Ayodhya Temple

మహోజ్జ్వలం… మహాద్భుతం… నయనానందకరం…

PM Modi at Pran Pratishtha Program Ayodhya

5 శతాబ్దాల కల సాకారమైంది… వందల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది…. కోట్లాది రామభక్తుల స్వప్నం సాక్షాత్కారించింది… రామజన్మభూమిలో శ్రీరాముడి పూజల కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో త్యాగధనుల ఆకాంక్షలు నెరవేరాయి… విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల దశాబ్దాల పోరాటాలు ఫలించాయి… జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా సాగిన అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా యావద్దేశం జై శ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తిపోయింది. త్రేతాయుగం నాటి శ్రీరాముడు ఈ కలియుగంలో సాక్ష్యాత్కరించడంతో అఖండ భారతవని పులకించిపోయింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా పండగ వాతావరణం నెలకొంది. ‘మందిర్‌ కిస్‌తరహ్‌ బనాయా జాయే… యే మహత్వ్‌పూర్ణ్‌ హై’ (ఆలయాన్ని ఎలా నిర్మించాలన్నదే అత్యంత కీలకాంశం) అని భారత ప్రధానిగా వాజ్‌పేయీ వ్యాఖ్యానించిన సుమారు 25 ఏళ్ల తరవాత అయిదో శతాబ్దం నాటి నాగరా వాస్తు నిర్మాణ శైలిలో అత్యద్భుత కళాకౌశలంతో అయోధ్య రామమందిర దివ్యధామం రూపుదిద్దుకుంది… సహస్రాబ్దాల మత విశ్వాసం, శతాబ్దాల క్రితం జరిగిన విధ్వంసం, దాదాపు ఏడు దశాబ్దాలుగా స్వతంత్ర భారతంలో సాగిన న్యాయ సంవాదం వెరసి అయోధ్యాపురిలో శ్రీరాముడి భవ్యరామాలయం రూపుదాల్చింది. భరతజాతికి అత్యంత పూజనీయుడైన శ్రీరాముడు పుట్టిన నేలపై రఘునందుడు ఇప్పుడు శాస్త్రోక్తంగా పూజలు అందుకుంటున్నాడు.

22 జనవరి 2024… ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు…. నవ శకానికి నాంది… కొన్ని సహస్రాబ్దాల పాటు సువర్ణాక్షరాలతో లిఖితమై ఉండే చారిత్రాత్మక దినం… భరతజాతికి అత్యంత పూజనీయుడైన శ్రీరాముడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువుదీరిన దివ్యమైన రోజు… విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులకు  కోట్లాది భక్తుల మనసు పులకిస్తున్న వేళ, దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా జనవరి 22న మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, అంగరంగవైభవంగా పూర్తయింది. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరని రీతిలో నిర్మించిన భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన భక్తకోటి పరవశించిపోయింది. దివ్య మంగళ స్వరూపుడైన ముగ్ధమనోహర రూపాన్ని చూసి తాదాత్మ్యం చెందింది.

శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని మోదీ సంప్రదాయ దుస్తులతో శ్రీరాముడి భవ్యమందిరానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా ప్రారంభమైంది. ప్రధాని ముఖ్య యజమాన్‌గా వ్యవహరించారు. ఆయన సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు జరిగాయి. రామ్‌లల్లా విగ్రహం వద్ద పూజలు చేశాక బాలరాముడికి ప్రధాని మొదటి హారతి ఇచ్చారు. స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రాన్ని ప్రధాని సమర్పించారు. 51 అంగుళాల ఎత్తయిన రామ్‌లల్లా విగ్రహానికి ప్రధాని పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. విగ్రహానికి బంగారు కడ్డీతో తిలకం దిద్దారు. అద్దంలో ముఖారవిందాన్ని రాముడికి చూపించారు. ఆ తర్వాత మోదీ సాష్టాంగ ప్రమాణం చేశారు.

ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి.. మందహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. పవిత్ర క్రతువును పూర్తి చేయడానికి గత 11 రోజులుగా దీక్ష పాటిస్తున్న ప్రధాని.. చరణామృతం స్వీకరించి దానిని విరమించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధిపతి మోహన్‌ భాగవత్‌ తదితరులతో కలిసి మొత్తం కార్యక్రమాన్ని ఆయన జరిపించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఇతర అతిరథ మహారథులు దీనికి హాజరయ్యారు. ప్రధాన కార్యక్రమం అయోధ్యలో జరిగినా దేశంలోనే కాకుండా వేర్వేరు దేశాల్లో అనుబంధంగా నిర్వహించిన కార్యక్రమాలతో అంతటా ఆధ్యాత్మికత ఉట్టిపడింది. రాముడి దర్శనానికి నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న భారతావని అలౌకిక ఆనందంతో పులకించిపోయింది. కళ్ల ముందు దివ్యమంగళ రూపం ఆవిష్కృతం కాగానే భక్తకోటి పరవశించిపోయింది.

ప్రాణప్రతిష్ట వేడుకకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబై కళకళలాడింది. అన్ని ప్రాంతాలూ రామనామ స్మరణతో మార్మోగాయి. రామ్‌లీల, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనేకచోట్ల ఏర్పాటు చేశారు. వేర్వేరు రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట అనంతరం మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ ఆయనకు ‘చరణామృత్‌’ (పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయం) ఇచ్చి ఉపవాసాన్ని విరమింపజేశారు. దేశ, విదేశీ అతిథులు సుమారు ఏడువేల మంది ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు. కార్యక్రమం కోసం మందిర ప్రాంగణాన్ని మూడు టన్నుల పూలతో అలంకరించారు. 20కిపైగా పుష్ప జాతులు అందులో ఉన్నాయి.

25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసే వరకు 50 రకాల పరికరాలతో ‘మంగళ ధ్వని’ వినిపించారు. దీనిలో ఘటం (ఆంధ్రప్రదేశ్‌), వేణువు (ఉత్తర్‌ప్రదేశ్‌), తంబూర (ఛత్తీస్‌గఢ్‌), మృదంగం (తమిళనాడు) వంటివి ఉన్నాయి. సోనూ నిగమ్‌, అనూరాధ పౌఢ్వాల్‌, శంకర్‌ మహదేవన్‌ వంటి ప్రముఖులు రాముడిపై ప్రత్యేక పాటలు పాడారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించాయి. ఆలయం వెలుపల ఆసీనులైన దేశ, విదేశీ అతిథులు ఈ ఘట్టాన్ని పెద్ద తెరలపై వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో లక్షల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపులు తీశారు. రామాలయాలు, హనుమాన్‌ మందిరాలకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లారు.

1885లో మండపం కట్టడానికి మహంత్‌ రఘువర్‌ దాస్‌ స్థానిక కోర్టు అనుమతి కోరడం అయోధ్య అంశంలో న్యాయ పోరాటానికి నాంది పలికింది. రాముని విగ్రహాలను ఆరాధించే హక్కు కోరుతూ 1950లో ఫైజాబాద్‌ కోర్టుకు చేరిన విజ్ఞాపన కాలక్రమంలో ఎన్నో అప్పీళ్లకు, మరెన్నో కీలక మలుపులకు దారితీసింది. కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడివడిన వ్యాజ్యంలో అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ ఇచ్చిన మెజారిటీ తీర్పు 2010లో కక్షిదారుల్ని ఎవరినీ సంతృప్తి పరచలేకపోయింది. తర్వాత ఈ వ్యాజ్యాన్ని 40 రోజుల పాటు కూలంకషంగా విచారించి 2019లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు సయోధ్యను సాకారం చేసింది. ట్రస్టు ఏర్పాటు, ఆలయ నిర్మాణం బాధ్యత బదలాయింపు వడివడిగా పట్టాలకెక్కి దేశ సంస్కృతీ వారసత్వ చిహ్నంగా భవ్య రామాలయం రూపుదాల్చింది!

