మరోసారి కాంగ్రెస్ తో దోస్తీకి మజ్లీస్ సై!
సుదీర్ఘకాలం కాంగ్రెస్ కు ‘బి’ టీంగా వ్యవహరించి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో తామే ప్రభుత్వం అన్నట్లు వ్యవహరించిన ఒవైసి సోదరుల నేతృత్వంలోని ఎంఐఎం 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దారి మార్చారు. అప్పటి వరకు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఒవైసి సోదరులను ఉద్యమ పార్టీ నేతగా చెప్పుకొన్న కేసీఆర్ ఇంటికివెళ్ళి అడగగానే చేయి కలిపారు. తన ప్రభుత్వంలో చేరమని కేసీఆర్ కోరినా సున్నితంగా నిరాకరించి, తమ చెప్పుచేతలలో ప్రభుత్వం ఉండేటట్లు చేసుకున్నారు. దానితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా జరుపుతామని చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్ ఎంఐఎంకు భయపడి, బిజెపి ఎంతగా విమర్శలు కురిపిస్తున్నా, కేంద్రమే స్వయంగా అధికారికంగా విమోచన దినం జరుపుతున్నా చలించలేదు.
ఇంతలో రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ గద్దెనెక్కడంతో తిరిగి పాత అనుబంధాన్ని పునరుద్ధరించుకొంటున్నట్టు వెల్లడవుతుంది. ఇంగ్లండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ విషయం స్పష్టమైంది. దావోస్ పర్యటనలోనూ, లండన్ నగరంలో థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేసే విషయంలోనూ ఇద్దరు నేతలూ కలిసే పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లారు గాని, ఇతర పక్షాలకు చెందిన వారెవరినీ తన వెంట తీసుకెళ్లలేదు. అసెంబ్లీలో ఎంఐఎం కన్నా బీఆర్ఎస్, బిజెపిలకు ఎక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. కానీ ఒవైసిని మాత్రమే వెంటబెట్టుకు తిరగడం గమనిస్తే తమ రాజకీయ ఉనికి, వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే ఒవైసిలు కాంగ్రెస్ తో మరోమారు మిలాఖత్ అయ్యారని అర్థం అవుతుంది.
అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఒవైసి సోదరులకు సందేశం వ్యక్తం చేశారు. ‘‘మాతో కలిసి ఉంటే ఉండండి … లేదా బీఆర్ఎస్ తో స్నేహం కొనసాగిస్తే మా తడాఖా చూస్తారు’’ అన్నట్లు బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పరోక్షంగా కాంగ్రెస్ తో స్నేహంగా లేని పక్షంలో పాతబస్తీలో ఒవైసి సోదరుల ప్రత్యర్థులను దగ్గరకు తీసి, వారి ఆట కట్టిస్తామని హెచ్చరించారు. అందుకోసమే అన్నట్లుగా ముస్లింలలో ఒవైసి సోదరుల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ వస్తున్న ఎంబీటీని కాంగ్రెస్ కూటమిలో చేర్చుకొని, వారి అభ్యర్థిని హైదరాబాద్ లోక్ సభకు పోటీ చేయిస్తామంటూ ఓ వార్తను కూడా వ్యాప్తి చేశారు. దాంతో అధికారం అండ లేకుండా మనుగడ సాగించలేని ఒవైసి సోదరులు దారికి వచ్చారని రేవంత్, ఒవైసి చెట్టాపట్టాలేసుకొని విదేశాలలో పర్యటించడం వెల్లడిస్తుంది.
ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఒవైసి సోదరులకు సానుకూల సంకేతాలు పంపడం రేవంత్ ప్రారంభించారు. బొటాబొటి ఆధిక్యతతో ఉండడంతో ఎంఐఎం ఎమ్యెల్యేల మద్దతు కీలకం అని భావిస్తున్నట్లుంది. సంప్రదాయాలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చీరాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించారు. మెట్రో రైలు మార్గంలోనూ పాతబస్తీ వాసులను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మార్పులు ప్రకటించారు. రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గాన్ని నిలిపివేసి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఎల్బీ నగర్, పాతబస్తీ మీదుగా మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇది కార్యరూపం దాల్చితే, పాతబస్తీ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మరోవంక, పాతబస్తీలో తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉండాలన్నా, పాతబస్తీలో ప్రభుత్వ అధికారులు అందరూ తమకు వంత పాడాలన్నా రాష్ట్ర ప్రభుత్వంలో స్నేహంగా ఉండక ఓవైసి సోదరులకు తప్పదు.
కొంతకాలంగా పాతబస్తీలో ఎంఐఎం ఓటు బ్యాంకుకు గండి పడుతుంది. ముఖ్యంగా అక్కడ బిజెపి వేగంగా బలోపేతం అవుతుంది. ఈ విషయం జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ వెల్లడైంది. పైగా, తమ ఓటుబ్యాంకుగా ఉంటున్న ముస్లింలలో సైతం తమ పట్ల నమ్మకం క్రమంగా తొలగిపోతున్నట్టు ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తుండటం వారికి ఆందోళన కలిగిస్తున్నది. అందుకనే కాంగ్రెస్ కు స్నేహ హస్తం జాపి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమ ఆటలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
కృష్ణ చైతన్య