూములకు విస్తరిస్తూ వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ సంవత్సరం 400 జిల్లాల్లో డీపీఐని ఉపయోగించి ఖరీఫ్ కోసం డిజిటల్ పంటల సర్వే చేపడతారు. 6 కోట్ల రైతులు, వారి భూముల వివరాలను రైతు రిజిస్ట్రీ, భూరిజిస్ట్రీలలోకి తీసుకువస్తాం.”

మిషన్ మూడు స్తంభాలు

వ్యవసాయ రంగానికి డీపీఐని రూపొందించి అమలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకునే పనిలో ఉంది. 19 రాష్ట్రాలు ఇప్పటివరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిషన్ కింద నిర్మించే మూడు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల (డీపీఐ)లో ఒకటైన అగ్రిస్టాక్‌ను అమలు చేయడానికి ప్రాథమిక ఐటీ మౌలిక సదుపాయాలను ప్రయోగాత్మక ప్రాతిపదికన అభివృద్ధి చేసి, పరీక్షించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

(i) అగ్రిస్టాక్

రైతు-కేంద్రితమైన డిజిటిల్ మౌలిక సదుపాయం ‘అగ్రిస్టాక్’లో మూడు ప్రాథమిక వ్యవసాయ రంగ రిజిస్ట్రీలు లేదా డేటాబేస్‌లు ఉంటాయి. రైతుల రిజిస్ట్రీ, జియో-రిఫరెన్స్ చేసిన గ్రామ మ్యాప్‌లు, పంటల సాగు రిజిస్ట్రీ. వీటన్నిటినీ రాష్ట్ర/యూటీ ప్రభుత్వాలు తయారు చేసి నిర్వహిస్తాయి. 

రైతుల రిజిస్ట్రీ: రైతులకు ఆధార్ మాదిరిగానే డిజిటల్ గుర్తింపు (‘రైతు ఐడీ’) ఇస్తారు. దీనికి భూమి, పశువుల యాజమాన్యం, నాటిన పంటలు, జనాభా వివరాలు, కుటుంబ వివరాలు, పథకాలు, పొందే ప్రయోజనాలు మొదలైనవాటిని అనుసంధానిస్తారు. వీటిని ఎప్పటికప్పుడు మార్చుకునే వీలు ఉంటుంది. ఫరూఖాబాద్ (ఉత్తరప్రదేశ్), గాంధీనగర్ (గుజరాత్), బీడ్ (మహారాష్ట్ర), యమునా నగర్ (హర్యానా), ఫతేఘర్ సాహిబ్ (పంజాబ్), విరుదునగర్ (తమిళనాడు) -ఈ ఆరు జిల్లాల్లో రైతు ఐడీల పైలట్ ప్రాజెక్టులు అమలయ్యాయి. ప్రభుత్వం 11 కోట్ల రైతులకు డిజిటల్ గుర్తింపులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో 6 కోట్ల మంది ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరంలో, మరో 3 కోట్లు 2025-26లో, మిగిలిన 2 కోట్ల మంది రైతులకు 2026-27లో గుర్తింపు కార్డులను పొందుతారు.

‘2024-25లో మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం’ కింద ఆగస్టులో రైతుల రిజిస్ట్రీని రూపొందించడానికి రాష్ట్రాలకు ప్రోత్సాహకాల కోసం కేంద్రం రూ.5,000 కోట్లు కేటాయించింది. ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం చేసిన బడ్జెట్ కేటాయింపులకు అదనం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 9న ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించింది. రిజిస్ట్రీని రూపొందించిన తర్వాత రైతులు తమకు కావలసిన సేవలు పొందేందుకు వివిధ రకాల కార్యాలయాలకు తిరగాల్సిన పని ఉండదు. తమ డిజిటిల్ గుర్తింపు ద్వారా, కాగితాలతో పని లేకుండా అన్ని సేవలు పొందవచ్చు.

