Revanth Siddu

సిద్ధరామయ్య కేసులో రేవంత్ కు కూడా నోటీసులు తప్పవా!

ర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని నెలలకే తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశం మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు పెద్ద రాష్ట్రాలు ఇవే కావడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పటికీ, అక్కడ ఆ ప్రభుత్వం అస్థిరత అంచున కొట్టుమిట్టాడుతోంది. ‘ముడా’ భూ కుంభకోణం, వాల్మీకి కార్పొరేషన్‌ కేసులు కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ లో ఓ వర్గం విశేషంగా పావులు కదుపుతూ ఉండగా, ప్రస్తుతం సిద్ధరామయ్య ఎదుర్కొంటున్న కేసుల తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి మార్పు త్వరలోనే జరుగనున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చితే ఆ వెంటనే తెలంగాణలోనూ మార్చాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. అంటే, సిద్ధరామయ్య పదవికి గండి పడితే, రేవంత్ రెడ్డికి కూడా ముప్పు తప్పదనే వాదనలు కాంగ్రెస్ లోనే వినిపిస్తున్నాయి. స్వయంగా ఓ కర్ణాటక మంత్రి ఈ మాటలు చెప్పడం గమనార్హం. పైగా, ప్రస్తుతం సిద్ధరామయ్యపై కేసు విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం నోటీసులు జారీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణలోని రేవంత్‌ సర్కారుపై పడొచ్చని పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్‌ జార్కిహోళి జోస్యం చెప్పారు. మొదటి నుండి సిద్ధరామయ్య వ్యతిరేక వర్గంగా పేరొంది, ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదుపుతున్న సతీశ్‌ జార్కిహోళి ఇప్పుడు పనిలో పనిగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం చెలరేగుతుంది. “ఒకవేళ కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. ఆ ప్రభావం తెలంగాణలోని రేవంత్‌ సర్కారుపై పడొచ్చు. ఇక్కడ సిద్ధరామయ్య ఇబ్బందులను ఎదుర్కొంటే, తర్వాత తెలంగాణలో రేవంత్‌ రెడ్డి కూడా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇక్కడ సిద్ధరామయ్యకు నోటీసులు వచ్చినట్టే, అక్కడ రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చు. ఆయననూ టార్గెట్‌ చేయొచ్చు” అని జార్కిహోళి స్పష్టం చేశారు. “ఇప్పుడు సిద్ధరామయ్యను సీఎం పోస్టు నుంచి తప్పిస్తే, రేవంత్‌నూ తప్పించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే, తప్పు చేసినట్టు మనకు మనం ఒప్పుకొన్నట్టే. కాబట్టి, ‘ముడా’ కేసులో సిద్ధరామయ్యకు మనమంతా అండగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంని మార్చొద్దు. ఈ మేరకు అధిష్టానం దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవాలి’ అని జార్కిహోళి పేర్కొనడం గమనార్హం.

కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే, రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చంటూ ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్‌ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డికి ఏ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశమున్నదంటూ నెట్టింట పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారును కుదిపేస్తున్న ‘మహర్షి వాల్మీకి కార్పొరేషన్‌ లిమిటెడ్‌’లో వెలుగు చూసిన రూ.187 కోట్ల విలువైన కుంభకోణం మూలాలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నివేదిక, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేసిన ఇటీవలి విచారణలో తేలింది. కుంభకోణంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది కంపెనీల ఖాతాలకు రూ.44.6 కోట్లు జమ అయినట్టు సిట్‌ నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఖాతాలు ఐటీ, జ్యువెలరీ, లిక్కర్‌ తదితర రంగాలకు చెందిన కంపెనీలవని తెలుస్తున్నది. ఈ స్కామ్‌ డబ్బునే ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓ పార్టీ ఖర్చు చేసినట్టు సిట్‌, ఈడీ నివేదిక వెల్లడించింది. ‘వాల్మీకి స్కామ్‌’ కాంగ్రెస్‌ పాలిస్తున్న కర్ణాటకలో జరగడం, అక్కడి డబ్బు తెలంగాణకు చేరడం, తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటం, నోటీసుల గురించి ‘వాల్మీకి’ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే.. ఈ స్కామ్‌లోనే రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు వస్తాయా? అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాలను వేధిస్తున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా 89 పోలీసు స్టేషన్లలో ఇప్పటివరకూ 161 కేసులు నమోదయ్యాయి. ఇందులో 70కిపైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో రేవంత్‌ స్వయంగా వెల్లడించారు. 2015లో టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి.. అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఇదే ‘ఓటుకు నోటు’ కేసుగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నది. పెట్టుబడుల పేరిట సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన ‘స్వచ్ఛ్‌బయో’తో ఒప్పందం చేసుకోవడం, ఆ కంపెనీ తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఈడీకి ఫిర్యాదులు కూడా అందాయి. ఇందులో ఏ కేసుకు సంబంధించి రేవంత్‌కు నోటీసులు వస్తాయో అని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.