విదేశీ గడ్డపై రాహుల్ విభజనవాద రాజకీయాలు
రాహుల్ గాంధీ ఇటీవల తన అమెరికా పర్యటనలో భారతదేశం, భారతీయులు, భారతీయ వ్యవస్థలపై మరోసారి బురద జల్లారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. మాట్లాడేటప్పుడు సరైన పదాలను ఎంచుకొని, తాను వాడే పదాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఆయన ప్రకటనల నిండా దాదాపు ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలే ఉంటున్నాయి. ప్రధానమంత్రి భారతీయ రాజ్యాంగంపై ‘దాడి’ చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. నిజానికి రాజ్యాంగానికి తీరని నష్టం కలిగించింది కాంగ్రెస్, గాంధీ కుటుంబమే. ఇందిరాగాంధీ 1975లో అత్యవసర పరిస్థితి విధించారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గం జారీ చేసిన ఒక ఉత్తర్వును రాహుల్ గాంధీ బహిరంగంగా చించివేసి పార్లమెంటరీ ప్రక్రియలను, ప్రజాస్వామ్య ప్రమాణాలను అవమానించారు. దీనికి పూర్తి భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ రాజనీతిజ్ఞులలో ఒకరిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రపంచ నాయకుల్లో అత్యధిక ప్రజాదరణ గల నాయకుడిగా నిలిచారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ఎన్నికవ్వడం ఒక చరిత్రాత్మక పరిణామం. ఇది కూడా ఆయన సాధించిన విజయాలలో ఒకటి. ఆయన నాయకత్వం, దార్శనికత, దేశం పట్ల నిబద్ధతకు ప్రజల్లో గల అపారమైన గౌరవానికి నిదర్శనం ఈ ప్రజాతీర్పు.
రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ జార్జిటౌన్ యూనివర్సిటీలో మాట్లాడుతూ, “భారతదేశంలో న్యాయం నెలకొన్నప్పుడు మేం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. కానీ భారతదేశం న్యాయమైన ప్రదేశం కాదు,” అని అన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని ఇది వెల్లడిస్తోంది. దీనికి భిన్నంగా బిజెపి రిజర్వేషన్ల ద్వారా అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి మొదటి నుంచి పాటుపడుతోంది. బిజెపిలో వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల వారు ఉన్నతమైన పదవులు అధిష్టిస్తారనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రామనాథ్ కోవింద్, కళ్యాణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహన్ వంటి వారే ఉదాహరణ. విధాన నిర్ణాయక పదవుల్లో ఈ వర్గాలకు బిజెపి ప్రధాన పాత్ర కల్పిస్తుందనడానికి వీరే నిదర్శనం. సిక్కులు తలపాగా ధరించాలా? గురుద్వారాలకు వెళ్లాలా? అనే విషయాల్లో భారతదేశంలో వివాదం ఉన్నట్టు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాదు, సిక్కు సమాజాన్ని అవమానించడం కూడా. ఆయన భారతీయ చరిత్రను, ముఖ్యంగా ఆయన తండ్రి హయాంలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి చదవాలి. ఆనాడు అత్యంత దారుణంగా సిక్కులను ఊచకోత కోసిన వారిలో కొందరికి కాంగ్రెస్ మంత్రి పదవులు కూడా ఇచ్చి సత్కరించింది. దేశంలో బలవంతంగా హిందీని ప్రజల మీద రుద్దుతున్నారన్న రాహుల్ గాంధీ ప్రకటన ఉద్దేశం ప్రజలను విభజించడమే. బిజెపి ఎప్పుడూ ప్రతి భాష, సంస్కృతి విలువను గుర్తిస్తుంది. ఇటువంటి బాధ్యతారహితమైన ప్రకటనలు ప్రజల్లో భిన్నవర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడతాయి. హిందీ అన్ని ప్రాంతీయ భాషలకు మిత్రభాష వంటిదని, ఒక భాషతో మరొక భాషకు పోటీ పెట్టకూడదని ఇటీవలే హోం మంత్రి అమిత్ షా హితవు పలికారు. ఇందుకు భిన్నంగా రాహుల్ గాంధీ చేసే ప్రకటనలు భారతదేశంలోని భిన్న మతాలు, భిన్న ప్రాంతీయ అస్తిత్వాల పట్ల ఆయన నిర్లక్ష్యాన్ని సూచిస్తాయి.
ఆయన ప్రసంగంలో ఎక్కువ ఆందోళన కలిగించే విషయం భారతీయ సంప్రదాయాలపై ఆయన చేసిన బహిరంగ దాడి. నైపుణ్యాలు గల వారికి భారతదేశం అన్యాయం చేసిందని, అగౌరవపరిచిందని ఆయన అన్నారు. అయితే బిజెపి ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్, భూపేన్ హజారికా, లతా మంగేష్కర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వంటి అనేకమంది శాస్త్రవేత్తలను, కళాకారులకు భారతరత్న పురస్కారంతో గౌరవించిన విషయం ఇక్కడ గమనార్హం. తన ప్రసంగంలో రాహుల్ గాంధీ చైనాను ప్రశంసించారు. ఆ దేశంలో అమల్లో ఉన్న అనేక నిరంకుశ విధానాలను ఆయన పట్టించుకోలేదు. భారతదేశ ప్రజాస్వామ్యంలోని బలాలను, సుగుణాలను ఆయన గుర్తించలేదు. మరోవైపు చైనాలో వీగర్ ముస్లింలు ఎదుర్కొంటున్న దారుణమైన అణచివేత గురించి ప్రస్తావించనేలేదు. వీగర్ ముస్లింల మానవ హక్కులను చైనా దారుణంగా కాలరాస్తోంది. పెద్ద సంఖ్యలో ముస్లింలు అదృశ్యం అవుతున్నారు. వారిపై సాగుతున్న అణచివేతకు అంతర్జాతీయ సంస్థలు అనేక సాక్ష్యాధారాలను సేకరించాయి. బిజెపి ప్రభుత్వంలో భారతదేశంలో మైనారిటీలు అభివృద్ధి చెందుతున్న విషయాన్ని రాహుల్ గాంధీ విస్మరిస్తున్నారు. విద్య, అభివృద్ధి విషయంలో అన్ని వర్గాల వారికి సమానమైన అవకాశాలు కల్పించే దిశలో మోదీ ప్రభుత్వం విశేషమైన ప్రగతి సాధించింది. మతంతో నిమిత్తం లేకుండా భారతీయ పౌరులందరూ అభివృద్ధి చెందాలని, దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం సమ్మిళిత (అందరినీ కలుపుకొని పోయే) పాలనను అందించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిరంతరం శ్రమిస్తోంది.
ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ ఆరోపణలు దేశానికి మహోన్నతమైన సేవలు అందించిన సంస్థల పట్ల ఆయనలో పాతుకుపోయిన ఏవగింపుకు మరొక నిదర్శనం. స్వాతంత్య్ర పోరాటం, జాతీయ సేవతో సహా భారతదేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ కు గల పాత్ర గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని దీన్ని బట్టి మరోసారి స్పష్టం అవుతోంది. 1934లో మహాత్మా గాంధీ స్వయంగా వార్ధాలో ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్ సమక్షంలో సంఘ్ కార్యకర్తల క్రమశిక్షణను ప్రశంసించిన విషయం బహుశా రాహుల్ కు తెలిసి ఉండకపోవచ్చు. రాహుల్ గాంధీ గత లోక్ సభ నియోజకవర్గం వాయనాడ్ లో ఇటీవల సంభవించిన వరదల సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్ సుదీర్ఘ చరిత్రను విస్మరించడం ద్వారా రాహుల్ గాంధీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఆ సంస్థకు గల లోతైన అనుబంధాన్ని కూడా విస్మరిస్తున్నారు. తన సహజ ధోరణిలోనే రాహుల్ గాంధీ మీడియా పైన, న్యాయవ్యవస్థ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన లోక్ సభ అనర్హతను రద్దు చేస్తూ, ఎన్నికల బాండ్ల వ్యవస్థను చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టే అన్న విషయం ఆయన గుర్తించాలి.
రాహుల్ తరచుగా రాజకీయాల్లో ‘ప్రేమ’ అవసరాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆయన మాటలు, పనులు భారతీయ సంప్రదాయాలు, భాషలు, విలువల పట్ల ద్వేషాన్నే సూచిస్తాయి. ఆయన నిర్వహించిన భారత జోడో యాత్ర సమయంలో కూడా ఆయన తన విభజనవాద రాజకీయాలను ప్రదర్శించారు. సంప్రదాయాలను ఖండించే ముందు దేశానికి సంబంధించి ఆయన దార్శనికత దేశ ప్రజల దార్శనికతకు, కలలకు భిన్నంగా ఎందుకు ఉందో రాహుల్ విశ్లేషించుకోవాలి. వ్యక్తిగత ఆకాంక్షల కంటే జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి నాయకులు అన్ని దేశాలకు ఉండరు. అభివృద్ధి, సమైక్యత, పౌరులందరి సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే బిజెపి బలమైన, సుసంపన్నమైన, రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక సూత్రాలకు అనుగుణంగా దేశ ప్రగతికి ప్రతి ఒక్క వ్యక్తి చేసే కృషిని గౌరవించడానికి నిబద్ధమై ఉంది.
అభినవ్ ప్రకాష్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి