5 శతాబ్దాల పోరాటాలకు, నిరీక్షణకు అంగరంగ వైభవంగా తెర
అయోధ్య నూతన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత నయనానందకరంగా సాగింది. గత జూన్ లో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం ప్రకారం జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు ప్రారంభమై 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల దివ్య ముహూర్తంలో (84 సెకన్లు) బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట పూర్తయింది. ఈ మహత్తర ఘట్టాన్ని యావత్ దేశ ప్రజలే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న రామభక్తులు మందిరాల్లో పూజలు, పునస్కారాలు చేస్తూ లైవ్ టెలికాస్ట్ ద్వారా తిలకించి పులకించారు.
ఈ మహోత్సవం కోసం ప్రధాని 11 రోజుల ఉపవాస దీక్ష, కఠిన నేలపై నిద్ర, రాముడు నడయాడిన మార్గంలో, ఇతర ప్రాముఖ్య ఆలయాల సందర్శన చేయడం ఈ మహత్కార్యం పట్ల అతని నిష్టకు సంకేతం. తమిళనాడులో రామసేతును దర్శించి, సముద్ర స్నానం చేశారు. రామేశ్వరం, శ్రీరంగం, ధనుష్కోటి కోదండరాముడి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని, 11 రోజుల దీక్షలో ప్రతి నిత్యం రామాయణం పఠించారు. అయోధ్య రామమందిరానికి తీసుకెళ్లే శ్రీరంగనాథ స్వామి ఆలయంలో పీఠాధిపతి తరఫున ప్రధానమంత్రికి సమర్పించిన పట్టు వస్త్రాలను మోదీ రామ్ లల్లా ఆలయంలో సమర్పించడంతో రంగనాథ స్వామి ఆలయ అర్చకులతో సహా రామభక్తులు ఎంతో హర్షించారు.
500 సంవత్సరాల క్రితం అప్పటికే ఉన్న ఆలయాన్ని మతోన్మాదులు కూలగొట్టి, నిర్మించిన వివాదాస్పద కట్టడం తొలగింపులో అద్వానీ రథయాత్ర సహా 1990, 92 ఉద్యమాలు కీలక ఘట్టాలు. దాదాపు 100 సంవత్సరాలు దేశ న్యాయస్థానంలో విచారణ సాగింది. అయితే 2014లో మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ వేగం పెరిగి, సమున్నత తీర్పు వచ్చింది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మాదిరిగా హిందూ ద్రోహ అఫిడవిట్లు, మోసపూరిత వాదనలు మోదీ ప్రభుత్వ కాలంలో జరగలేదు. రామభక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాస్తవాలకు ప్రతిబింబం కట్టేలా రామజన్మస్థాన రుజువులను హిందూ పవిత్ర గ్రంథాల సాక్షిగా మహోన్నతులైన రామభద్రాచార్యుల వంటి రుషుల సాక్ష్యాలతో, అశోక్ సింఘాల్, బి.పుల్లారెడ్డి వంటి వ్యక్తుల అవిరళ కృషితో సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచడంతో అయోధ్య రామజన్మస్థానంలో భవ్య మందిర నిర్మాణానికి ఏర్పడిన న్యాయ చిక్కులన్నీ తొలగిపోయాయి. భవ్య రామ మందిర నిర్మాణానికి పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడింది.
గత నాలుగు దశాబ్దాల స్వాతంత్ర్య భారత అయోధ్య రామమందిర ఉద్యమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వాటి పరివార క్షేత్రాలైన విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, ఇతర సంస్థల అవిశ్రాంత పోరాటం వలన రామమందిర పునర్నిర్మాణానికి కావాల్సిన పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రామభక్తుల నుంచి సేకరించిన దాదాపు కొన్ని వేల కోట్ల నిధులలో 20 శాతం నిధులను ఉపయోగిస్తూ వేయి సంవత్సరాలకు పైగా నిలబడగలిగే భవ్య రామమందిర నిర్మాణం మహోన్నతంగా జరుగుతున్నది. బాలరాముడి దర్శనం కోసం రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుండడంతో అయోధ్య పట్టణమంతా కాషాయమయమై రామనామ జపంతో మార్మోగుతోంది. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం హిందూ వ్యతిరేకుల ఓట్లపై ఆధారపడ్డ కాంగ్రెస్ సహా కుటుంబ పార్టీలన్నీ ఈ మహత్తర ఘట్టానికి దూరంగా జరిగి, ప్రజల ఆగ్రహానికి గురై, ముందుముందు పూర్తిగా తిరస్కరణకు గురయ్యే పరిస్థితి తెచ్చుకున్నాయి.