5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్‌ విజయానికి సంకేతం

గత నవంబర్‌లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మధ్య, పశ్చిమ భారతంలో ఉన్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌లో బిజెపి క్లీన్‌స్వీప్‌ చేస్తూ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టడం, బిజెపికి ప్రత్యామ్నాయం అంటూ ఈమధ్యనే ఏర్పడిన ఇండీ కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికలు జరిగిన ఈ 5 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌లో గత 20 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు బిజెపి అధికారంలో ఉన్నది. అయినప్పటికీ బిజెపి అఖండ విజయం రాష్ట్రంలో ప్రధాని మోదీ పట్ల, బిజెపి పట్ల, ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పాలన పట్ల ప్రజల సానుకూల వైఖరికి అద్దం పడుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ 2 సంవత్సరాలకు మించి ప్రభుత్వాన్ని నిలుపుకోలేకపోయింది. ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా నిర్వహించలేని దీనస్థితికి దిగజారింది. ఏ ఎన్నికల్లో అయినా కొద్దిపాటి సానుకూల ఫలితాలు వస్తే రాహుల్‌ జోడో యాత్ర ఘనతగా ప్రచారం చేసుకునే కాంగీయులు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ పరాజయం విషయంలో మాత్రం జోడో యాత్రకు సంబంధం లేదన్నట్టు నటిస్తున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోవడమే కాకుండా ఘోర ఓటమి చవిచూసింది. ఎన్నికల ఫలితాల ముందు వచ్చిన ఎగ్జిట్‌ పోల్‌లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, బిజెపి మధ్య హోరాహోరీ ఉంటుందని చెప్పిన సోకాల్డ్‌ ఎనలిస్టులు, రాజకీయ పండితులు బిజెపి ఘనవిజయం, కాంగ్రెస్‌ ఘోర పరాజయంతో షాక్‌ తిన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్రమైన ప్రజావ్యతిరేకతతో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు కాంగ్రెస్‌కు వచ్చిన గెలుపు వారికొక ఊరట. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను విస్మరించినప్పటికీ, బిజెపి తెలంగాణ శాఖ నిరంతర పోరాటాలు, ఉద్యమాలు చేసి కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టింది. కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపు తర్వాత కేసీఆర్‌ అనుకూల మీడియా సహకారంతో, వ్యూహకర్త సునిల్‌ కనుగోలు నక్కజిత్తులతో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాయమాటలతో, కేసీఆర్‌`బిజెపి ఒక్కటే అన్న భయంకర విష ప్రచారంతో, అలవి కాని ఉచిత హామీలతో ప్రజలను మభ్య పెట్టి బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇందులో కేసీఆర్‌ దుర్మార్గపు పాలనే కాకుండా, ఎన్నికల సమయంలో కేసీఆర్‌ స్వయంకృతాపరాధం, బిజెపిని దెబ్బతీసేందుకు తన అనుకూల మీడియాతో కాంగ్రెస్‌ను ఆకాశానికి ఎత్తడం, కేసీఆర్‌ అధికారానికే ఎసరు పెట్టి కాంగ్రెస్‌కు పూర్తి లాభం చేకూర్చింది. దీనికి తోడు ఆర్థికంగా బలంగా ఉన్న సీనియర్‌ నాయకులను విపరీతంగా చేర్చుకోవడం, తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న మీడియాను తమకు అనుకూలంగా మలచుకోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్టు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టిన బిజెపి కృషికి చివరి నిమిషంలో కాంగ్రెస్‌కు ఫలం దక్కింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు, ఒక్క అసెంబ్లీ సీటుతో చతికిలపడ్డ బిజెపి 2019 లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాలతో ఊపందుకుంది. నిరంతర ఉద్యమాలు, ప్రజా పోరాటాలతో ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాలు సాధించి 4 నెలల క్రితం వరకు కేసీఆర్‌ను ఓడిరచగలిగే స్థితిలో బిజెపి ఉంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు జరిపిన భయంకర విష ప్రచారంతో దెబ్బతిని బిజెపి అధికారానికి దూరమైనప్పటికీ ఓట్లు రెట్టింపు చేసుకొని, సీట్లను 1 నుంచి 8కి పెంచుకొని, కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిలను కామారెడ్డిలో ఓడిరచిన ఘనత సాధించి అటు సంతోషం, దుఃఖం మధ్యలో నిలిచింది. 3 రాష్ట్రాల్లో బిజెపి ఘనవిజయం, కాంగ్రెస్‌ ఘోర పరాభవంతో జాతీయ మీడియాతో పాటు ప్రపంచ నాయకులు మోదీకి అభినందనలు, వచ్చే ఎన్నికల్లో గెలుపు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ బిజెపి సమైక్యంగా కేసీఆర్‌, కాంగ్రెస్‌లను దీటుగా ఎదుర్కొంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోదీ విజయానికి అనుకూల వాతావరణం మరింత మెరుగుపడిరది.