స్వాతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయానికి 50 ఏళ్ళు
గత ప్రధాని ఇందిరా గాంధీ అర్ధరాత్రి సమయాన ఏకపక్షంగా ఎమెర్జెన్సీ విధించి, 21 నెలలు దేశంలో నియంత పాలన కొనసాగించి, ఎన్నో దుర్మార్గాలు చేసింది. క్యాబినెట్ ఆమోదం లేకుండానే పంపిన ఎమెర్జెన్సీ ప్రతిపాదనను అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆమోదించడంతో 1975 జూన్ 25 అర్ధరాత్రి మొదలైన ఈ అత్యవసర పరిస్థితి 1977 మార్చ్ 21 వరకు కొనసాగింది. దీంతో పౌర హక్కులను అడ్డుకునే అధికారం ప్రధానమంత్రికి లభించింది. రాత్రికి రాత్రి పత్రికలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి, వాటిపై సెన్సార్ విధించింది. ప్రజాస్వామిక భారతదేశానికి మాయనిమచ్చ లాంటి ఈ ఎమెర్జెన్సీకి ఇప్పుడు 50 ఏళ్లు.
దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన సర్దార్ పటేల్ ను కాకుండా నెహ్రూ తాత్కాలిక ప్రధానిగా నియమితులవడంతో, సుదీర్ఘకాలంగా నెహ్రూ కుటుంబ పాలనలో మగ్గే దౌర్భాగ్యం దేశానికి ఏర్పడింది. దేశం ముక్కలు కావించబడి, హిందూ దేశంగా ఏర్పడిన మన భారతదేశాన్ని ఓటుబ్యాంకు రాజకీయాల కోసం నెహ్రూ, ఇందిరా గాంధీలు తెచ్చిన హిందూ వ్యతిరేక, ముస్లిం మతవాద చట్టాలు తీసుకొచ్చారు. మహత్మా గాంధీ హత్య(1948), సర్దార్ పటేల్ మరణం(1950), లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక, అనుమానాస్పద మృతి (1966), బలమైన మతోన్మాద ఓటుబ్యాంకుతో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన నెహ్రూ కుటుంబం నియంతృత్వం, దేశంపై కూడా ఏర్పడేందుకు ఆస్కారమైంది.
12 జూన్ 1975న అలహాబాద్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1971 రాయ్ బరేలీ ఎన్నికలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్ధారించి, అనర్హురాలిగా ప్రకటిస్తూ, 6 ఏళ్లు పోటీ చేసే అధికారాన్ని కోల్పోయేలా తీర్పు ఇచ్చారు. దీంతో ఇందిరా గాంధీ, ఆమె వందిమాగధులు చేసిన దురాలోచనే ఈ ఎమెర్జెన్సీ. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.బరువా ‘‘ఇందిరే ఇండియా… ఇండియే ఇందిర’’ అన్న నినాదం ఇందిరా గాంధీ నియంతృత్వ పరిపాలనను సూచిస్తుంది.
ఎమెర్జెన్సీ విధించిన వెంటనే అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీ, మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్ వంటి విపక్ష నేతలతో పాటు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ను కూడా ఇందిరా గాంధీ జైల్లో పెట్టారు. దాదాపు 1లక్షా 30వేల మంది రాజకీయ నాయకులను, సంఘ సేవకులను, ఇతర ప్రజాస్వామ్యవాదులను ముందెన్నడూ జరగని రీతిలో జైల్లో నిర్బంధించారు. ఇందులో 90 శాతం పైగా ఆర్ఎస్ఎష్, జనసంఘ్, ఏబీవీపీ, వీహెచ్పీ లాంటి జాతీయవాద సంస్థల సభ్యులే ఉన్నారు. ఈ ఎమెర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణతో (రాజ్యాంగ పీఠికలో సోషలిజం, సెక్యులరిజం చేర్చడంతో పాటు) పాటు ఎన్నో నియంతృత్వ చట్టాలను తీసుకొచ్చారు. లోక్ సభ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచారు. 1977 జనవరిలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరా గాంధీ ఎన్నికల ప్రకటన చేయడంతో జైలు నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నాయకులు, లోక్ నాయక్ సలహా మేరకు జనతా పార్టీ (భారతీయ జనసంఘ్, ఓల్డ్ కాంగ్రెస్, భారతీయ లోక్ దళ్, సోషలిస్ట్ పార్టీలు కలిసి)ని ఏర్పర్చి, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ను మట్టికరిపించి, ఘనవిజయం సాధించారు. ఇది దేశ ప్రజలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా విశిష్టమైన తీర్పుగా యావత్ ప్రపంచం గుర్తించింది.
జనతా పార్టీలో ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనసంఘ్ తదనంతర రాజకీయ పరిస్థితుల కారణంగా 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి, యావత్ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ప్రజాస్వామ్య పునాదులను పటిష్ట పర్చి మళ్లీ ఏ ప్రభుత్వం ఎమెర్జెన్సీ గురించి ఆలోచించలేని విధంగా దేశ ప్రజలను చైతన్యపర్చింది. గత దశాబ్ద కాలంగా బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం జీర్ణించుకోలేని అవకాశవాద, ప్రాంతీయవాద, కులతత్వ, మతోన్మాద ఓటుబ్యాంకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో దేశ వ్యతిరేక ఉద్యమాలు, హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. దిల్లీ షహీన్ బాగ్ ఆందోళన, దేశ రాజధాని చుట్టూ ఖలిస్తాన్ ప్రేరేపిత రైతు ధర్నాలు వాటికి ఉదాహరణలు. అవకాశవాద ప్రతిపక్షాలు ప్రజాస్వామిక స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్న ముసుగులో ఎన్నో దేశ వ్యతిరేక ఉద్యమాలకు పాల్పడ్డారు, తప్పుడు కేసులు వేసి న్యాయస్థానంలో పరాభవం చెంది క్షమాపణలు కూడా చెప్పారు. అయిననూ బుద్ధి రాక, దేశంలో ఎక్కడా ఏవిధమైన ఎమెర్జెన్సీ పరిస్థితులు లేకున్నా, మోదీ ప్రభుత్వం ఎమెర్జెన్సీ తీరుగా ఉందని చేస్తున్న దుష్ప్రచారం వాళ్ల అధికార దాహానికి, బిజెపి, ఎన్డీఏ, దేశ ఎదుగుదలను ఓర్వలేనితనానికి నిదర్శనం.