దేశ విదేశీ భక్తులు ఇచ్చిన విరాళాలతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు రూ.5,500 కోట్ల నిధులు సమకూరగా, రూ.1800 కోట్లతో నిర్మితమైన ఆలయం ఆధ్యాత్మికత ఆధునికతల కలబోతగా అందర్నీ అలరిస్తోంది. భారీ వరదలు, భూకంపాలు, పిడుగుపాట్లను తట్టుకొని, మరమ్మతుల అవసరం లేకుండానే వెయ్యేళ్లు మనగలిగే ఇంజినీరింగ్‌ అద్భుతంగా అయోధ్య ఆలయ నిర్మాణం సాగింది. ఇకమీదట బాలరామయ్యను కళ్ళారా వీక్షించడానికి పోటెత్తే భక్తజనకోటికి ఎలాంటి అసౌకర్యమూ కలగని విధంగా అయోధ్యలో మౌలిక సేవల విస్తరణ పనులూ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. రాముడి దర్శనానికి రోజూ మూడు లక్షల మంది వస్తారన్న అంచనాతో పదేళ్ల కాలావధిలో రూ.85వేల కోట్ల వ్యయం కాగల అయోధ్య పునరభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌కు యోగి సర్కారు ఆమోద ముద్ర వేసింది. అయోధ్య సమగ్రాభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలే వివిధ పథకాల కోసం రూ.32 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. పవిత్ర సరయూ నదీతీరంలో 30 కిలోమీటర్ల పొడవునా ప్రపంచ స్థాయి ఆధునిక నగర నిర్మాణ ప్రణాళిక సైతం సిద్ధమైంది.

PM Modi at Pran Pratishtha Program Ayodhya
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో కార్మికులను పూలతో అభినందించిన ప్రధాని మోదీ

భారత సర్వోన్నత అభివృద్ధికి చిహ్నం : మోదీ

ఎన్నో ఏళ్ల నిరీక్షణ, పోరాటాల తర్వాత మన రాముడు దివ్య మందిరానికి చేరుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం  ఆయన మాట్లాడారు. తొలుత ‘జై సియారామ్‌’ అని నినదించిన మోదీ.. మన రామ్‌లల్లా ఇక టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘‘భారీస్థాయి దివ్యమందిరంలో శ్రీరాముడు కొలువుదీరారు. గర్భగుడి వేడుకలో నాలో కనిపించిన పవిత్ర ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మందిర నిర్మాణం.. ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఈరోజు రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నా. మా ప్రయత్నంలో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే ఇన్నేళ్లు పట్టింది. శ్రీరాముడు ఇప్పుడు మనల్ని క్షమిస్తాడని ఆశిస్తున్నా.  ప్రాణప్రతిష్ట ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు కనిపిస్తూనే ఉంటుంది. జాతి నిర్మాణంలో మన పాత్రను వెయ్యేళ్ల తర్వాత కూడా స్మరించుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశాం. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలి. తదుపరి కార్యాచరణ ఏమిటని ప్రతిఒక్క రామభక్తుడిని, ప్రతి భారతీయుడిని ఈ అయోధ్య ప్రశ్నిస్తోంది. ఈ పవిత్ర క్షణాలు మొదలుకొని మందిర నిర్మాణాన్ని దాటి మనం ముందుకు వెళ్లాలి. బలమైన, ఘనమైన, దివ్యమైన భారత్‌ను వచ్చే వెయ్యేళ్ల కోసం నిర్మించాలి. ఈ దిశగా పనిచేస్తామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, చివరకు న్యాయమే గెలిచిందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. ‘‘ఈ శుభ ఘడియల కోసం 11 రోజుల దీక్ష వహించా. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించా. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నా. సాగర్‌ నుంచి సరయూ వరకు రామనామం జపించా. దేశ ప్రజల సహనం, పరిపక్వతలకు ఈ క్షణం నిదర్శనం. ఇది మన విజయానికే కాదు.. వినయానికి కూడా సూచిక. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రామనామం ఈ దేశ ప్రజల ప్రతి కణంలో నిండి ఉంది. దేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. ఆయన ఆదర్శాలు, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఇది విగ్రహానికే కాదు.. మన విశ్వాసాలకూ ప్రాణప్రతిష్ట. రాముడు వివాదం కాదు సమాధానం. రాముడే భారతదేశ నమ్మకం, ప్రాతిపదిక. దేశ అంతరాత్మ ఆయన. దేశానికి గర్వకారణం, వైభవం ఆ మహనీయుడే. ఆయనే భారత్‌ విధానం. రాముడే నిత్యం.. ఆయనే శాశ్వతం. ఆయన అందరివాడు. రాముడే విశ్వం.. ఆయనే విశ్వాత్మ’’ అని మోదీ పేర్కొన్నారు.

