కాంగ్రెస్, అవినీతి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు
డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు ఇళ్లు, వ్యాపార స్థలాలు, ఇతరత్రా ప్రాంతాలలో జరిగిన ఐటీ దాడుల్లో కనివినీ ఎరుగని రీతిలో, మునుపెన్నడూ లభించని స్థాయిలో రూ.350 కోట్లకు పైగా నగదు లభ్యం కావడం దేశ ప్రజలను ఒకింత విస్మయానికి గురిచేసింది. దాదాపు వారం రోజుల పాటు యాభై మంది ఐటీ అధికారులు, కొంత మంది బ్యాంకు క్యాషియర్‌లు, 40కు పైగా క్యాష్ కౌంటింగ్ మిషన్‌లు ఈ నగదును లెక్కించడంలో పూర్తి నిమగ్నం నిర్ఘాంతపర్చింది. నోట్లు లెక్కపెట్టలేక అధికారులు సొమ్మసిల్లిపడిపోయారు. క్యాష్ కౌంటింగ్ మిషన్‌లు పలుమార్లు మొరాయించాయి.
ధీరజ్ సాహు రెండు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ, తమకు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా నిర్ణయించిన కాంగ్రెస్ మూడు సార్లు రాజ్యసభకు పంపించింది. ఈవిధంగా ధీరజ్ సాహు దగ్గర దొరికిన వందల కోట్ల నల్లధనంలో కాంగ్రెస్‌కు కూడా భాగస్వామ్యం ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తమిత్రుడిగా, భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తిగా పేరు పొందిన ధీరజ్ సాహు, కాంగ్రెస్ సంబంధం, అవినీతి బట్టబయలవుతున్నది. గత ఏడాది ఆగస్టు 12న ధీరజ్ సాహు అవినీతికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తూ ‘‘పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా దేశంలో నల్లధనం, అవినీతిని చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతుంది, అంత పెద్ద మొత్తంలో నల్లధనం ఒకరి దగ్గర ఎలా పోగవుతుందో నాకు అర్థం కావడం లేదు, ఈ దేశంలో అవినీతిని పారద్రోలేది కేవలం కాంగ్రెస్ మాత్రమే’’ అని కామెంట్ పెట్టారు. నల్లధనం మీద ఎన్నో విమర్శలు చేసిన, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన ధీరజ్ సాహు వద్దనే రికార్డు స్థాయి నల్లధనం లభించడం ‘‘దొంగే దొంగా దొంగా’’ అని అరిచిన చందంగా ఉంది. ఈ ధీరజ్ సాహు 2018 రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్‌లో రూ.34 కోట్ల ఆస్తులను చూపించారు, కానీ లభించిన నగదు వందల కోట్లల్లో ఉండడం కాంగ్రెస్ నాయకుల తీరును బట్టబయలు చేస్తున్నది.
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ అవినీతిని ఈవిధంగా తూర్పారబట్టారు. ‘‘కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అన్నీ కుంభకోణాలే… ఇంతకుముందు వందల కోట్ల కుంభకోణాలు ఉండేవి, ఇప్పుడవి లక్షల కోట్లకు చేరాయి. ఇది కాంగ్రెస్ దేశంలో సాధించిన ఘనత.’’ మహారాష్ట్రలో ఆదర్శ్ కుంభకోణం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ హయాంలో జరిగిన అవినీతి, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హయాంలలో కుంభకోణాలు, దిల్లీలో షీలా దీక్షిత్ స్కామ్‌లు, అదేవిధంగా సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా ప్రమేయంతో 2జీ స్కాం, కామన్‌వెల్త్ గేమ్స్ స్కాం, బొగ్గు కుంభకోణం, ఇలా చెప్పుకొంటూ పోతే కాంగ్రెస్ పాల్పడిన స్కాంలు, కుంభకోణాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అదే రేవంత్ రెడ్డి ఇన్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మార్క్ రాజకీయం.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పరిపాలించిన 5 దశాబ్దాల కాలంలో చేయని అవినీతి లేదు, భ్రష్టు పట్టించని విభాగం లేదు, దోచుకోని క్షేత్రం లేదు. కాంగ్రెస్‌ను ఏ టు జడ్ కుంభకోణాల పార్టీగా ఎంతో మంది రాజకీయవేత్తలు ఎన్నోసార్లు అభివర్ణించారు. మన దేశంలో అవినీతిపై మాట్లాడే అర్హత లేని రాజకీయ పార్టీల్లో మొట్టమొదటిది కాంగ్రెస్. దశాబ్ద కాలం పాటు కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేకపోయినా ఈ స్థాయి నల్లధనం ఒక ఎంపీ దగ్గర మాత్రమే లభించడం కాంగ్రెస్ మార్క్ అవినీతి, అక్రమాలకు మచ్చుతునక.
దేశ ప్రజలందరూ ముఖ్యంగా మన తెలంగాణ బిడ్డలు కాంగ్రెస్ పట్ల ఎంతో జాగరూకత వహించాల్సిన అవసరం ఉంది. మోసపూరిత హామీలకు, దగాకోరు ఉపన్యాసాలకు, మైమరిపించే పప్పుబెల్లాల పథకాలకు ప్రభావితమై ఇటువంటి అత్యంత అవినీతి పార్టీని గెలిపిస్తే రాష్ట్రాలు దివాళా తీస్తాయి, దేశం నాశనం దిశగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్, అవినీతి ఒకే నాణానికి బొమ్మ, బొరుసులుగా ప్రఖ్యాతి గాంచిన ఈ దోపిడీ పార్టీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా బొంద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఏ దేశ ప్రజలకు లేని సువర్ణావకాశం నరేంద్ర మోదీ రూపేణా మన భారతీయులకు ఉండడం ఎన్నో జన్మల పుణ్యఫలం. కాబట్టి, కాంగ్రెస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం కోసం కృషి చేద్దాం.