President

18వ లోక్‌సభ చారిత్రాత్మకం

Presidentజూన్ 27న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలోని ముఖ్యాంశాలు

భారతదేశంలో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నికలు. ఇందులో 64.2 కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈ ప్రాంతంలోని పరిస్థితిపై జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమైంది. ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఈ ఎన్నికల్లో తొలిసారి అందుబాటులోకి తెచ్చారు. 18వ లోక్‌సభ చారిత్రాత్మకమైనది. ఇది ‘‘అమృత్ కాల్’’ ప్రారంభ సంవత్సరాల్లో ఏర్పడినది. భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవమూ ఇందులో వస్తుంది.

కేవలం 10 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో 11వ స్థానం నుండి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2021-2024 కాలంలో ప్రపంచం కోవిడ్-19 మహమ్మారి, ఘర్షణలను ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం సగటు వార్షిక వృద్ధి రేటు 8% నమోదైంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. 15% వాటాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఇది భారతదేశం వేగవంతమైన ఆర్థిక విస్తరణ, ప్రపంచ వేదికపై పెరుగుతున్న ప్రభావానికి అద్దం పడుతుంది. భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. నిర్మాణ రంగంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలు పెట్టుబడి, ఉపాధిని పెంచాయి. ఐటీ, టూరిజం, హెల్త్‌కేర్ రంగాలలో భారతదేశం కొత్తగా అనేక ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. సెమీకండక్టర్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీల వంటి ‘‘అభివృద్ధి చెందుతున్న రంగాలను’’ ప్రోత్సహించేందుకు అస్సాంలో రూ.27,000 కోట్లతో సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటవుతోంది.

వ్యవసాయ రంగంలో రైతులకు ఉత్పాదకత, విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం పెంపుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, విస్తరించడం, సుస్థిరాభివృద్ధి కోసం సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్పీఓలు) ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి పెట్టింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3.2 లక్షల కోట్లకు పైగా రైతులకు పంపిణీ చేసింది. ఇటీవల రైతులకు రూ.20,000 కోట్లకు పైగా బదిలీ చేసింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రికార్డు స్థాయిలో పెరిగింది. పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ ఉత్పత్తుల సరఫరా గొలుసును ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. భారతీయ ప్రకృతి వ్యవసాయ వ్యవస్థ (బీపీకేపీ) వంటి చర్యలు రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తూ, ప్రకృతి వ్యవసాయం వైపు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ప్రపంచవ్యాప్తంగా మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులకు సహాయం అందించడం, కొత్త ఎగుమతి ఆధారిత వ్యూహాలను రూపొందించడం, సేంద్రియ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్లను (శ్రీ అన్న) సూపర్‌ఫుడ్‌గా ప్రోత్సహిస్తోంది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది.

యోగా, ఆయుష్, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపడంలో భారతదేశం ముందుంజలో ఉంది. భారతీయ నగరాలను కాలుష్య రహితంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వం పర్యావరణహిత హరిత పరిశ్రమలలో పెట్టుబడులను కూడా పెంచుతోంది, ఇది మరిన్ని హరిత ఉద్యోగాలను సృష్టిస్తుంది. భారతదేశంలో ఎయిర్‌లైన్ రూట్‌లు గణనీయంగా వృద్ధి చెందాయి. 2014లో 209 నుండి 2024లో 605కి పెరిగాయి. ఎయిర్ కనెక్టివిటీ విస్తరణతో టైర్-2, టైర్-3 నగరాలు నేరుగా ప్రయోజనం పొందాయి. మెట్రో రైలు వ్యవస్థ 21 నగరాలకు చేరుకుంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వందే మెట్రో వంటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. పీఎం గ్రామ సడక్ యోజన కింద 3,80,000+ కిలోమీటర్ల కంటే ఎక్కువ గ్రామీణ రహదారుల నిర్మాణమయ్యాయి. అహ్మదాబాద్-ముంబైల మధ్య హై-స్పీడ్ రైలు పర్యావరణ వ్యవస్థపై, అలాగే దేశంలోని ఉత్తరం, దక్షిణం, తూర్పున బుల్లెట్ రైలు కారిడార్‌ల కోసం అధ్యయనాలు వేగంగా జరుగుతున్నాయి. 

నారీ శక్తి వందన్ చట్టం అమల్లోకి రావడం వల్ల మన దేశంలో మహిళలకు సాధికారత లభిస్తుంది. మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి కట్టుబడిన మోదీ ప్రభుత్వం కొత్త అభివృద్ధి శకానికి నాంది పలుకుతుంది. 4 కోట్ల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మహిళా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించారు. గత 10 సంవత్సరాలలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాలుగా (ఎస్‌హెచ్‌జీలు)  సంఘటితమయ్యారు. 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీలుగా మార్చడానికి ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) ఆర్థిక సహాయాన్ని కూడా పెంచుతోంది. నమో డ్రోన్ దీదీ పథకం మహిళల నైపుణ్యాలు, ఆదాయ వనరులు, వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు గణనీయమైన సహకారం అందిస్తోంది. ఈ పథకం కింద, స్వయం సహాయక సంఘాలతో అనుబంధానితులైన వేలాది మంది మహిళలకు డ్రోన్‌లను అందజేస్తున్నారు. వారికి డ్రోన్ పైలట్‌లుగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న 30 వేల మంది మహిళలకు కృషి సఖి సర్టిఫికెట్లు అందించారు. సుకన్య సమృద్ధి యోజన కింద బాలికల పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నారు. ఇది భారతదేశంలో మహిళలకు సాధికారత కల్పిస్తోంది.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.78,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. అతి తక్కువ సమయంలోనే 1 కోటి కుటుంబాలకు పైగా ఈ పథకం కింద నమోదయ్యాయి. రూ.24,000 కోట్ల కంటే ఎక్కువ కేటాయింపులతో ప్రధాన మంత్రి జన్ మన్ (ప్రధాన మంత్రి ఆదీవాస్ న్యాయ్ మహా అభియాన్) వంటి పథకాలు భారతదేశంలోని అత్యంత అణిచివేతకు గురైన, ఆదీవాసీ వర్గాల అభివృద్ధికి ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి విపత్తు సమయాల్లో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడానికి ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై)ను ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం 55 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తోంది. దేశంలో 25,000 జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి, అవి సజావుగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత చికిత్స ప్రయోజనం పొందుతారు.