దశాబ్దాల పాటు కొనసాగిన అయోధ్య వివాదాన్ని పరిష్కరించినందుకు న్యాయవ్యవస్థకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణం చట్టప్రకారం జరిగిందని చెప్పారు. ‘రామ మందిరాన్ని నిర్మిస్తే దేశమంతా భగ్గుమంటుందని కొందరు భయపడేవారు. ఈ నిర్మాణం వల్ల అగ్గి కాకుండా శక్తి ఉద్భవించింది. రాముడంటే అగ్గి కాదు.. శక్తి. పరాక్రమవంతుడైన రాముడిని నిత్యం పూజించాలి. రాముడు వేల ఏళ్లుగా మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు. భవిష్యత్తులో మనం అనేక విజయాలు సాధించాలి. భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలి’ అని ఆకాంక్షించారు. రామాయణ ఇతిహాసంలోని పాత్రలైన శబరి, గుహుడు, ఉడత, జటాయువు గురించి మోదీ ప్రస్తావించారు. నవ భారత నిర్మాణానికి ఆయా పాత్రల నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో వివరించారు. చిన్నదా, పెద్దదా అని కాకుండా భారత్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు తనవంతుగా ఏం చేయగలమో అదే చేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జటాయువు లాంటి అంకితభావాన్ని అంతా కనపరచాల్సిన అవసరం ఉందన్నారు. రామమందిర ఉద్యమ సమయంలో ఆందోళనకారులు ప్రతిజ్ఞ చేసిన స్థలంలోనే ప్రధాని ప్రసంగించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికుల మధ్యకు ఆయన వెళ్లి, వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనవెంట పెద్దబుట్టలో తెచ్చిన పూలను గౌరవసూచకంగా వారిపై జల్లారు. మందిర ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుబేర్‌ తిలాను సందర్శించి, శివలింగానికి జలాభిషేకం, ప్రదక్షిణలు చేశారు.

ఐక్యంగా కొనసాగండి: మోహన్‌ భాగవత్‌

రామరాజ్యం వస్తోందని, దేశంలోని ప్రతి ఒక్కరు వివాదాలను విడిచిపెట్టి, ఐక్యమత్యంగా ముందుకు సాగాలని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ ప్రారంభం అనంతరం ఆయన ప్రసంగించారు. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనతో భారత దేశ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లైందని తెలిపారు. నూతన శకంలోకి మన దేశం అడుగుపెట్టిందనడానికి ఇదో సంకేతమని, యావత్తు ప్రపంచానికి భారత్‌ అండగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహా ఎంతో మంది తపస్సు వల్లే బాలరాముడు అయోధ్యకు తిరిగి వచ్చారని అన్నారు.