పంటల సాగు రిజిస్ట్రీ: రైతులు వేసిన పంటల వివరాలను పంటల సాగు రిజిస్ట్రీ (క్రాప్ సోన్ రిజిస్ట్రీ) అందిస్తుంది. ప్రతి పంట సీజన్‌లో డిజిటల్ క్రాప్ సర్వేలు – మొబైల్ ఆధారిత క్షేత్ర సర్వేల ద్వారా సమాచారాన్ని రికార్డు చేస్తారు. పంటల సాగు రిజిస్ట్రీని అభివృద్ధి చేయడానికి 2023-24లో 11 రాష్ట్రాల్లో డిజిటల్ పంటల సర్వేను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా డిజిటల్ పంటల సర్వేను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాలో సర్వే చేస్తారు. మిగిలిన జిల్లాల్లో 2025-26లో పూర్తి చేస్తారు.

భౌగోళిక వివరాలతో (జియో-రిఫరెన్స్ డ్) గ్రామ మ్యాప్‌లు: మ్యాప్‌లు భూ రికార్డులలోని భౌగోళిక సమాచారాన్ని వాటి భౌతిక స్థానాలతో అనుసంధానం చేస్తాయి.

(ii) కృషి డీఎస్ఎస్

ఇటీవల ఆవిష్కరించిన కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్ఎస్), పంటలు, నేల, వాతావరణం, నీటి వనరులు మొదలైన వాటిపై రిమోట్ సెన్సింగ్ ఆధారిత సమాచారాన్ని ఏకీకృతం చేయడానికి సమగ్ర భౌగోళిక సమాచార వ్యవస్థను రూపొందిస్తుంది. ఈ సమాచారం రైతుల పంటల బీమా క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు, పంట సాగు నమూనాలు, కరువు/వరద పర్యవేక్షణ, సాంకేతికత/మోడల్ ఆధారిత దిగుబడి అంచనాలను గుర్తించేందుకు పంట మ్యాప్ ల తయారీకి తోడ్పడుతుంది.

(iii) నేల వివరాల మ్యాప్ లు

మిషన్ కింద దాదాపు 14.2 కోట్ల హెక్టార్ల సాగు భూమిలో సవివరమైన నేల వివరాల మ్యాప్‌లను (1:10,000 స్కేల్‌లో) సిద్ధం చేయాలని భావించారు. 2.9 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో సమగ్ర నేల వివరాల జాబితా ఇప్పటికే పూర్తయింది.

డిజిటల్ సార్వత్రిక పంట అంచనా సర్వే (డీజీసీఈఎస్)

ఇది ఇప్పటికే ఉన్న పంట దిగుబడి అంచనా వ్యవస్థను మెరుగుపరచడానికి, దేశ వ్యవసాయ ఉత్పత్తి అంచనాల కచ్చితత్వం గురించి కొన్నిసార్లు తలెత్తే సందేహాలను పరిష్కరిస్తూ డేటాను మరింత పటిష్టం చేసే దిశగా చేపట్టిన ఒక ప్రధాన ప్రయత్నం. కాగిత రహితమైన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ఆధారిత పంటల సేకరణ, పంట బీమా, క్రెడిట్ కార్డ్-అనుసంధానిత పంటరుణాలు వంటి పథకాలు, సేవలను మరింత సమర్థంగా, పారదర్శకంగా చేయడానికి, ఎరువుల సమతుల్య వినియోగం కోసం వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మెరుగైన డేటా ప్రభుత్వ ఏజెన్సీలకు సహాయపడుతుంది.

డీజీసీఈఎస్ ఆధారిత దిగుబడి, రిమోట్ సెన్సింగ్ డేటాతో పాటు పంట సాగు ప్రాంతంపై డిజిటల్‌గా సేకరించిన సమాచారం పంట ఉత్పత్తి అంచనాల కచ్చితత్వాన్ని పెంచుతుంది. అంతేగాక ఈ సమాచారం పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు, పంటలు, సీజన్ల వారీగా సాగునీటి అవసరాలను అంచనా వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. డీజీసీఈఎస్ శాస్త్రీయంగా రూపొందించిన పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడి అంచనాలను అందిస్తుంది. ఇది వ్యవసాయోత్పత్తిపై కచ్చితమైన అంచనాలను రూపొందించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.