జీఎస్టీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను సాధికారీకరించే మాధ్యమంగా మారింది.  ఇది వ్యాపారాన్ని సులభతరం చేయడంలో సహాయపడుతుంది. ప్రపంచం డిజిటల్ ఇండియా, డిజిటల్ చెల్లింపుల గురించి మాట్లాడుతోంది. దేశ రక్షణ రంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి 40 కంటే ఎక్కువ ఆయుధ కర్మాగారాలను 7 డిఫెన్స్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌గా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఫలితంగా వాటి సామర్థ్యం మెరుగుపడింది. గత దశాబ్దంలో మన రక్షణ ఎగుమతులు రూ.21,000 కోట్లకు చేరి 18 రెట్లకు పైగా పెరిగాయి. గత 10 ఏళ్లలో దేశంలో 7 కొత్త ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 కొత్త ఎయిమ్స్, 315 మెడికల్ కాలేజీలు, 390 యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా వంటి ప్లాట్‌ఫారమ్‌లు దేశంలోని యువత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడ్డాయి. దేశ నిర్మాణంలో యువతను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ‘మై యూత్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 1.5 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ యువ క్రీడాకారులు రికార్డు పతకాలు సాధించారు.

దేశ విభజన వల్ల ప్రభావితమైన కుటుంబాలకు సీఏఏ ఉపశమనం అందిస్తుంది. దీని కింద శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుంది. భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌ గా మార్చడానికి నలంద విశ్వవిద్యాలయంపై దృష్టి సారించి ప్రభుత్వం భారతీయ సంస్కృతిని పునరుద్ధరిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల ప్రచారం ద్వారా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ప్రభుత్వం ప్రగతితో పాటు వారసత్వానికీ పెద్దపీట వేస్తోంది. భగవాన్ బిర్సా ముండా, రాణి దుర్గావతి, రాణి అహల్యాబాయి హోల్కర్ వంటి మహనీయుల జయంతుత్సవాలను నిర్వహిస్తోంది. భవిష్యత్ తరాలు దేశ నిర్మాణానికి దోహదపడేలా స్ఫూర్తిదాయక సాంస్కృతిక వేడుకల ద్వారా జాతి గౌరవాన్ని పెంచుతోంది. ​​’ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం వంటి సాంస్కృతిక వేడుకలను జరుపుకునే సంప్రదాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. డిజిటల్ చెల్లింపులలో భారతదేశం పురోగతి, చంద్రయాన్, ఆర్థిక వృద్ధి, శాంతియుత ఎన్నికలు వంటి అనేక విజయాలు ప్రజాస్వామ్య నాయకుడిగా ప్రపంచ గుర్తింపు పొందిన నాయకుడి నేతృత్వంలో దేశం సాధించింది. మన ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల ప్రక్రియలపై విశ్వాసం పెరిగింది. ఈవీఎంలు సురక్షితం అని నిరూపితమైంది.

కోవిడ్-19, భూకంపాలు, ఘర్షణల సమయంలో మానవ కేంద్రీకృత సంక్షోభ ప్రతిస్పందనకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశం విశ్వబంధుగా ప్రపంచానికి కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. జీ-7, జీ-20 సమ్మిట్‌లలో గ్లోబల్ సౌత్‌కు మద్దతు ఇచ్చి తగిన గుర్తింపు పొందింది. నైబర్‌హుడ్ ఫస్ట్ విధానంలో పొరుగు దేశాలతో సంబంధాలను బలపర్చుకుంటోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవంలోనూ ఇది స్పష్టమైంది. సబ్‌కా సాథ్-సబ్ కా వికాస్‌కు ప్రాధాన్యతనిస్తూ భారతదేశం ఇండో-పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్‌లో సహకారాన్ని మరింతగా పెంచుతోంది. కనెక్టివిటీపై దృష్టి సారిస్తుంది. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టులను 21వ శతాబ్దపు పరివర్తన ప్రాజెక్టు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం, దాని నిబంధనల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌ను పూర్తిగా ఏకీకృతం చేయడం వంటి వాటి ద్వారా రాజ్యాంగ విలువలను పెంపొందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మన దేశం పురోగతి నిజాయితీ, జవాబుదారీతనం, స్ఫూర్తిదాయక 18వ లోక్‌సభ, ప్రపంచంపై భారత బలమైన స్థానంపై ఆధారపడి ఉంటుంది. కొనసాగుతున్న పనులు జాతీయ లక్ష్యాలను సాధించాలంటే సాఫీగా సాగే పార్లమెంటరీ ప్రక్రియ, ప్రజల భాగస్వామ్యం ముఖ్యమైనవి. భారతదేశం 2047 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలలో ప్రస్తుత తరం ప్రముఖ భాగస్వామిగా ఉంటుంది.