తెలంగాణ గమనాన్ని నిర్దేశించే ఎన్నికలు

6 గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గత 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీ నీటి మీది రాతగానే మారింది. యువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ బూటకమైంది. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం పత్తా లేకుండా పోయింది. కాలేజీ వెళ్లే అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న వాగ్దానంలో గాల్లో కలిసిపోయింది. రైతులకిచ్చిన వాగ్దానాలూ మట్టిలో కొట్టుకుపోయాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల అన్యాయమైన బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన హామీకి దిక్కులేకుండా పోయింది. 

ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకుంటుందే కానీ, రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. గురుకులాలపై పర్యవేక్షణ కొరవడడంతో విషహారం ఘటనలతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవడం సాధారణంగా మారిపోయింది. రూ.7,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. సర్టిఫికేట్లు లేని కారణంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదు, ప్రైవేటులోనూ ఉద్యోగాలూ పొందలేకపోతున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేసేందుకు నిరాకరిస్తుండడంతో సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందడం లేదు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317లోని లోపాలను సవరిస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఆ జీవో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఉపాధ్యాయులు, ఎన్జీవోలకు డీఏ చెల్లింపులు జరపడం లేదు. అధికారంలోకి వచ్చిన 6 కొత్త పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వేతన సవరణ కమిషన్ నియామకం సంగతే మరచిపోయింది. ఇక ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి రిటైర్మంట్ బెనిఫిట్స్ అందించలేని దుస్థితిలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి చేరింది. 

వైఫల్యాలు వెక్కిరిస్తున్నా విజయోత్సవాలతో వేడుకలు చేసుకుంటూ కాంగ్రెస్ పెద్దలు ప్రజలను ఏమారుస్తున్నారు. గత ప్రభుత్వంలో మొదలైన నియామక ప్రక్రియకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసి, అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడాన్ని పెద్ద పబ్లిసిటీ స్టంట్ గా మార్చి, చేయని పనులకూ చేసినట్టు ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారు. దిల్లీ పెద్దలను ‘సంతృప్త’ పర్చేందుకు ప్రభుత్వ పెద్దలు కమిషన్లకు తెరతీశారు. ప్రభుత్వం నుంచి ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా 7 నుంచి 16 శాతం వరకు కమిషన్ చెల్లించాలన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. దుష్పరిపాలన, అంతులేని అవినీతి, అరాచకం, కక్షసాధింపు రాజకీయాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారింది.  

ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఉన్నత విద్యావంతులు. సమాజంపై ప్రభావం చూపే ప్రభావశీలురు, ప్రజాస్వామిక విలువలకు పరిరక్షకులు, రాష్ట్రంలో రాజకీయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్నవారు. ఉపాధ్యాయ, పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి నిర్ణయం తెలంగాణ గమనాన్ని నిర్దేశించనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అస్త్ర సన్యాసం చేసింది. కనీసం పోటీ చేసేందుకు ధైర్యం చేయలేకపోయింది. అధికార కాంగ్రెస్ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీకే పరిమితమైంది. ఉపాధ్యాయ నియోజకవర్గంలో అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపినే తెలంగాణకు సరైన ప్రత్యామ్నాయం. ఈ తరుణంలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పట్టభద్రులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నా, అవినీతికి అడ్డుకట్ట వేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచగలిగేది, వంచేది బిజెపి అభ్యర్థులే అనడంలో అతిశయోక్తి లేదు. నీతివంతమైన సమాజానికి మార్గదర్శకులుగా ఉన్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఓటర్లు బాధ్యతతో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.