రామరాజ్య స్థాపన ప్రారంభం: యోగి

బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనతో వివక్షకు తావులేని సామరస్య సమాజానికి నెలవైన రామరాజ్య స్థాపన ప్రారంభమైందని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. అయోధ్య వీధుల్లో ఇక తుపాకీ కాల్పులు వినిపించవని, కర్ఫ్యూలు కనిపించవని అన్నారు. ‘ఈ నగరంలో ఇక దీపోత్సవం, రామోత్సవాలతో పాటు శ్రీరామ సంకీర్తనలు వినిపిస్తాయ’ని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవ వేదికపై ఆదిత్యనాథ్‌ ప్రసంగించారు. ‘500 ఏళ్ల కల నెరవేరిన ఈ క్షణం ఎంతో భావోద్వేగభరితమైనది. దేశమంతటా రామ నామం ప్రతిధ్వనిస్తుంటే… త్రేతా యుగంలోకి మనం అడుగుపెట్టినట్లుగా ఉంది’ అని యూపీ సీఎం కొనియాడారు. ఒక దేశంలోని అత్యధిక ప్రజలు కొలిచే భగవంతుడి జన్మస్థానంలో ఆయనకు ఆలయాన్ని నిర్మించడానికి 5 శతాబ్దాల పాటు నిరీక్షించాల్సిరావడం ప్రపంచంలోనే తొలి దృష్టాంతం కావచ్చునని పేర్కొన్నారు. అయోధ్య .. ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వెలుగొందుతుందన్న భరోసా వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా దీపోత్సవం

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 22 రాత్రి దిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ… దీపాలు వెలిగించారు. రామ్‌లల్లా చిత్రపటానికి హారతి ఇచ్చారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఆ రోజు రాత్రి ఇళ్లలో దీపాలు వెలిగించాలని, దీన్ని దీపావళి పండగలా చేసుకోవాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు, బిజెపి నేతలు తమ గృహాల్లో దీపాలను వెలిగించారు. బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ నేతలతో కలిసి ఆయన అయోధ్యలో జరిగిన ‘బాల రాముడి ప్రాణప్రతిష్ఠ’ వేడుకను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దిల్లీలో వివిధ దేవాలయాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ప్రాణప్రతిష్టకు పరవశించిన ప్రపంచం

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు, ప్రవాస భారతీయులు జనవరి 22న ప్రత్యేక పూజలు, కార్ల ర్యాలీలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌’పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన రామ భక్తులు ఈ వేడుకను వీక్షించారు. భక్తి పాటలు, నృత్యాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వర్జీనియాలోని లోటస్‌ టెంపుల్‌లో సిక్కులు, ముస్లింలు, పాకిస్థానీ అమెరికన్లు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా నగరం లాస్‌ ఏంజెలిస్‌లో 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు.

అయోధ్యలో విగ్రహప్రతిష్ట జరిగిన వెంటనే అమెరికాలోని ప్రపంచ హిందూ మండలి, కెనడా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) సంస్థలు రెండు దేశాల్లోని 1,000కి పైగా ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా రామమందిర యాత్రను ప్రకటించాయి. మసాచుసెట్స్‌లోని బిల్లేరికాలో మార్చి 25నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని వీహెచ్‌పీ తెలిపింది. 45రోజుల పాటు అమెరికా, కెనడాల్లో ఈ యాత్ర కొనసాగనుందని వీహెచ్‌పీ వెల్లడించింది.

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కరేబియన్‌ దీవుల్లోని ట్రినిడాడ్‌, టొబాగో దేశంలో నివసించే భారతీయ మూలాలున్న 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠకు ఒకరోజు ముందే మెక్సికోలోని క్వెరెటారో నగరంలో మొదటి రామమందిరాన్ని ప్రారంభించారు. భారత్‌ నుంచి తీసుకువచ్చిన రామయ్య విగ్రహానికి అమెరికన్‌ పూజారి ప్రాణప్రతిష్ట చేశారు. ఫిజీ రాజధాని సువాలో భారతీయ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో రామ్‌లల్లా ఉత్సవాలను జనవరి 18 నుంచి 22 వరకు నిర్వహించారు.తూర్పు ఆఫ్రికాలోని మారిషస్‌ దేశం హిందుత్వ భావాలున్న ప్రభుత్వ ఉద్యోగులు పూజలు చేసుకునేందుకు వీలుగా రెండు గంటల పాటు విరామం ప్రకటించింది.

PM Modi at Pran Pratishtha Program Ayodhya