కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే
తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ, నియంతృత్వ, దగాకోరు పాలనపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేక వైఖరిని ఆసరాగా చేసుకొని బూటకపు హామీలు, గారడీ మాటలు, మీడియా మేనేజ్మెంట్ తో కేవలం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఓడించగలదన్న వాతావరణం ప్రజల్లో కల్పించి, అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చిన తొలినాళ్ల నుంచే పాత ప్రభుత్వ పద్ధతినే అవలంబిస్తోంది. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ లాంటి హామీలతో కేసీఆర్ ప్రజలను దగా చేసినట్టే, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పనలో తన మోసపూరిత వైఖరిని నెమ్మదిగా బయటపెట్టుకుంటున్నది.
మొదటి నుంచీ తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీతో కుమ్మక్కై, మైనార్టీ అనుకూల హిందూ వ్యతిరేక వైఖరితో, ఓటుబ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. సీనియర్ సభ్యులు ఉన్నప్పటికీ ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టి రజాకార్ల అనుకూల, హిందూ వ్యతిరేక వైఖరిని చాటుకుంది. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి, గత 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న అర్చకుల జీతాలు ఇవ్వకుండా, సౌదీ అరేబియాలోనూ నిషేధానికి గురైన తబ్లీగీ జమాతే మతోన్మాద సంస్థ వికారాబాద్ జిల్లా సమావేశాలకు రూ.2.40 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నా డిసెంబర్ 9 నాడే ముఖ్యమైన హామీలన్నీ అమలు చేస్తామని బూటకపు వాగ్దానాలు చేసి, ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే తన అసలు రంగు బయటపెట్టుకున్నది.
దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మునుగోడు ఉప ఎన్నికల వరకు బిజెపి దూకుడును తట్టుకోలేక కేసీఆర్ కుట్రలతో లేచిన కాంగ్రెస్, కేసీఆర్ ను ఓడించి అధికారంలోకి వచ్చి, తర్వాత అదే కేసీఆర్ తో కుమ్మక్కైంది. ఎన్నికల ముందు కాళేశ్వరం దోపిడీపై సీబీఐ దర్యాప్తు కోరిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా పక్కకునెట్టారు. అసెంబ్లీని, అమ్ముడు పోయిన కొన్ని మీడియా సంస్థలను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే కుట్రపూరిత నాటకాలు లోక్ సభ ఎన్నికల వరకు నడపాలని పకడ్బందీ ప్రణాళికతో ఈ రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి. యావత్ దేశంతో పాటు తెలంగాణలోనూ బలంగా ఉన్న మోదీ గాలిని తట్టుకోలేక, అటు కాంగ్రెస్ మేడిగడ్డ, ఇటు బీఆర్ఎస్ నల్గొండ యాత్రల పేరిట హడావిడి ప్రదర్శించారు.
కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలవి కాని హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక మరో కుటుంబ పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కై, ప్రజలను మరింత మోసం చేసేలా రాజకీయాలు నడిపిస్తోంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా 2019లో కేసీఆర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినట్టు, రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లోక్ సభ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ బాటలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నే ఎంచుకున్నది. దీర్ఘకాల ప్రణాళికలతో పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉండేది. కానీ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు విపరీతంగా గుప్పించిన కారణంగా అవి ఇప్పుడు అమలు చేయలేని స్థితిలో ప్రజలను మభ్యపెడుతూ, లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎంచుకుంది.
కేసీఆర్, కాంగ్రెస్ రెండూ ఒకే పద్ధతిలో నడుస్తాయని, మతోన్మాద దోపిడీ రాజకీయాలు చేస్తాయని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 నాయకుడైన మోదీ నాయకత్వంలోని బిజెపిని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డజనుకుపైగా స్థానాలు గెలిపించి, కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు బ్రేక్ వేయాలి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తేనే, దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది, తెలంగాణకు మరింత ఆర్థిక సాయం లభించే అవకాశం ఉంటుంది. కుక్కలు చింపిన విస్తరి లాంటి ఇండీ కూటమిని, తెలివి అనుభవం లేని రాహుల్ నాయకత్వాన్ని ఏమాత్రం సమర్థించినా దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుంది.